Friday, June 26, 2015

పిల్లల్లారా పిచుకల్లారా

చెట్టపట్టాలేసుకుని
చేయిచేయి పట్టుకుని
చాలా అల్లరిచేసే
పిల్లల్లారా పిచుకల్లారా
ఏమిష్టం మీకేమిష్టం

అమ్మచేతి గోరుముద్దలు
చివరాఖరి బడిగంట
వెన్నెల్లో దాగుడుమూతలు
నాన్న కొన్న కొత్తబట్టలు
తిరునాళ్ళలో పీచుమిఠాయి
నింగికెగిసే గాలిపటం
దాకుచున్న ఆటబొమ్మలు
చిటారుకొమ్మన జాంపండు
బస్సులో కిటికిపక్క చోటు
.........
ఇంకా ఎన్నో ఎన్నెనో
చాంతాడుకన్నా పొడుగున్న
ఇష్టాల చిట్టా
మరి మీదేను

ఎండ
వాన
వెన్నెల
చీకటి
తేడా చూడని
చల్లటి చూపుల
మీ కళ్ళు

పేరైనా వినని ఆటలు
ఊహకందని ముచ్చట్లు
అర్థంపర్థంలేని దెబ్బలాటలు
మీకే సొంతం
అవి మీకే సొంతం

తెల్లని కాగితం
ముచ్చెపు రాయి
కమ్మటి పెరుగు
అంతటి స్వచ్చము
మీ తేటమనసులు

కళ్ళలో కోటికాంతులు
గుండెలనిండా గంపెడు ఆశలు
నోరువిప్పితే మాటలవరద
కళ్ళు చెమ్మగిల్లితే విలయతాండవం
ఇది మీ తీరు

ఉరకలు పెట్టి
పరుగులు తీసి
గోడలు వాడలు
మేడల మిద్దెలు
దాటుకుపోయే మీకు
కాగలవా అవి అడ్డంకి

కౌమారం కబళించక మునుపే
ఆపై యవ్వనకాంతిలో
మీ అమాయకత్వం
కొవ్వొత్తిలా కరిగే లోపే
కవ్వింతల కేరింతల
ఆటపాటలతో తేలియాడందోయ్
పిల్లలారా మరుమల్లెల్లారా

- 25/06/2015

ఎదురుచూపు

కవితా నేపథ్యం: ఒక చెలికాడు తన ప్రియసఖికై ఎదురుచూసేడప్పుడు పడే ఆరాటాన్ని, అలాగే చుట్టు పక్కలున్న ప్రకృతిని చూసి అతగాడు పొందే అనుభూతిని ఊహించి రాసిన కవిత ఇది.

ఆకాశవీధిలో నడిచిన బడలికకి కాబోలు
సూర్యుడు మెల్లగా కిందకి జారుకుంటున్నాడు

నెచ్చెలి చెంతనున్నప్పుడు
జింకపిల్లలా పరుగులుపెట్టే కాలం
ఆమెకై వేచిచూసే వేళ మాత్రం
నిండుగర్భిణిలా నత్తనడక సాగిస్తూ
నా సహనాన్ని ఆవిరిచేస్తోంది
మరి చేసేదిలేక చుట్టూరా పరికించి చూసాను

వంపులు తిరిగి పారుతున్న సెలయేరు
సొంపుదీరిన ఆమె నడుముని గుర్తుచేస్తోంది

సెలయేటికి గులకరాళ్ళు అడ్డుపడగా
వెలువడే గలగలలు మరేవో కాదు
తన మనసనే తేనెపట్టునుండి
నిరంతరధారలా స్రవిస్తూ
తేనియలూరే ఆమె కిలకిల పలుకులే

చినుకు తుంపరల
చిటపట చప్పుడు
ఘల్లుఘల్లుమనే
తన కాలిగజ్జెల సవ్వడిలా
నా గుండెలో మారుమ్రోగుతోంది

దూరన కోయిలమ్మ కుహుకుహులు
గారాలుపోయి ఆమె గోముగా ఆలపించే
కూనిరాగాలకి ప్రతిధ్వని కాక మరింకేమిటి

సంధ్యవేళ ప్రకృతివైవిధ్యం
జవరాలిని పరిపరివిధాలు గుర్తుచేసి
నన్ను ఉన్మత్తతతో ఓలలాడిస్తోంది
మరి అది కవ్వింత అనుకోవలా?
లేక ఉపశమనమని ఊరట చెందాలా?

- 23/06/2015

కాగితం పువ్వులు

కొందరి హృదయాలు
కాగితం పువ్వులు
స్పందించలేని మరగుండెలు
ఎడారికొలను కంటే అరుదు
వీరి గుండెల్లో ప్రేమ

కాగితం పూలు కదా
ఎప్పటికి వాడిపోవు
చూడటానికి బాగుంటాయి
కాని చెంతకు చేరి
పీల్చినప్పుడు బయటపడుతుంది
వాటిలో వాసనలేని డొల్లతనం

మొగ్గతొడిగి వికసించి
చుట్టురా అందాన్ని నింపి
కడకు వాడిపోయినా కుడా
సహజపువ్వుల స్థాయిని
కాగితంపూలెప్పుడు చేరుకోలేవు

వీళ్ళకి జీవించడం తెలీక
నటిస్తు కాలం గడిపేస్తారు
నటనలో జీవించచ్చు కాని
జీవితంలో నటించకూడదు

- 16/06/2015

నవ్విన నాపచేను

నవ్విన నాపచేను పండింది
ఎంతగానో ఎదురుచూసిన మబ్బులు
కడకు స్వాతిచినుకుని రాల్చగా
నిరాశల మండుటెండకి
బీడువారిన నేల
నేడు సిరులపంటకి
స్వాగతం పలికింది
అపజయాల అగాధంలో 
ఎంత కూరుకుపోయినా
విజయశిఖరాన్ని చేరడానికి
ఒక్కమెట్టెక్కితే చాలు

14/06/2015

సరదాగా ఓ కవిత

లండనుకై పరుగులు తీయు రైలుబండిపై
ఎండనపడి ఉదయాన పయనము సేయ
తొందరపెట్టగ నా వంకజూసి సమ్మతించి
అందరికి విసానిడువాడు నాకొక్కటిచ్చెన్

అవును రేపే సీమకి ప్రయాణం
ఆంగ్లసీమకి నా తొలిపయనం

- 06/06/2015

అమ్మా! ఏం చెప్పాలి

నింగికేసి చూసాను
ఏముంది అంతులేని ఖాళీ తప్ప

నీకేసి చూసాను
ఏముంది చెరగని చిరునవ్వు తప్ప

అమ్మా!
ఏం చెప్పాలి

ఎండకి అడ్డుగా నువ్వు నిలబడితె
ఆ నీడలో వేళ్ళూనుకుని నేను ఎదిగానని చెప్పనా

నీ కంట ఒలికిన కన్నీరు లావాగ్నిలా
నా బండరాతి గుండెని కరిగించేదని చెప్పనా

నీ బుగ్గన చిరునవ్వుల మెరుపులు చూసిన ప్రతిసారి
నా మేని మైమరచి పులకించేదని చెప్పనా

జీవితపు కొలిమిలోని
పెనుసవాళ్ళ నిప్పురవ్వలు
నన్ను కాల్చినప్పుడు
నువ్వున్నావనే ఒక్క ఆలోచన
నాకు ఎంతో ఊరటనిచ్చి
గాయం మానిపేదని చెప్పనా

కళ్ళెదుట లేవుగాని
కనబడుతున్నది నీ రూపమే

సదా నా గుండెగూటిలో
మహారాజ్ఞిలా వెలుగొందు

- 05/06/2015

సముద్రం-జీవితం

పాలనురగలు చిమ్మే అలలను చూసినప్పుడు
అన్నెంపున్నెమెరుగని నవ్వుల బాల్యం గుర్తొస్తుంది

పున్నమినాడు ఉవ్వెత్తున ఎగిసెపడే కెరటాలను చూస్తే
ఉరకలుపెత్తే ఉత్సహం ఉద్వేగముట్టిపడే యవ్వనం జ్ఞప్తికొస్తుంది

అర్ధరాత్రి ఎంతో గంభీరంగా ఉన్న సముద్రాన్ని చూడగానే
జీవితాన్ని చదివి మౌనం దాల్చిన వృద్ధాప్యం గుర్తొస్తుంది  

ఆహా! సముద్రానికి మనిషి జీవితనికి ఎంతటి పోలిక

-02/06/2015