కవితా నేపథ్యం: ఒక చెలికాడు తన ప్రియసఖికై ఎదురుచూసేడప్పుడు పడే ఆరాటాన్ని, అలాగే చుట్టు పక్కలున్న ప్రకృతిని చూసి అతగాడు పొందే అనుభూతిని ఊహించి రాసిన కవిత ఇది.
ఆకాశవీధిలో నడిచిన బడలికకి కాబోలు
సూర్యుడు మెల్లగా కిందకి జారుకుంటున్నాడు
నెచ్చెలి చెంతనున్నప్పుడు
జింకపిల్లలా పరుగులుపెట్టే కాలం
ఆమెకై వేచిచూసే వేళ మాత్రం
నిండుగర్భిణిలా నత్తనడక సాగిస్తూ
నా సహనాన్ని ఆవిరిచేస్తోంది
మరి చేసేదిలేక చుట్టూరా పరికించి చూసాను
వంపులు తిరిగి పారుతున్న సెలయేరు
సొంపుదీరిన ఆమె నడుముని గుర్తుచేస్తోంది
సెలయేటికి గులకరాళ్ళు అడ్డుపడగా
వెలువడే గలగలలు మరేవో కాదు
తన మనసనే తేనెపట్టునుండి
నిరంతరధారలా స్రవిస్తూ
తేనియలూరే ఆమె కిలకిల పలుకులే
చినుకు తుంపరల
చిటపట చప్పుడు
ఘల్లుఘల్లుమనే
తన కాలిగజ్జెల సవ్వడిలా
నా గుండెలో మారుమ్రోగుతోంది
దూరన కోయిలమ్మ కుహుకుహులు
గారాలుపోయి ఆమె గోముగా ఆలపించే
కూనిరాగాలకి ప్రతిధ్వని కాక మరింకేమిటి
సంధ్యవేళ ప్రకృతివైవిధ్యం
జవరాలిని పరిపరివిధాలు గుర్తుచేసి
నన్ను ఉన్మత్తతతో ఓలలాడిస్తోంది
మరి అది కవ్వింత అనుకోవలా?
లేక ఉపశమనమని ఊరట చెందాలా?
- 23/06/2015
No comments:
Post a Comment