Monday, January 22, 2024

అయోధ్య శ్రీ రామ మందిర ప్రాణప్రతిష్ఠ

 ఎన్నాళ్ళకు ఏన్నేళకు 

ఉత్తరభారతాన

అయోధ్య పుణ్యక్షేత్రాన

రామజన్మభూమి నందున

భవ్యమందిర గర్భాలయాన

శుభము శుభము

జయము జయమను

మంగళధ్వానాల నడుమ

తామరపై స్థానక భంగియై

కొలువుదీరెను శ్రీరామదేవర


మోమున చిరుమందహాసము

చేతన ధనుర్బాణముల్ బూని

ఠీవిగ పొడవైన నిలువెత్తు విగ్రహము

చూడగ అయోధ్య బాలకరాముని

కన్నుల పండుగే గాదె! అదియే

సర్వలోక దివ్యమంగళకరము

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

Thursday, January 18, 2024

ఓ శీతాకాలం

సమయం 8.30 కాని చుట్టూరా చీకటి కమ్మేసి తిష్టవేసింది

జోరుగా మంచువాన తుంపరజల్లుల తప్పెటలు మ్రోగిస్తుంటే
మోడువారిన చెట్లకి ప్రకృతి మంచుదూదెలతో సొబగులద్దగా
ఎక్కడికక్కడ కుప్పలుతెప్పలుగా మంచుపేరికల వెండికొండలు

వేడిస్థాయి సున్నాకి 28 మెట్లు దిగిపోయి చలీశ్వరుడి తాండవం
ఇంక నింగిలోని నక్షత్రాల జాడైన కానరాకుండా పోయాయి

కరడుగట్టి స్తంబించిపోయిన నదీ ప్రవాహాన్ని చూస్తే
కాలగమనం ఆగిపొయిందేమో అని మాటిమాటికి సందేహం

కాలాన్ని రేయింబగళ్ళుగా పంచుకుని ఏలే రవిచంద్రులలో
శీతాకాలమప్పుడు మాత్రం తమ్ముడిదే పైచేయి అన్నట్టుంది

(ఔలు 17/01/2024 at -28 °C)

Wednesday, January 17, 2024

శుభోదయం నేస్తం

 నీ చెక్కిలి తాకే ప్రతి చిరుగాలి ఓ సేదతీర్పు

నెర్వగల్గితే ప్రతి పరిచయం ఒక గుణపాఠం 

పొందిన ప్రతి అనుభవం ఓ మెలుకొలుపు

గత జీవితం భారమే కావచ్చు గాని

భవిష్యత్తు దానికెన్నో రెట్లు ఆశాజనకం


కలలు కల్లలు కాకముందే 

అవి కనుమరుగయ్యే లోపే

'పట్టువిడువని ప్రయత్నం' అనే ఉలితో 

ఒక్కో కలని చెక్కి చూడు మిత్రమా

ఏమో ఏదో అద్భుతం జరిగి

కళ్ళుచెదిరే కళాఖండం రూపుదిద్దుకుంటుందేమో

నిన్న నవ్విన నోళ్ళే రేపు కొనియాడతాయి

వెక్కిరించిన చేతులే మరల చప్పట్లు కొడతాయి

సరిగ్గా దృష్టి పెట్టాలి గాని

నీ గమ్యం నీచేతిలోనే


అదిగదిగో 

లేలెమ్మని తట్టిలేపుతూ

మరలా వచ్చింది 

మరో ఉదయం


నీ కలల సాకారం కోసం

ప్రతిరోజు ఒక అవకాశం

అదే కాలమిచ్చు బహుమానం

అందిపుచ్చుకుంటావో 

జారవిడుచుకుంటావో

నీ ఇష్టం ఓ నేస్తం

శుభోదయం


(ఔలు 18/01/2024)

Sunday, January 8, 2023

ఫిన్ల్యాండ్లో శీతాకాలం

 

నేడు డిశెంబరు 25 కదా అని
శీతాకాలపు నడిబొడ్డులో నా చుట్టూరా చూసుకుంటే...
 
వజ్రాలు పొదిగిన మంచుదుప్పటిలా ధగ ధగ మెరిసిపోతూ
నేలంతా కప్పేసిన దట్టమైన మంచుతిన్నెల ఘనరాశులు 
 
ఆకులురాలి మొడువారిన ప్రతిచెట్టూ
మంచుదూదెలతో సొబగులు అద్దుకుని
విన్నుత్న సౌందర్యంతో చేసే కనువిందు 
 
పట్టుమని నాలుగు గంటలు కూడ లేని పగళ్ళు
వెన్నెల కాంతిని తలదన్నే అరోరా బోరియాలిస్
ధృవకాంతపు హొయలతో మిరిమిట్లుగొలిపే దీర్ఘనిశలు
 
యాంత్రిక జీవనంలో గుడ్డిగ బ్రతికే మనిషి
ఒక్కసరి కళ్ళుతెరిచి ప్రకృతిని తేరిపారచూడగలిగితే
అబ్బా! ఎంత బావుణ్ణు కదా !!!
 
మొబైల్లో టెంపరేచర్ చూడబోతే -16డీ అని ఉంది కానీ
నా మనసుకి మాత్రం ఏదో తెలియని వెచ్చదనం
 
అర్థంకాని అమ్మజోలపాట
బిడ్డకు స్వాంతన ఇచ్చినట్టు
ప్రకృతిని నిలువెల్లా ఆవరించిన నిశ్శబ్దం
నా మనసుకు ఏదో తెలియని ప్రశాంతత
 
ఇకపై "వింటర్ ఈజ్ కమింగ్
" అనేమాట
ఒక భయానక హెచ్చరిక కానేకాదు
ప్రకృతిని ఆశ్వాదించమని చెప్పే ఒక ఆహ్వానం 
 
(ఫిన్‌ల్యాండ్, 25/12/2022)

Thursday, May 26, 2022

వసంతాన వీచిన గాలి

 

వసంతకాలపు నడిరేయిలో
ఎక్కడ్నించో వీచిన
చిరుగాలివై నను తాకి
ప్రగాఢ నిద్రనుండి తట్టిలేపావు
 
నేను తేరుకొనేంత లోపే
సరికొత్త శ్వాసగా మారిపోయి
నను మొత్తం కబళించి
ఉబ్బిన ఛాతిలో ఊపిరివై
నన్ను ఉక్కిరిబిక్కిరి చేసావు
 
నిశ్వాసతో నిను ఒక్కసారైనా జారవిడువలేను
ఉగ్గలుపట్టి నిన్ను గుండెల్లోనే దాచుకోనూలేను
 
కాలాన్ని కాసేపైనా ఆగిపొమ్మని ప్రాధేయపడనా
లేక నీ ఇంద్రజాలాన్ని ఇకనైన కట్టిపెట్టమని వేడుకోనా
 
(సువోమి 25/05/2022, కృష్ణచైతన్య)

 గెలుపు కళ్ళుగప్పకుండా చూసుకో

ఓటమి కనువిప్పు కలిగేలా చేసుకో
 
గమ్యంవైపు పయనం సుదూరమే కాని...
 
ప్రతి పరిచయం విలువైన గుణపాఠం
 
ఊహించని ప్రతిమలుపు ఒక మేలుకొలుపు
 
(Spring scribblings)

Thursday, May 14, 2020

పరిప్రశ్న

మోక్ష విషయమై ఎటువంటి గురువులని ఎలా ఆశ్రయించాలి అన్నసందేహానికి శ్రీ కృష్ణ భగవానుడు గీతలో ఇలాగ చెప్పాడు:

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వ దర్శినః (భగవద్గీత 4:34)

భావము: అట్టి జ్ఞానమును తత్త్వవేత్తలగు జ్ఞానులకు (చక్కగా) సాస్టాంగ నమస్కారమొనర్చి, (మోక్షమును గూర్చి) ప్రశ్నించి, సేవచేసి తెలుసుకొనుము. వారు తప్పక ఉపదేశించెదరు.
గమనిక: ఇదే గీతాశ్లోకమును గూర్చి శ్రీసాయి సచ్చరిత్ర లో 39వ అధ్యాయములో చర్చించబడియుంది.

ఏ ప్రశ్నల జావాబులు మనకి మోక్ష తత్త్వజ్ఞానాన్ని అందిస్తాయో అలాంటి వాటిని పరిప్రశ్నలు అంటారు. మరి ఎలాంటి ప్రశ్నలు వేయాలి అన్న సందేహం కలిగినట్లైతే చక్కటి ఉదహారణము శ్రీ భీష్మపితామహులవారిని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగిన ప్రశ్నలు మనము నెమరువేసుకొంటె సరిపోతుంది (ఇవే కాక నచికేతుడు యముడిని అడిగినవి, గౌతముడు జాబాలాసత్యకాముడిని అడిగినవి కూడా అదే కోవలోకి వస్తాయి).

విష్ణుసహస్రనామములో పూర్వపీఠికలో 'కిమేకం దైవతం లోకే' మొదలుకొని 6 (పరి)ప్రశ్నలు వేస్తాడు ధర్మరాజు. భీష్ముడి సమాధానములో మనకి కలిగే మంచిజ్ఞానబోధ ఎమిటంటే తరచుగా హరినామసంకీర్తనము చేయడం.
ధర్మరాజు అడిగిన ఆరు ప్రశ్నలు:
కిమేకం దైవతం లోకే కిం వా ప్యేకం పరాయణం| స్తువంతః కం క మర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్||
కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః| కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్||

1వ ప్రశ్న: కిమేకం దైవతం లోకే? (కిం లోకే ఏకం దైవతం) (లోకము నందు ఒక్కగానొక్క దైవము ఏమిటి?)
సమాధానం: పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం| దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా||

2వ ప్రశ్న: కిం వా ప్యేకం పరాయణం? (కిం వ ఏకం పరాయణం అపి) (ఒక్కగానొక్క అంతిమ గమ్యం/ ఆశ్రయం ఏమిటి మరి?)
సమాధానం: పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః| పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్||

3వ ప్రశ్న: స్తువంతః కం ప్రాప్నుయుః మానవాశ్శుభమ్? (కం స్తువంతః మానవాః శుభం ప్రాప్నుయుః)
(ఎవరిని స్తుతించుట చేత మానవులకి శుభం కలుగును?)
సమాధానం: అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం| లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్||

4వ ప్రశ్న: క మర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్? (కం అర్చంతః మానవాః శుభం ప్రాప్నుయుః)
(ఎవరిని అర్చించుట చేత మానవులకి శుభం కలుగును?)
సమాధానం: తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం| ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ||

5వ ప్రశ్న: కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః? (భవతః మతః కః ధర్మః సర్వధర్మాణాం పరమః)
(అన్ని ధర్మములలోకెల్లా యే ధర్మము పరమోత్కృష్టమైనది అని మీ అభిప్రాయం?)
సమాధానం: ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః| యద్భక్త్యా పుణ్డరీకాక్షం స్తవైరర్చే న్నర స్సదా||

6వ ప్రశ్న: కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్? (కిం జపన్ జంతుః జన్మ సంసార బంధనాత్ ముచ్యతే) (ఏమి జపం చేత ప్రాణులు పుట్టుక, సంసార బంధనం నుండి విమోచనం పొందుతున్నారు?)
సమాధానం: జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం| స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః

సారాంశం: హరినామ సంకీర్తన వల్ల సర్వ పాపాలు, కర్మలు నశించి మరో జన్మలేకుండా మోక్షం లభిస్తుంది అన్నది సారాంశం.
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః | సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్| (కృష్ణుడిని ఆశ్రయించిన మనుషులు సకలపాపాలు నుండి పూర్తిగా శుద్ధిపొంది ఎప్పటికి తిరిగిరాకుండా శాశ్వతముగా కృష్ణుడి దగ్గరికే వెళ్తారు)

 శ్రీ గురు గౌరాంగౌ జయతః (All glories to Guru and Gauranga)

సూచన: విష్ణుసహస్రనామం శంకరభాష్యంతో పాటు తెలుగు టీకాతాత్పర్యాలు ఉన్న పాత పుస్తకం (మా ముత్తమామ్మగారు కొన్నది) ఇంకా మా దగ్గర ఉంది. పుస్తకం కొత్త కాపీ కోసం వావిళ్ళ ప్రెస్స్ వారిని సంప్రదించగలరు (+91 98495 69921) . ఇప్పటి వెల 75రూ మాత్రమే.