Sunday, November 3, 2019

రావేలరా కృష్ణా

రాధామాధవ కుంజవిహారి
రాధామాధవ రాసవిహారి
వేవేల కన్నులతో నే వేచిచూడగ
రావేలరా కృష్ణా జాగేలరా కృష్ణా
పులకించి జాబిల్లి పూచింది వెన్నెలై
తిలకించి నా మనసు కూసింది కోయిలై
యే ఇంటజొరబడి వెన్నతింటున్నావో
నీ నెనపుతో నేను మైమరచినాను
రావేలరా కృష్ణా జాగేలరా కృష్ణా

27/01/2016

గోపిక ఆలాపన

మరుమల్లెల జాబిలి
విరజిమ్మెను కౌముది
పసిపాపగ మారిపోయి
మనసు చేసె అల్లరి
ఈలవేసి పాటపాడ
తుళ్ళిపడెను ఓ తుమ్మెద
చెంతచేరి నా చెవిన
చెప్పెనేవో ఊసులు
వేళకాని వేళలో
పొన్నచెట్టు నీడన
వినబడెనో జావళి
ఆ మువ్వలసవ్వడి
రేపల్లెలో వెన్నదోచి
మెల్లమెల్ల అడుగులేసి
ఘల్లుఘల్లు చప్పుడుతో
వచ్చినాడు కృష్ణుడు
విచ్చుకున్న సన్నజాజి
వెదజల్లె ఘుమఘుమలు
రాసక్రీడకు వేళాయెను
జాగేలర ఓ కృష్ణా!
-09/10/2015

తలపు

చుట్టురా నిశ్శబ్దం
కాని...
నాలో ఏవో అలజడి సుడిగుండాలు...
అందులో పడిన మనసు
ఎటో వెళ్ళిపోయింది...
నీ తలపుల చిరుగాలి నన్ను తాకగా
పరవశించిపోయాను..
కాలం స్థంబించింది
నా కలం కూడా...

26/10/2019

2015 నాటి హేమంతవర్ణన

ముంగురులు సరిచేసుకుని ముఖసోయగాన్ని చూబెడుతున్న అమ్మాయిలా
వర్షం పడ్డాక మబ్బులు తెరిపినిచ్చిన ఆకాశం నయనమనోహరంగా ఉంది...
మేఘాల నడుమ భానుడు ఎర్రటి నుదుటిబొట్టులాగ మెరిసిపోతున్నాడు...
మత్తకోకిల ఆలపించే కుహుకుహురాగాలతో చెట్లన్ని మారుమ్రోగుతున్నాయి...
చిటారుకొమ్మన చిలకకొట్టిన జాంపండు కడకు ఎవరి సొంతమవుతుందో మరి...
ఎన్నాళ్ళనుంచో పూత పూయని చెట్టు నేడు మొగ్గతొడిగి మురిసిపోయింది...
తేనెకై ఎదురుచూసి క్రుంగిపోయిన తుమ్మెద ఝూంకారనాదాన్ని అందుకుంది...
నా మదిలో ప్రశాంతకౌముది గుంభనంగా వ్యాపించి నెమ్మదినిడు ఈ వేళ,
హృదయవనంలో పూచిన మేలిమిపూలని కోసి పుష్పగుచ్ఛంగా మలిచాను...
విరహం లేనిదే విహారం ఆహ్లాదమా? విలాపం లేనిదే విలాసం మురిపెమా?
కడుబాధని దిగమింగినప్పుడే కదా ఆనందామృతపానం బహురసవత్తరం...
ముళ్ళని చూసి భయపడితే గులాబిపువ్వు సువాసనని ఆస్వాదించగలమా?
- 04/10/2015

గోదారి

దక్షిణ గంగవై నాశికన పుట్టి
పరవళ్ళు తొక్కుతూ తెలుగింట మెట్టేవు
మా తెలుగు నేలపై సిరులు పండించ
పరుగులే పెడుతు పారుతున్నావమ్మ తల్లి గోదారి
రాజమహేంద్రాన ఖండితమయి
కోనసీమందు కడకు సంద్రాన కలిసేవు
పుష్కరకాలమందు కాకిమునకనే నీవు
మా పాపాలు తొలిచేవు, కాచి రక్షించేవు అమ్మ గోదారి
నానాటి ఉదయాన బంగారు వన్నెతో
మిలమిలా మెరిసేటి నీ ప్రభని చూడ
చాలునా కందోయి కావాలి వేయ్‌కళ్ళు
వేదభాసిత నీవు వేల్పు గోదారి
మిట్టమధ్యాన మందగమనాన నీవు
హంసనడకలు నేర్చి హొయలుపోయేవు
ముగ్ధ పరువాలతో మిరిమిట్లుగొల్పేవు
ప్రాచ్యవాంగ్మయకీర్తిత ప్రౌఢగోదారి
సాయంతకాలాన శాంతమొందేవు నీవు
విశ్రాంతినందించు నీ ఒడి చేరంగా
తండోపతండాలై తరలి వస్తారు ప్రజలు
సంధ్యదేవతవు నీవు శరణు గోదారి
వెన్నెల్లో నీ శోభనేమని వర్ణింతు
వెండితొడుగులతో విలసిల్లుతావు
చందమామను సైతం స్తంభింపజేసేటి
వన్నెలాడివి నీవె దొరసాని గోదారి

(08/07/2015)

(కందోయి - pair of eyes)