Thursday, December 5, 2019

నేపథ్యం: ఒక బంధువు పితృవియోగ సందర్భంగా రాసిన ఓదార్పు కవిత

ఒక వ్యక్తిజీవితాన్ని మనం ఒక మహావృక్షంతో పోల్చవచ్చు.

అప్పుడే విత్తనం నుండి వచ్చిన లేలేత చిగుర్లే మహాప్రాణంగా ఉండే అత్యంత నిమ్నస్థాయి నుండి కొన్ని వందల ఆకులు రాలిపొయినా కించిత్ కూడా చలించనంత ఉన్నతస్థితికి ఎదిగి మహావృక్సం అవుతుంది.

రాలిపోయిన ప్రతిపండుటాకు తనవంతుగా ఆ చెట్టు ఎదుగుదలకు చేసిన కృషికి త్యాగానికి చిహ్నంగా నిలుస్తుంది.

అంతవరుకు ఆ చెట్టు, రాలిన ఆకుతో ఏర్పరుచుకున్న సంబంధం విడిపోవడంచే ఉప్పొంగిన కొండంత దుఃఖాన్ని బయటకు కాన్పడనీయక రాలిపోయిన పండుటాకు యొక్క ఔన్నత్యన్ని, త్యాగాన్ని అప్పుడే చిగురిస్తున్న లేలేత చిగుర్లకు తెలియజేస్తూ వాటిలో స్ఫూర్తిని ఉత్సాహాన్ని పెంపొందిస్తూ తను పొందే తపన మాటలకు అందరానిది.

       కాలం మారుతూ ఉంటుంది...
       చివరకు ఏది మిగలదు... 

మనలోని ఓర్పు, ప్రేమ, త్యాగం...
ఇవే మనభావితరాలకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి.
ఇందులోనే ఆనందం ఉంది.

"Immovable patience under calamities is a (synonym for) great sacrifice"

(14 Feb 2006)

Sunday, November 3, 2019

రావేలరా కృష్ణా

రాధామాధవ కుంజవిహారి
రాధామాధవ రాసవిహారి
వేవేల కన్నులతో నే వేచిచూడగ
రావేలరా కృష్ణా జాగేలరా కృష్ణా
పులకించి జాబిల్లి పూచింది వెన్నెలై
తిలకించి నా మనసు కూసింది కోయిలై
యే ఇంటజొరబడి వెన్నతింటున్నావో
నీ నెనపుతో నేను మైమరచినాను
రావేలరా కృష్ణా జాగేలరా కృష్ణా

27/01/2016

గోపిక ఆలాపన

మరుమల్లెల జాబిలి
విరజిమ్మెను కౌముది
పసిపాపగ మారిపోయి
మనసు చేసె అల్లరి
ఈలవేసి పాటపాడ
తుళ్ళిపడెను ఓ తుమ్మెద
చెంతచేరి నా చెవిన
చెప్పెనేవో ఊసులు
వేళకాని వేళలో
పొన్నచెట్టు నీడన
వినబడెనో జావళి
ఆ మువ్వలసవ్వడి
రేపల్లెలో వెన్నదోచి
మెల్లమెల్ల అడుగులేసి
ఘల్లుఘల్లు చప్పుడుతో
వచ్చినాడు కృష్ణుడు
విచ్చుకున్న సన్నజాజి
వెదజల్లె ఘుమఘుమలు
రాసక్రీడకు వేళాయెను
జాగేలర ఓ కృష్ణా!
-09/10/2015

తలపు

చుట్టురా నిశ్శబ్దం
కాని...
నాలో ఏవో అలజడి సుడిగుండాలు...
అందులో పడిన మనసు
ఎటో వెళ్ళిపోయింది...
నీ తలపుల చిరుగాలి నన్ను తాకగా
పరవశించిపోయాను..
కాలం స్థంబించింది
నా కలం కూడా...

26/10/2019

2015 నాటి హేమంతవర్ణన

ముంగురులు సరిచేసుకుని ముఖసోయగాన్ని చూబెడుతున్న అమ్మాయిలా
వర్షం పడ్డాక మబ్బులు తెరిపినిచ్చిన ఆకాశం నయనమనోహరంగా ఉంది...
మేఘాల నడుమ భానుడు ఎర్రటి నుదుటిబొట్టులాగ మెరిసిపోతున్నాడు...
మత్తకోకిల ఆలపించే కుహుకుహురాగాలతో చెట్లన్ని మారుమ్రోగుతున్నాయి...
చిటారుకొమ్మన చిలకకొట్టిన జాంపండు కడకు ఎవరి సొంతమవుతుందో మరి...
ఎన్నాళ్ళనుంచో పూత పూయని చెట్టు నేడు మొగ్గతొడిగి మురిసిపోయింది...
తేనెకై ఎదురుచూసి క్రుంగిపోయిన తుమ్మెద ఝూంకారనాదాన్ని అందుకుంది...
నా మదిలో ప్రశాంతకౌముది గుంభనంగా వ్యాపించి నెమ్మదినిడు ఈ వేళ,
హృదయవనంలో పూచిన మేలిమిపూలని కోసి పుష్పగుచ్ఛంగా మలిచాను...
విరహం లేనిదే విహారం ఆహ్లాదమా? విలాపం లేనిదే విలాసం మురిపెమా?
కడుబాధని దిగమింగినప్పుడే కదా ఆనందామృతపానం బహురసవత్తరం...
ముళ్ళని చూసి భయపడితే గులాబిపువ్వు సువాసనని ఆస్వాదించగలమా?
- 04/10/2015

గోదారి

దక్షిణ గంగవై నాశికన పుట్టి
పరవళ్ళు తొక్కుతూ తెలుగింట మెట్టేవు
మా తెలుగు నేలపై సిరులు పండించ
పరుగులే పెడుతు పారుతున్నావమ్మ తల్లి గోదారి
రాజమహేంద్రాన ఖండితమయి
కోనసీమందు కడకు సంద్రాన కలిసేవు
పుష్కరకాలమందు కాకిమునకనే నీవు
మా పాపాలు తొలిచేవు, కాచి రక్షించేవు అమ్మ గోదారి
నానాటి ఉదయాన బంగారు వన్నెతో
మిలమిలా మెరిసేటి నీ ప్రభని చూడ
చాలునా కందోయి కావాలి వేయ్‌కళ్ళు
వేదభాసిత నీవు వేల్పు గోదారి
మిట్టమధ్యాన మందగమనాన నీవు
హంసనడకలు నేర్చి హొయలుపోయేవు
ముగ్ధ పరువాలతో మిరిమిట్లుగొల్పేవు
ప్రాచ్యవాంగ్మయకీర్తిత ప్రౌఢగోదారి
సాయంతకాలాన శాంతమొందేవు నీవు
విశ్రాంతినందించు నీ ఒడి చేరంగా
తండోపతండాలై తరలి వస్తారు ప్రజలు
సంధ్యదేవతవు నీవు శరణు గోదారి
వెన్నెల్లో నీ శోభనేమని వర్ణింతు
వెండితొడుగులతో విలసిల్లుతావు
చందమామను సైతం స్తంభింపజేసేటి
వన్నెలాడివి నీవె దొరసాని గోదారి

(08/07/2015)

(కందోయి - pair of eyes)

Wednesday, January 30, 2019

ఎదురుచూపు

అదును చూసి
పదును కత్తితో
ఎదను చీల్చావు
ఆ లోతుల్లో...
బీడువారిన నేలపై
చిరువిత్తును నాటగ
నే మనసారా వలచాను....
మోహావేశం కారుమబ్బులై కమ్మగా
నీ తలపుల జడివానలో తడిసి,
ఏనాటికైనా దరిచేరుతావన్న చిన్న ఆశతో
నీ జాడకై వెదికి అలిసి సొలిసా...
నీడ కూడా అందుకోలేనంత దూరంలో నిలిచా
మొదట నీ తోడు కొండంత భరోసా అని తలచా...
కాని ....
ఇప్పుడు నీవెన్నటికి రావన్న నిజం రగిలి
ఆ కాలకూట విషాన్ని మింగి హాతాశుడనై మిగిలా...
(30/01/2019, హైదరాబాదు)