చలికాలం చప్పుడుచేయకుండా వెనుదిరిగింది... ఎదురుచూసిన వసంతం రానే వచ్చింది... పర్యాటకులతో పారిస్ పరిఢవిళ్ళాల్సిన వేళ... అది ఆస్వాదించలేని వింతపరిస్థితి... ఆ స్తబ్దతకు నిలువెత్తు సాక్షి ఈఫిల్.
మబ్బులోంచి సూర్యుడు తొంగిచూసినా...ఇళ్ళకే పరిమితమైయ్యారు జనాలు. కాలగమనంలో మనిషి ఎంత పురోగమించినా... అతడి ముందరకాళ్ళబందాలు ఎన్నెన్నో... అవి తనకు తాను ఏర్చి కూర్చి పేర్చుకున్నవి కదా...అంతే మరి.
విలాసానికి చిరునామా లాంటి వీకెండ్ ఇప్పుడు ఏకాంత విలాపానికి తెరతీసినట్టైంది. మొదట్లో కరోనా మహమ్మారి చాలా గుబులుపుట్టించింది కాని మనుషల వికృత చేష్టలు చూసి చూసి వైరసే నయమనిపించింది. మతం తప్ప మానవత్వాన్ని చూడలేని పైత్యం ఒకవైపు... తన దైనందిన జీవితంలో వీసమెత్తు లోపం వచ్చినా తట్టుకోలేక వ్యవస్థని నిందుస్తు వ్యక్తులపై విరుచుకు పడే కొందరి యువత ధోరణి మరో వైపు.... ఏది యేమైనా పర్లేదు నా ఇష్టంవచ్చినట్లు నేనుంటా అనే లెక్కలేనితనం ఇంకోవైపు....
ప్రతిరోజు ఉరకలు పరుగులతో గజిబిజి జనప్రవాహంలో కొట్టుకుపోయే మనుషుల యాంత్రిక జీవనవిధానాన్ని ఒక్కసారిగా స్థంభించుకుపొయేలా చేయగలిగింది కరోనా. ఈ వైరస్ తనకు తానుగా వ్యాప్తిచెందట్లేదు... మనిషి వ్యాపింపజేస్తున్నాడు....తనతో...తన అలవాట్లతో.... మొండితనంతో... లెక్కలేనితనంతో... ఫలితం.... జీవితంలో పొరాడి అలిసిపోయి సేదతీరాల్సిన వయసులోని ముసలివాళ్ళు నేరుగా కాటికి బలవంతంగా గెంటివేయబడటం...
ఇంత గందరగోళంలో "వర్క్ ఫ్రం హోం" చేస్తున్నామని సంబరపడుతున్నారు కాని అసలు హోం అంటే ఏది? మనం నివాసమున్న ఇల్లా? ఉండే ఊరా? భూమా?
కనిపించని స్వర్గం కోసం మతం మారమంటు కాట్ల కుక్కలాగ కరవడానికి ఉన్న గొర్రెమంద చాలానే ఉంది. ఈ అనంతవిశ్వంలో మనమున్న భూమి ఒక్కటే కనబడే స్వర్గం అని మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడో.... "ఉందో లేదో తెలియని దానికోసం ఉన్నదాన్ని నాశనం చేసుకునే ఏకైక జంతువు మనిషి" అనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు. కళ్ళముందు నాశనం కనిపిస్తున్నా సరే అదే బాటలో పయనం చేస్తాడు మనిషి... మారడు.
బ్రతుకు ఆటలో గెలుపు కష్టమే కాని అసలు గెలుపుకి నిర్వచనం ఏంటి? ఎందుకు గెలవాలి? గెలిచి ఏంచేయాలి? అని మనసుని దొలిచే ప్రశ్నలకి జవాబు రాబట్టడం ఇంకా కష్టం. ఈ కలుషితలోకంలో స్వచ్చత ఏదో మారుమూలన నక్కి దాంకుంది. ప్రతీదాంట్లో కాలుష్యమే...మాటల్లో కాలుష్యం...తలపుల్లో కాలుష్యం...నడతలో కాలుష్యం....అమ్మేవాటిలో కాలుష్యం....తినేవాటిలో కాలుష్యం....విద్య కాలుష్యం...వైద్యం కాలుష్యం... ఈ కాలుష్యంలో సదా చస్తు బ్రదుకుతూ గడపడమేనా జీవితం. అంతర్మధనంలేనిదే అమృతం పుట్టదేమో. అప్పటికి కాని ఈ నిరంతర చావు నుండి మనకి విముక్తి దొరకదు. అటువంటి అమరత్వానికై ఎదురుచూస్తూ...