Saturday, February 7, 2015

మాతృయోచన

ఆల్లదిగో చందమామని చూపెడుతు గోరుముద్దలు కడుపార తినిపించిన తీపిజ్ఞాపకం
మిక్కిలిబాధతో కన్నీరుమున్నీరై ఏడ్చినప్పుడు అక్కునజేరి లాలించిన నీ ఊరడింపు
ఎన్నో జీవితపాఠాలను నీవెంతో కడురమ్యముగా నేర్పించి నన్ను చక్కదిద్దిన నీ తీరు
తల్లివే కాదు నీవు నా పాలిట వరాలకల్పవల్లివి ఈ దీనునిపై కురిసిన అమృతజల్లువి

విజయమంటే విలాసముగాదని విశ్రాంతినెరుగని పోరాటానికది గుర్తింపు అని నీ ఉపదేశం
ఓటమి వలన నవ్వులపాలైతె భావివిజయానికవి ముందేగొట్టిన చప్పటలనుకోమన్నావు
బంగారుభవితకై ప్రస్తుతమనే ఇనుపకుంపటిపై శ్రమసాధనతో పరితపించాలని బోధించావు
అమ్మవే కాదు నీవు ముగ్ధతనొందిన పూలగొమ్మవి ముచ్చటగ మెరిసెడి కుందనబొమ్మవి

- 11/12/2014

అభావ కల్పన

నవ్వులేమొ మువ్వలై
చూపులేమొ అందెలై
హృదయమెమొ రంగమై
మాటలు మరి నాట్యమై

మురిపించి మరిపించి
ఇదె స్వర్గము అనిపించి


కానరాక చీకటై
జాడలేక జడుసుకొని
మదినెల్లా కలవరింత
మాటలెల్ల పలవరింత

తాళలేని తలపులతో
ఎదురుచూసి నిదురవోతి
కలలాయె వెరబొమ్మలు
మెలుకువా మరుభూమి

- 21/12/2014

ఆమ్మకి లాలిపాట

తల్లీ నీ మాటలెల్ల తేనెపలుకులె
పండువెన్నెల తీరు నీదు కరుణలె

మెండైన ప్రేమతోడ పెంచినావు మమ్ము నీవు
నిండుమనము తోడ దీవించవే మా తల్లి

కన్నులార మమ్ము గని మురిసితివి గాదె
వెన్నలాంటి మనసు నీది వన్నెలచిన్నెలదానా

వెన్నుతట్టినది చాలు జో కొట్టెద సేదదీరు
పుట్టినా రోజున ఇంటిపనేల చెప్పు

పాలమీగడోలే నీదు ప్రేమ చాలు మాకింక
కండ్లుకాచి అలసినావు చల్లంగ నిదురోవె

బజ్జోవే నా తల్లి బంగారుకొండ
నిదురోవె ఓ అమ్మ యోచన లేకుండ

లాలిజో లాలిజో బజ్జో బజ్జో
లాలిజో లాలిజో నిదురో నిదురో

- 1/1/2015

నడక

వేకువనే లేచి ఆరుబయటకి వెళ్ళాను
మేడలు మిద్దెలు పాకలు దాటి
పొలాల వైపుకు పడుతున్నాయి అడుగులు
వరికుప్పల మధ్యలోంచి సాగుతోంది నడక
అది పంటల కోతకాలమనుకుంటా
దూరంగా అక్కడక్కడా వెలుతురు 
పొగమంచు ఇంకా వీడిపోలేదు

మన్మధుడు అయిదోబాణంతో కొట్టాడేమో
ప్రకృతంతా స్థంభించిపోయినట్లుంది
మెల్లగాలికి కొబ్బరిమట్టల కదలిక
కనిపించని చిమ్మెట్టల రొద 
నడిచేడప్పుడు చెప్పుల అలికిడి 
ఇవి తప్ప కనుచూపు మేరకి
చుట్టూరా నిశ్శబ్దం కమ్ముకుపోయింది

సన్నగా సద్దుచేస్తు తరలిపోతోంది కోరింగవాగు 
చూడబోతె ఆ వాగు పుడమితల్లికి పట్టుచీర లాగుంది
వాగుపైన చంద్రకాంతేమో ధగధగలాడే వెండి జరిఅంచు

నా నడకలో వేగం తగ్గింది
భయంతో మటుకు కాదు
ఏదో తెలియని పరవశం
నట్టింట్లో ఉన్నంత హాయి
చీకటి గొప్ప అందగత్తె 
ఆ అందం ఆశ్వాదించాలంటే
రెండు కళ్ళు చాలవు
మనసుతో చూడాలి

ఎంతసేపు గడించిందో తెలియలేదు
మబ్బులను చీల్చేస్తు తొలిపొద్దు వెలుగు 
దానికి వంతపాడుతూ పక్షుల కిలకిలలు
చీకటి చిన్నగా నవ్వి మరి సెలవు చెప్పింది
గుండెనెక్కడ పారెసుకున్నానో వెతుక్కుంటూ
దీనంగా ఇంటికి తిరుగుబాట పట్టాను
కాని మనసులో ఎక్కడో చిగురంత ఆశ
మాపటికి మళ్ళీ చీకటి కనువిందు చేస్తుందని

- కృష్ణచైతన్య (పరి,3/1/2015)

స్ఫూర్తి: కవిగురు రవీంద్రుని "సోనార్ తరి" కొంత చదవగానే ఆయన రాసిన విధానం, ప్రకృతిని అతితక్కువ పదాలతో కళ్లకు కట్టినట్ళు వర్ణించడం బాగా నచ్చింది. సోనార్ తరి శైలిలో సరళతెలుగులో రాయాలనిపించింది. మరి నేపథ్యం ఏది అనుకోగానే యానాం చుట్టూ పరిసర ప్రాంతలు మనసులో తళుక్కుమన్నాయి. గోదావరి, పచ్చని పంటపొలాలు, జాలరుల వేటపడవలు, కోరింగనది గుర్తుకొచ్చాయి. యానాం పాతవంతెనదాటి ఎడమవైపున ఇటుకబట్టిల గుండా అప్పుడప్పుడు నడిచి లేదా సైకిలు మీద వెళ్ళేవాడిని. అలా వెళ్తుంటే ఒక్కసారి అంతవరుకు ఉన్న ఊరిని వదిలి ప్రకృతిలోకంలోకి  అడుగుపెడుతున్నట్లు అనిపించేది. ఇక కాకినాడ నుండి యానం బస్సులో వెళ్ళేడప్పుడు పి.మల్లవరం దాటగానే ఒకపక్క పంటచేలు ఇంకోపక్క కోరింగ కనిపిస్తాయి. వీటిని ఊహిస్తు రాయడం జరిగింది. ఇది కవితా అంటే కచ్చితంగా చెప్పలేను కాని నా మనస్సులో వెల్లువలాగ జాలువారిన భావఝరి అంతే.

సూచన: మన్మధుడి ఆయుధం చెరుకువిల్లు. అతడు 5 పూలబాణాలతో ఒక్కో బాణంతో వంటిమీద ఒక్కోచోటన కొడతాడు. అలా కొట్టబడినప్పుడు బాణముబట్టి అవస్థ (స్పందిచే తీరు) మారుతుంది. చివరి బాణం నీలోత్పలము (నీలికలువ) మొత్తం శరిరాన్నే స్థంభింపజేస్తుంది. ఆ సంగతే పైన వర్ణనలో వాడబడింది.

సాగిపో

అర్థంలేని కట్టుబాట్లనే 
ఇరుకు సందుల్లోంచి
సదాచారమనే
స్వేచ్ఛామైదానానికి

మనసుల్లోని సంకుచిత భావాల
ముతక కంపు నుంచి
విశాలహృదయాలతో
గుభాళించే పువ్వలవనంలోకి

అహంకారం కమ్ముకుపోయిన
కటిక చీకటి నుండి
అందరికి సమాన ప్రేమను ప్రసరించే
ప్రజ్ఞాన సూర్యకాంతి వైపుకి

కడుదయనీయ నిట్టూర్పులతో
నిండిన అమావాస్య నుండి
ఆత్మవిశాసం అందించే
ప్రేమామృత పున్నమివెన్నెల్లోకి

పొడిమాటల ఇసుకపేటలు
కమ్మిన ఎడారుల్లోంచి
సత్యశోభిత వాక్కులతో
పరవళ్ళు తొక్కే జలప్రవాహంలోకి

ముందడుగు వేస్తు
కొత్తపుంతలు తొక్కుతు
కొనసాగిపో మానవా

- 29/01/2015

మంచు

నేడు బద్ధకాన్ని విదిలించుకుని విజృంభించింది చలి
మంచుని చూస్తే జెర్మన్‌దళాలు పరినగరాన్ని వశంచేసుకుని
ఏకఛత్రాధిపత్య పాలన విధించినది గుర్తుకొస్తోంది 
ఇళ్ళు, రోడ్లు, పార్కులు, చెట్లు ఒకటేమిటి
దేన్ని వదలకుండా మంచుకంబళితో అమాంతం కప్పేసి
చలికాలం తన అధిపత్యాన్ని చాటుకుంది
పరినగర వైవిధ్యాన్ని మటుమాయం చేస్తు
అన్నిరంగలు తెలుపులో కలిసిపోయాయి
మంచుకురిపించే చలంటే సిసలైన నియంత
ప్రకృతిలోనేగాక మనుషుల్లోవున్న విభిన్నతలన్నీ
చలినియంతకున్న మంచుసేన ముందు మోకరిల్లాల్సిందే

ఏమో ఎవరికి తెలుసు చలంటే సామ్యవాది ఏమో
చూట్టూరావున్న అసమానతలన్ని రూపుమాపేసి
తెలుపుదే తుదిగెలుపని చాటిచెప్తోంది కాబోలు
మునుపటివరుకు కట్టేబట్టల్లో గొప్ప-పేద తేడా కనిపించినా
నేడు మంచుధాటికి అందరు నల్లకోట్లు కప్పుకొని సమానత్వాన్ని చూపాల్సిందే
ఆనాడు అగస్త్ బ్లాంకి ఈ మంచుసేనా విజయాన్ని చూసే
శ్రామికుల నియంతృత్వం అని నొక్కివక్కాణించాడేమో
ఈ నియంతృత్వధోరణిని షాల్ దె గాల్ లాగ ఎదిరిస్తు
జ్ఞాన నభాన మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు
అప్పటివరుకు మంచుసేనలతో స్వైరవిహారంచేస్తున్న
జెనెరాల్ చలి గారికి సాల్యూట్ కొట్టకతప్పదు

-2/1/2015