Wednesday, January 30, 2019

ఎదురుచూపు

అదును చూసి
పదును కత్తితో
ఎదను చీల్చావు
ఆ లోతుల్లో...
బీడువారిన నేలపై
చిరువిత్తును నాటగ
నే మనసారా వలచాను....
మోహావేశం కారుమబ్బులై కమ్మగా
నీ తలపుల జడివానలో తడిసి,
ఏనాటికైనా దరిచేరుతావన్న చిన్న ఆశతో
నీ జాడకై వెదికి అలిసి సొలిసా...
నీడ కూడా అందుకోలేనంత దూరంలో నిలిచా
మొదట నీ తోడు కొండంత భరోసా అని తలచా...
కాని ....
ఇప్పుడు నీవెన్నటికి రావన్న నిజం రగిలి
ఆ కాలకూట విషాన్ని మింగి హాతాశుడనై మిగిలా...
(30/01/2019, హైదరాబాదు)

Monday, December 3, 2018

నీ జ్ఞాపకాలు

మనసు తొడుక్కున్న ఆలోచనలహారంలో
పొదిగిన కలికితురాళ్ళు; నీ జ్ఞాపకాలు
నీ ఎడబాటే చిమ్మచీకట్లై కమ్మినప్పుడు
బాధాసర్పదష్టుడనై నే సొమ్మసిల్లిపోగా
ఆ మణిహారం ఎక్కడో జారిపోయింది
ఎంత చెల్లాచెదురైపోయినప్పటికి
ఆ మణులు మిణుక్కుమంటూనే ఉన్నాయి
నీ చిరునవ్వులే పండువెన్నలై విరగాస్తే
ఆ వెలుతుర్లో ఒక్కో జ్ఞాపకం ఏరతాను
(29/09/2015, పరి)

మనోరథం

నా యీ పవిత్ర భారతదేశంలో...
ఆడదాని శరీరానికో వెల ఉంది
ఓదార్పు తప్ప న్యాయముండదు
పేదవాడి కూలికో మంచిరేటుంది
వాడి కలలకి ఆదరవు కరువు
విద్యార్థి చదువుకి కట్టణముంది
కాని ఆశయసాధనకి వేదికలేదు
ప్రజాస్వామ్యమా ఇది?
కాదు కాదు
రాతిగుండెలు మరమనుషులు
మనిషిరూపాన జంతువులు
విచ్చలవిడిగా తిరుగాడే వనస్థలి!
న్యాయస్థానమా అది?
కాదు కాదు
అన్యాయ వికటాట్టహాస
వికృతతాండవం చూడలేక
న్యాయదేవత కన్నుమూసే రణస్థలి!
(5/12/2015, పరి)

కట్టణం = కట్టవలసిన చెల్లింపు (కట్టణం --> కట్నం, పట్టణం -->పట్నం)

వేసంకాలపు వెన్నెలరాత్రి

సంధ్యవేళలో నీలాకాశశోభ రసరమ్యముగ్ధమనోహరం
ఎగిరే తెల్ల తివాచీల్లా అక్కడక్కడా మేఘాలు
రోజంతా ఎండనపడి అలసిన శరీరాలకి
చల్లటి చందనం పూసినట్లు పిల్లగాలి
ముసిముసి నవ్వుల జాబిలిజాడని
వేసంకాలపు వెన్నెలరాత్రిలో వెదుకుతున్నాను
నడిరేయిన నక్షత్రవీధిలో దొరుకుందేమో?

(05/07/2015, పరి)

చలిపొద్దు

నిశ్శబ్ద ప్రకృతి ఆలపిస్తున్న నైంత్ సింఫోని వింటూ
చలిపొద్దులో ఆరుబయట సాగుతోంది నా నడక
బద్ధకంతో సూర్యుడు మబ్బులదుప్పటిలో బజ్జుంటే
లేలెమ్మని అల్లారం కొడుతూ అక్కడక్కడా వెలుతురు
హేమంతవెన్నెల కరువై చెట్లు డీలాపడిపోగా
వాటిని ఓదారుస్తూ పల్చగా పక్షుల కిలకిలలు
మోడువారిన చెట్ల కళాపోషణకి అద్దంపడుతూ
పచ్చికపై అద్దిన రంగురాళ్ళులా పడివున్న ఆకులు
మంచుతెరల్లో చిక్కుకున్న తాజదనాన్ని ఆశ్వాదిస్తూ
ఎన్ని మలుపులు తిరిగానో తెలియదు కాని
మరపురాని అనుభూతి పంచింది నేటి ప్రొద్దు
(12-12-2016, రెన్న్)

మంచిమాట

ఈ సమాజంలో మనిషిగా ఒక్కసారైనా ఓడిపో
అప్పుడే నీలో మహర్షికి ఊపిరిపోసే బ్రహ్మవౌతావు
ఫలాన్ని పొందాలంటే పొగడ్తల పూబాణాలు కాక
అవమానాల రాళ్ళదెబ్బలను సహించు
నేడు ఉలిదెబ్బలతో విధి నిన్ను చెక్కనివ్వు 
రేపు ఓ అద్భుత కళాఖండమవుతావు
మరిచిపోకు మిత్రమా...
ఓటమిని అంగీకరించిన నాడే
భావిగెలుపుని ఆశ్వాదించగలవు
అపజయాన్ని అర్థంచేసుకున్నప్పుడే
విజయపరంపరని కొనసాగించగలవు
(12/12/2016, రెన్న్)

నీ తలపులు

మన్మధుని పూలబాణాలకు ధీటుగా
నీ తలపులే నన్ను కట్టిపడేస్తున్నాయి
నే వలచినది దేవకాంతనా? ఏమో మరి
కలయో నిజమో తేల్చుకోలేకున్నాను
అమావాస్యపు ఏకంతంలో నీ చూపులే
వెచ్చటి వెన్నెలై ధాటిగ కాయగా
రసార్ద్రత అడుగంటిన నా గుండెనేలపై
తొలకరి చిటపటలాయెను నీ పలుకులు
విలసత్కుంద సౌగంధ నవమల్లికలై
మాటల విరిజల్లులు నాపై కురిపించి
మూగబోయిన నా మానసవీణను
మీటి రాగాలాపన చేస్తున్నావెందుకో
భావోత్కర్షదీపికలై కవితాధారలు
మదిలో ఉప్పొంగి ఆగక స్రవించగా
బాధాతప్తహృదయుడనైన నాకు
నీ స్మృతులే గాధాసప్తసతులాయెను
(24/09/15, రెన్న్)