Sunday, December 2, 2018

వెన్నెల లేని శరత్కాలం

ఋతుక్రమానికి ఆకుల రంగులు అద్దంపడుతుంటే
వెండిమబ్బుల కోకలు కట్టి ఆకాశం మురిసిపోతోంది 
పగలు రాత్రి తేడ లేకుండా చలి చేసే స్వైరవిహారంలో
చిటపట చినుకులతో ప్రకృతి గుసగుసలాడుతోంది
రవిచంద్రులు కనిపించని నా దైనందిన జీవనంలో
శరద్రాత్రులే వెన్నెల జాడ మరిచిపోయినప్పుడు
తప్పిపోయిన నా మూగమనుసుని ఎట్లా వెదికేది


(15/11/2016, రెన్న్)


)

ఒక సూచన

ఎందుకు ద్వేషం ఎందుకు రోషం
పేకమేడ జీవితంలో గోడలుకట్టి
నీది నాదని వాగ్వాదం ఏలకో
కులం, మతం, ప్రాంతం, భావజాలం
ఏ రాయి అయితేనేం 
అడ్డుగోడ కట్టడానికి
లోకమెప్పుడు పుట్టిందో తెలిదు
మళ్ళీ ఎప్పుడు పుడతావో
అంతకన్నా తెలిదు
వంచనచేసి ముంచేసే బదులు
మంచి అనె నావపై
మరో ఇద్దరినైనా ఎక్కించలేవా
కుజగ్రహంపై వలసకోసం
మేధోమథనమట
ఉన్నచోట గుడిసె ఊడిపోతోంది
కనబడట్లేదా?
కళ, జ్ఞానం అనే రెక్కలుతొడిగి
రివ్వున ఎగరాల్సిందిపోయి
పగ, పేరాశ అనే బరువులు మోసి
పాతాళంలో కూరుకుపోతున్నావు
కీడు తలపెట్టి పాడవ్వక
మేలుకో! మేలుకోరి బ్రతుకవోయ్!!
(24/01/2016, పరి)

వసంతకాలం

ప్రకృతిలో వసంతవైభవం నిలువెల్లా తాండవిస్తోంది
కొప్పున్న మల్లెలు దోపుకొని మురిసిపోయే నాతిలా
చెట్లన్ని ఆకుపచ్చని చిగుళ్ళను సింగారించుకున్నాయి
గ్రీష్మంలో ప్రతాపం చూపిద్దామనుకున్నాడో యేమో
రవికిరణ బాణాలు నునివెచ్చగా తగులుతున్నాయి
నీలాకాశం ఏమైనా తక్కువ తిందా
భూలోక భామలకు తానేమి తీసిపోనంటూ
పూటపూటకీ రంగులు మారిపోయే
మబ్బుల చీరకట్టి చూపరులను కట్టిపడేస్తోంది
తిమ్మెరగాలి జావళికి సైదోడుగా
వంతపాడుతున్నట్టున్నాయి పక్షుల రాగాలు
ఇక చందమామ కులుకులు చూడాలి
శిశిరంలో దిగాలుగా బుంగమూతిపెడితే
వసంతసంధ్యలో రోహిణి కోసమేనా అన్నట్టు
బుగ్గలు సొట్టపడేలా దరహాస సొబగులు అద్దుకున్నాడు
శిశిర ఏడారిలో రసతృష్ణతో అలమటించిన హృదయకోకిల
వసంతసరోవరంలో నేడు దప్పిక తీర్చుకుంది
(18/04/2016, పరి)

స్ఫూర్తి కోసం ఒక మాట

మకిలిపట్టిన దీపంకుందెలాగ
కన్నకలలు మాసిపోయాయి అనుకోకు
ముగిసిపోలేదు మిత్రమా నీ కథ
ఎగిసిపడే రక్తం ఉక్కునరాల్లో పారుతుంటే
వసివాడిన పువ్వైనా మళ్ళీ మొగ్గతొడిగి
సుమవాసనలతో తోటంతా గుభాళించాల్సిందే
పరాజయం ముంగిటనున్నా పోరాడి
కడకు విజయతీరాన్ని చేరుకోవాల్సిందే
పద...వడివడి అడుగులేసుకుంటూ
నీ భవితని నువ్వే నేర్పుతో చెక్కుకో
వాకిలిమెట్టుపై ఎదురుచూపులింకెన్నాళ్ళు
ఆకలిపొట్ట గావుకేకలకి చరమగీతం పాడు
అనుభవమనే నాగలిపట్టి దుక్కిదున్ని
జీవితంలో సిరులపంటలను పండించు
(28/09/15, పరి)

వేసవికి వీడుకోలు

వేసవికి వీడుకోలు చెప్పి
చలికి ఆహ్వానం పలుకుతున్నాయి చెట్లు
నీలాకాశం రంగులు వెలిసిపోయి
వైరాగ్యంతో మబ్బుల బూడిద పూసుకుంది
దొరకని నక్షరాలవేటలో చంద్రుడు గల్లంతవ్వగా
ఇలావచ్చి అలావెళిపోతున్నాడు సూర్యుడు
ఋతుక్రామానికి తగ్గట్టుగా ప్రకృతినాట్యం చేయగా
ఆమనికై మౌనవీక్షణ చేస్తోంది నా మనసు

(11-10-2017, న్న్)

ఒక ఆలోచన

నిశ్శబ్దచీకటిని ప్రశాంతతకే చిహ్నమని ఎందుకనుకోవాలి
కనిపించని అలజడిని మనకి వినిపించే ప్రయత్నమేమో
 
 
రాలిపోయిన మొగ్గలు పుష్పించలేదని నిట్టూర్పెందుకు
మొగ్గదశలోనే ముగ్ధతనొంది మరుజన్మకై నేలరాలాయేమో

నిద్రపట్టలేదంటే మెలకువలోనే మరులుగొన్నామేమో
మౌనమంటే భావాలబరువుమోయలేక నోరు మూగవోయిందేమో

మబ్బుల బందిఖానాలో సూర్యుడు చిక్కుకున్నాడనుకోవడమెందుకు
అలకతీరాక మళ్ళీ ప్రత్యక్షమౌదామని దోబూచులాటేమో

ఓ మనసా! నిన్న ఆశించినది నేడు జరగలేదని దిగాలెందుకు
జరిగినది భావిజీవిత పూలవనంలో నేడే నాటబడ్డ విత్తనమేమో


(19/10/2016 రెన్న్)

మజిలి

కదిలే కాలంబండి పై మజిలి ఈ జీవితం
వట్టిచేతులతో బండెక్కుతాం 
దానిలో ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు
అందరికీ అనువైనా చొటు దొరకదు
బండిలో అదే గమ్మత్తైన విషయం
పయనం సాగినంతసేపు ఎందరో తారసపడతారు
ఏవేవో జ్ఞాపకాలు మిగిల్చిపోతారు
వాటిలో కొన్ని మనకి భారమైతే…
మరికొన్ని మనసుని తేలిక పరుస్తాయి
ఒకటో రెండో బాగా మాత్రం పెనవేసుకుని బంధాలవుతాయి
కిటికిలోంచి బయట తొంగిచూసి చేయిజాపితే
అందనంత దూరంలో రంగుల ప్రపంచం
బండైతే ఆగదు కాని దిగేవాళ్ళు దిగుతునే ఉంటారు
ఒకసారి దిగితే మళ్ళీ ఎక్కలేని మజలి అది
ఎప్పుడు దిగిపోదామా అని కొందరు ఎదురుచూస్తే…
మళ్ళి ఎక్కితే బగుండ్ను అని ఇంకొందరు ఆశపడతారు
నడిపే విధాతకైనా తెలుసా ఈ మజలి ఎందుకో?
(23/10/2018, హైదరాబాదు)