Saturday, December 7, 2019

కాలపుస్తకం

ఆకాశాన కదలాడే మేఘంలా
ఊహాలోకాల్లో విహరిస్తూ కాలపుస్తకంలోని
అనుభవాల పేజీలను వెనక్కి తిరగేసి
గత జీవితాన్ని నెమరేసుకుంటూ
విహంగవీక్షణం చేస్తోంది నా మనసు
కొన్ని జ్ఞాపకాలు వీడ్కోలు పలికితే
మరికొన్ని నీడలా వెంటాడుతున్నాయి
ఈ మబ్బుల వెనక మిణుక్కుమనే నక్షత్రాల్లా
తలుక్కుమంటూ మెదులుతున్నారు కొందరు
మనసుతేలికపడి తేరిపారచూసే లోపులో
మరోమబ్బు కప్పేసినట్లు ఇంకోపేజీ తిరిగిపోతుంది
కొందరు కటిక చీకట్లో వెలుగు నింపితే
మరికొందరు వెలుతురినే చీకటిమయం చేస్తారు
ఆలోచనల రంగులరాట్నం ఆగిపోయింది
నీలాకాశంలో మబ్బులు తరలిపోయాయి
కాలపుస్తకాన్ని మూసేసా కాని
రేపటిపేజీలో ఏం రాయాలో మరి!
- 17/11/2015

చిరుకవిత

చెలియలికట్టను తెంచేసిన
అలలాగ నన్ను చుట్టేసావు
తప్పించుకొనే వీలులేకుండా
కడలివై పట్టిలాగేస్తున్నావు
నింగిలో నీటిబొట్టు తాకిడికి
వానవిల్లు వంగిపోయినట్లు
నీ ఊహలవలలో చేపపిల్లలా
నా మనసు చిక్కుకుపోయింది

- 17/12/2015

ఓ శాలెన్న

చేత మగ్గం మరోచేత దుఖము
పట్టి నేస్తవయ్యో శాలెన్న
నేసిన వస్త్రం కూడుబెట్టకుండే
చేసిన అప్పులు గంపెడై కూర్సుండే
కాసిన కండ్లు వాచిన చేతులు
కాసిన్ని రాళ్ళైన్న కూడబెట్టకుండె
నేతకష్టం నీ రాత మార్చకున్న
పుట్టిన రూణం తీర్చుకున్నవు
ధన్యజీవివు శాలెన్న
ధన్యజీవి నీవు శాలెన్న
నీవు కొలువైన పల్లెలు పట్నంగా మారేను
నీ నేత జిలుగులు సీమలకేగెను
సీమవీధుల్లో
దోరసాని మాటల్లో
ఏడజూసినా నీ నేత జిలుగులే
ఆ వెలుగుజిలుగుల చాటున
ఓ శాలెన్న
వెలిసి ముగిసిపోయే నీ పేదజీవితం

31/12/2015

స్ఫూర్తి: దక్షిణభారతంలో నేడు పెద్దపెద్ద పట్ణాలుగా, నగరాలుగా విరాజిల్లుతున్న ఎన్నో తీరనగరాలు మొట్టమొదట శాలీల చేనేత నైపుణ్యనికి కాణాచి అని ఒప్పుకోక తప్పదు. పుదుచ్చేరి, యానాం, చెన్నపట్నం, మచిలీపట్నం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. వలసపాలన చరిత్రన్ని పరికిస్తే ఒక పక్క చిన్న పల్లెటూర్లు పట్టణాలుగా ఎదుగుతుంటే మరోవైపు శాలీల స్థితిమాత్రం కడుదయనీయంగా మారిన తీరు ఎంతో ఆశ్చర్యాన్ని, బాధని కలిగించక మానదు. వారిని ఉద్దేసిన రాసినదే ఇది.
తెలుగులో శుద్ధవ్యవహారికాన్ని అమితంగా ఇష్టపడే నాకు వస్తది, ఉంటది, లేస్తది లాంటి యాసపదాలు విన్నప్పుడు చాల ఇబ్బంది అనిపించినప్పటికీ పోను పోను ఎదుటివారి భాషని, యాసని గౌరవించాలి అనే భావన బలంగా పాతుకుపోయింది. అదే నేను కల్పించి రాసాను. మన్నించగలరు.

మనిషి

మరోప్రపంచాన్ని సృష్టించిన
అపరబ్రహ్మ అని తనకు తాను
డచ్చాలుపోయే మనిషి
అది మరప్రపంచమని
ఎప్పుడు తెలుసుకుంటాడో
మొదట అగ్గిని కనుగొని ఆనక
అద్భుతాలకు తెరలేపాడంటారు
అసలది నిజం కాదేమో
వాడి కంటిని మంట కన్నా
మసి, బూడిదలే ఎక్కువ
ఆకర్షించి ఉంటాయి
ఉన్న కాస్త మంచికి మసిపూసి
కుదురుగున్నదాన్ని బూడిదచేసి
ఎన్ని ముందడుగులేశాడో కదా
దోపిడీ
నిరంకుశత్వం
బానిసత్వం
రక్తపిపాస
అబ్బో ఎన్ని మైలురాల్లో
మనిషి మనుగడ యానంలో
- 18/12/2015

Thursday, December 5, 2019

స్త్రీ భౄణ హత్యా ధిక్కారము

Prenote: Female infanticide/feoticide is a very serious issue in India that is threatening at alarming levels. Contrary to popular belief, it is high among urban, educated, economically well to do families. This poem in Telugu is a minute attempt to show stiff opposition against this tyranny. The English translation is given below.

I sincerely thank Mlle. Achuta Manasa for suggesting me to write a poem on this issue. I tried to keep the poem more versatile in its expression and style.

LETS STOP FEMALE INFANTICIDE/FOETICIDE!!!!!!

అన్నెంపున్నెమెరుగని ఆడబిడ్డ నీకైతే బరువు
భవిష్యత్తులో ఎదుర్కోక తప్పదు నీవు కరువు

కాదురా ఆడదంటే మగాడిచేతిలో ఒక కీలుబొమ్మ
ఆమె సర్వజగత్తున ప్రపంచమానవాళికో పట్టుగొమ్మ

సమాజమే మర్రిచెట్టు
ఆడబిడ్డ ఓ లేతచిగురు
తెంపితే రాలేది ఓకే ఒక చిగురుటాకు
అలా ఒక్కొక్కటిగ నేలరాలేవి
లేతచిగురుటాకులు కాదు
మనిషి భావిమనుగడపై ఆశలు 
నిజానికి కూకటివేళ్ళతో సహా క్రమేపి పెకలించబడి
తుదకు మర్రిచెట్టే మ్రొడుబారి ఎండిపోతుంది  

మన చిన్నప్పుడెత్తుకుని లాలించి జోలలాడిన అమ్మకి మనము బరువుకానప్పుడు
నాన్నా ఎత్తుకోవా అంటు అమయాకపుప్రేమతో చేతులుజాపే ఆడపిల్ల నీకు బరువా?

కన్నతల్లిప్రేమ బోలెడంత నీకు కావాలి సరె
రేపన్నరోజున తల్లిగ మారే ఆడపిల్ల ఒద్దా? 

వేడిలేని మంట
కాంతిలేని కిరణం
స్త్రీలేని పుంసత్వం 
ఉంటే ఎంత? ఉండకుంటే ఎంత?

ఆడదంటే వెలది కాదు వేలుపని తెలుసుకో
మూఢనిద్ర వీడి మానవత్వముతో మేలుకో

- కృష్ణచైతన్య (పరి, 12/12/2014)

English translation:

If innocent girl child is burden to you
then your future is certainly bleak

A female is not a puppet in the hands of a male
she is indeed the cornerstone for all humankind

The society is like a big banyan tree
every girl child is like a tender leaf
by plucking one, only a single leaf falls down
but in reality, that which is falling down
is not the tender leaves, but
the hope of future humankind
actually, the whole tree is being slowly uprooted
and one day it will die  

when we are young, we were not felt heavy to the mother who lifted, played and sung lullabies for us
when a girl child extends her hands and asks with innocent love, 'father, please lift me', does it feel then, heavy for you?

You need in abundance the love of your mother
in future, the child will turn into another mother, and you don't want her?

Fire without heat
Ray without light
Mankind without females
does it matter if they exist? better not

A female is not commodity to be bought, but a divinity, know that
enough with the deep slumber and get awakened by humanitarianism

హృదయాలాపనము

Prenote: The translation in English of this highly sanskritized Telugu poem is given below. This poem is about a small self-discourse in the heart. One can club very complex emotions within few words in Sanskrit, which is not possible in English.

మోముగాంచితె మనోల్లాసభరిత మందహాసజనక చంద్రబింబము
తేనెపలుకులువిన్న మృదుమనోహరోద్దీపిత శ్రావ్యమాధురీగోచరము
బాధానందకదంబ రుచినిగొల్పుతు మానసమందిరాన రసభోజ్యమగు
తలపులేమో రక్షాబంధిత హృదయగవాక్షములను తెరిచెడి విరహవీచికలే
అభావమో మరింక భరింపరాని నిశాకూప తిమిరాంధకర భయోత్పన్నము
హే ఆపద్బాంధవ కృష్ణా! ఏమిటీ మృగతృష్ణ!! త్రాహిమాం దేవదేవ!!!

- కృష్ణచైతన్య (పరి, 10/12/2014) 


English translation:

Glance at face makes the heart flutter with symphony and its like a moon that can bring a pleasant smile

hearing those honey dripping tender words; steal the exalted heart with sonority and delicacy

thoughts in the mind are like breezes of wind that can open hitherto locked heart
reminding a dish that was a mélange of bliss and pain with its tantalizing taste

absence is untenable by inducing a fear as if in a well of blind darkness during night

Oh my Lord! what is this illusion!!!God of gods, Save me!!! 

- Krishna Chaitanya (Paris, 10/12/2014)

English Transliteration:

Mōmugān̄cite manōllāsabharita mandahāsajanaka candrabimbamu
tēnepalukuluvinna mr̥dumanōharōddīpita śrāvyamādhurīgōcaramu
bādhānandakadamba rucinigolputu mānasamandirāna rasabhōjyamagu
talapulēmō rakṣābandhita hr̥daya gavākṣamulanu tericeḍi virahavīcikalē
abhāvamō mariṅka bharimparāni niśākūpa timirāndhakara bhayōtpannamu
hē āpadbhāndava kr̥ṣṇā! Ēmiṭī mr̥gatr̥ṣṇa!! Trāhimāṁ dēvadēva!!!

నేపథ్యం: ఒక బంధువు పితృవియోగ సందర్భంగా రాసిన ఓదార్పు కవిత

ఒక వ్యక్తిజీవితాన్ని మనం ఒక మహావృక్షంతో పోల్చవచ్చు.

అప్పుడే విత్తనం నుండి వచ్చిన లేలేత చిగుర్లే మహాప్రాణంగా ఉండే అత్యంత నిమ్నస్థాయి నుండి కొన్ని వందల ఆకులు రాలిపొయినా కించిత్ కూడా చలించనంత ఉన్నతస్థితికి ఎదిగి మహావృక్సం అవుతుంది.

రాలిపోయిన ప్రతిపండుటాకు తనవంతుగా ఆ చెట్టు ఎదుగుదలకు చేసిన కృషికి త్యాగానికి చిహ్నంగా నిలుస్తుంది.

అంతవరుకు ఆ చెట్టు, రాలిన ఆకుతో ఏర్పరుచుకున్న సంబంధం విడిపోవడంచే ఉప్పొంగిన కొండంత దుఃఖాన్ని బయటకు కాన్పడనీయక రాలిపోయిన పండుటాకు యొక్క ఔన్నత్యన్ని, త్యాగాన్ని అప్పుడే చిగురిస్తున్న లేలేత చిగుర్లకు తెలియజేస్తూ వాటిలో స్ఫూర్తిని ఉత్సాహాన్ని పెంపొందిస్తూ తను పొందే తపన మాటలకు అందరానిది.

       కాలం మారుతూ ఉంటుంది...
       చివరకు ఏది మిగలదు... 

మనలోని ఓర్పు, ప్రేమ, త్యాగం...
ఇవే మనభావితరాలకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి.
ఇందులోనే ఆనందం ఉంది.

"Immovable patience under calamities is a (synonym for) great sacrifice"

(14 Feb 2006)

Sunday, November 3, 2019

రావేలరా కృష్ణా

రాధామాధవ కుంజవిహారి
రాధామాధవ రాసవిహారి
వేవేల కన్నులతో నే వేచిచూడగ
రావేలరా కృష్ణా జాగేలరా కృష్ణా
పులకించి జాబిల్లి పూచింది వెన్నెలై
తిలకించి నా మనసు కూసింది కోయిలై
యే ఇంటజొరబడి వెన్నతింటున్నావో
నీ నెనపుతో నేను మైమరచినాను
రావేలరా కృష్ణా జాగేలరా కృష్ణా

27/01/2016

గోపిక ఆలాపన

మరుమల్లెల జాబిలి
విరజిమ్మెను కౌముది
పసిపాపగ మారిపోయి
మనసు చేసె అల్లరి
ఈలవేసి పాటపాడ
తుళ్ళిపడెను ఓ తుమ్మెద
చెంతచేరి నా చెవిన
చెప్పెనేవో ఊసులు
వేళకాని వేళలో
పొన్నచెట్టు నీడన
వినబడెనో జావళి
ఆ మువ్వలసవ్వడి
రేపల్లెలో వెన్నదోచి
మెల్లమెల్ల అడుగులేసి
ఘల్లుఘల్లు చప్పుడుతో
వచ్చినాడు కృష్ణుడు
విచ్చుకున్న సన్నజాజి
వెదజల్లె ఘుమఘుమలు
రాసక్రీడకు వేళాయెను
జాగేలర ఓ కృష్ణా!
-09/10/2015

తలపు

చుట్టురా నిశ్శబ్దం
కాని...
నాలో ఏవో అలజడి సుడిగుండాలు...
అందులో పడిన మనసు
ఎటో వెళ్ళిపోయింది...
నీ తలపుల చిరుగాలి నన్ను తాకగా
పరవశించిపోయాను..
కాలం స్థంబించింది
నా కలం కూడా...

26/10/2019

2015 నాటి హేమంతవర్ణన

ముంగురులు సరిచేసుకుని ముఖసోయగాన్ని చూబెడుతున్న అమ్మాయిలా
వర్షం పడ్డాక మబ్బులు తెరిపినిచ్చిన ఆకాశం నయనమనోహరంగా ఉంది...
మేఘాల నడుమ భానుడు ఎర్రటి నుదుటిబొట్టులాగ మెరిసిపోతున్నాడు...
మత్తకోకిల ఆలపించే కుహుకుహురాగాలతో చెట్లన్ని మారుమ్రోగుతున్నాయి...
చిటారుకొమ్మన చిలకకొట్టిన జాంపండు కడకు ఎవరి సొంతమవుతుందో మరి...
ఎన్నాళ్ళనుంచో పూత పూయని చెట్టు నేడు మొగ్గతొడిగి మురిసిపోయింది...
తేనెకై ఎదురుచూసి క్రుంగిపోయిన తుమ్మెద ఝూంకారనాదాన్ని అందుకుంది...
నా మదిలో ప్రశాంతకౌముది గుంభనంగా వ్యాపించి నెమ్మదినిడు ఈ వేళ,
హృదయవనంలో పూచిన మేలిమిపూలని కోసి పుష్పగుచ్ఛంగా మలిచాను...
విరహం లేనిదే విహారం ఆహ్లాదమా? విలాపం లేనిదే విలాసం మురిపెమా?
కడుబాధని దిగమింగినప్పుడే కదా ఆనందామృతపానం బహురసవత్తరం...
ముళ్ళని చూసి భయపడితే గులాబిపువ్వు సువాసనని ఆస్వాదించగలమా?
- 04/10/2015

గోదారి

దక్షిణ గంగవై నాశికన పుట్టి
పరవళ్ళు తొక్కుతూ తెలుగింట మెట్టేవు
మా తెలుగు నేలపై సిరులు పండించ
పరుగులే పెడుతు పారుతున్నావమ్మ తల్లి గోదారి
రాజమహేంద్రాన ఖండితమయి
కోనసీమందు కడకు సంద్రాన కలిసేవు
పుష్కరకాలమందు కాకిమునకనే నీవు
మా పాపాలు తొలిచేవు, కాచి రక్షించేవు అమ్మ గోదారి
నానాటి ఉదయాన బంగారు వన్నెతో
మిలమిలా మెరిసేటి నీ ప్రభని చూడ
చాలునా కందోయి కావాలి వేయ్‌కళ్ళు
వేదభాసిత నీవు వేల్పు గోదారి
మిట్టమధ్యాన మందగమనాన నీవు
హంసనడకలు నేర్చి హొయలుపోయేవు
ముగ్ధ పరువాలతో మిరిమిట్లుగొల్పేవు
ప్రాచ్యవాంగ్మయకీర్తిత ప్రౌఢగోదారి
సాయంతకాలాన శాంతమొందేవు నీవు
విశ్రాంతినందించు నీ ఒడి చేరంగా
తండోపతండాలై తరలి వస్తారు ప్రజలు
సంధ్యదేవతవు నీవు శరణు గోదారి
వెన్నెల్లో నీ శోభనేమని వర్ణింతు
వెండితొడుగులతో విలసిల్లుతావు
చందమామను సైతం స్తంభింపజేసేటి
వన్నెలాడివి నీవె దొరసాని గోదారి

(08/07/2015)

(కందోయి - pair of eyes)

Wednesday, January 30, 2019

ఎదురుచూపు

అదును చూసి
పదును కత్తితో
ఎదను చీల్చావు
ఆ లోతుల్లో...
బీడువారిన నేలపై
చిరువిత్తును నాటగ
నే మనసారా వలచాను....
మోహావేశం కారుమబ్బులై కమ్మగా
నీ తలపుల జడివానలో తడిసి,
ఏనాటికైనా దరిచేరుతావన్న చిన్న ఆశతో
నీ జాడకై వెదికి అలిసి సొలిసా...
నీడ కూడా అందుకోలేనంత దూరంలో నిలిచా
మొదట నీ తోడు కొండంత భరోసా అని తలచా...
కాని ....
ఇప్పుడు నీవెన్నటికి రావన్న నిజం రగిలి
ఆ కాలకూట విషాన్ని మింగి హాతాశుడనై మిగిలా...
(30/01/2019, హైదరాబాదు)