Thursday, May 14, 2020

పరిప్రశ్న

మోక్ష విషయమై ఎటువంటి గురువులని ఎలా ఆశ్రయించాలి అన్నసందేహానికి శ్రీ కృష్ణ భగవానుడు గీతలో ఇలాగ చెప్పాడు:

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వ దర్శినః (భగవద్గీత 4:34)

భావము: అట్టి జ్ఞానమును తత్త్వవేత్తలగు జ్ఞానులకు (చక్కగా) సాస్టాంగ నమస్కారమొనర్చి, (మోక్షమును గూర్చి) ప్రశ్నించి, సేవచేసి తెలుసుకొనుము. వారు తప్పక ఉపదేశించెదరు.
గమనిక: ఇదే గీతాశ్లోకమును గూర్చి శ్రీసాయి సచ్చరిత్ర లో 39వ అధ్యాయములో చర్చించబడియుంది.

ఏ ప్రశ్నల జావాబులు మనకి మోక్ష తత్త్వజ్ఞానాన్ని అందిస్తాయో అలాంటి వాటిని పరిప్రశ్నలు అంటారు. మరి ఎలాంటి ప్రశ్నలు వేయాలి అన్న సందేహం కలిగినట్లైతే చక్కటి ఉదహారణము శ్రీ భీష్మపితామహులవారిని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగిన ప్రశ్నలు మనము నెమరువేసుకొంటె సరిపోతుంది (ఇవే కాక నచికేతుడు యముడిని అడిగినవి, గౌతముడు జాబాలాసత్యకాముడిని అడిగినవి కూడా అదే కోవలోకి వస్తాయి).

విష్ణుసహస్రనామములో పూర్వపీఠికలో 'కిమేకం దైవతం లోకే' మొదలుకొని 6 (పరి)ప్రశ్నలు వేస్తాడు ధర్మరాజు. భీష్ముడి సమాధానములో మనకి కలిగే మంచిజ్ఞానబోధ ఎమిటంటే తరచుగా హరినామసంకీర్తనము చేయడం.
ధర్మరాజు అడిగిన ఆరు ప్రశ్నలు:
కిమేకం దైవతం లోకే కిం వా ప్యేకం పరాయణం| స్తువంతః కం క మర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్||
కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః| కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్||

1వ ప్రశ్న: కిమేకం దైవతం లోకే? (కిం లోకే ఏకం దైవతం) (లోకము నందు ఒక్కగానొక్క దైవము ఏమిటి?)
సమాధానం: పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం| దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా||

2వ ప్రశ్న: కిం వా ప్యేకం పరాయణం? (కిం వ ఏకం పరాయణం అపి) (ఒక్కగానొక్క అంతిమ గమ్యం/ ఆశ్రయం ఏమిటి మరి?)
సమాధానం: పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః| పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్||

3వ ప్రశ్న: స్తువంతః కం ప్రాప్నుయుః మానవాశ్శుభమ్? (కం స్తువంతః మానవాః శుభం ప్రాప్నుయుః)
(ఎవరిని స్తుతించుట చేత మానవులకి శుభం కలుగును?)
సమాధానం: అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం| లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్||

4వ ప్రశ్న: క మర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్? (కం అర్చంతః మానవాః శుభం ప్రాప్నుయుః)
(ఎవరిని అర్చించుట చేత మానవులకి శుభం కలుగును?)
సమాధానం: తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం| ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ||

5వ ప్రశ్న: కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః? (భవతః మతః కః ధర్మః సర్వధర్మాణాం పరమః)
(అన్ని ధర్మములలోకెల్లా యే ధర్మము పరమోత్కృష్టమైనది అని మీ అభిప్రాయం?)
సమాధానం: ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః| యద్భక్త్యా పుణ్డరీకాక్షం స్తవైరర్చే న్నర స్సదా||

6వ ప్రశ్న: కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్? (కిం జపన్ జంతుః జన్మ సంసార బంధనాత్ ముచ్యతే) (ఏమి జపం చేత ప్రాణులు పుట్టుక, సంసార బంధనం నుండి విమోచనం పొందుతున్నారు?)
సమాధానం: జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం| స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః

సారాంశం: హరినామ సంకీర్తన వల్ల సర్వ పాపాలు, కర్మలు నశించి మరో జన్మలేకుండా మోక్షం లభిస్తుంది అన్నది సారాంశం.
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః | సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్| (కృష్ణుడిని ఆశ్రయించిన మనుషులు సకలపాపాలు నుండి పూర్తిగా శుద్ధిపొంది ఎప్పటికి తిరిగిరాకుండా శాశ్వతముగా కృష్ణుడి దగ్గరికే వెళ్తారు)

 శ్రీ గురు గౌరాంగౌ జయతః (All glories to Guru and Gauranga)

సూచన: విష్ణుసహస్రనామం శంకరభాష్యంతో పాటు తెలుగు టీకాతాత్పర్యాలు ఉన్న పాత పుస్తకం (మా ముత్తమామ్మగారు కొన్నది) ఇంకా మా దగ్గర ఉంది. పుస్తకం కొత్త కాపీ కోసం వావిళ్ళ ప్రెస్స్ వారిని సంప్రదించగలరు (+91 98495 69921) . ఇప్పటి వెల 75రూ మాత్రమే.

Monday, May 11, 2020

పిండి నేర్పిన గుణపాఠం

చాలా నెలలు నా దగ్గర గోధుమ పిండి నిల్వ ఉండేది కానీ దాన్ని ఎప్పుడు చూసినా "చపాతీలు అస్సలు చేసుకోను కాబట్టి ఇంత పిండిని నేనేమి చెయ్యాలి? మొత్తం వృధా కదా" అని విసుక్కునేవాడ్ని. కరోనా పుణ్యమాని ఎక్కువ బయటకి వెళ్లలేక ఉన్నదానితో సరిపెట్టుకొనే వింత పరిస్థితి ఏర్పడింది. ఇక చేసేది లేక హతవిధి అనుకుని చపాతీపిండి తీసి చెల్లాయిని అడిగి మొత్తానికి ఒక పూట ఫుడ్ కానిచ్ఛేసాను. ఎందుకో అది సులువు అనిపించి తర్వాత మేథీ పరాఠా, ఆలూ పరాఠా అని చకచకా వండుకోడంతో పిండి దాదాపు అయిపోవచ్చింది. "అరెరె 2కేజిల గోధుమపిండిని అవగొట్టడం నావల్ల కానే కాదు అనుకొన్నాను కానీ వారం తిరగకుండానే అయ్యిపోయిందే!", అని ఆశ్చర్యపోడం నా వంతు అయ్యింది. అప్పుడు, హఠాత్తుగా ఒక ఆలోచన నా మదిలో మెదిలింది.
"దేవుడు మనకి నిర్ణయించే ప్రణాళిక మనం ఈ జన్మలో చేయలేనంత కష్టంగా అనిపించవచ్చు. మన కర్మఫలం తరగని కొండలాగా భయపెట్టవచ్చు....మనం చేరుకోవాల్సిన లక్ష్యానికి ఎన్నో అడ్డంకులు ఎదురుపడవచ్చు. కానీ మన పని, లక్ష్యం, కర్మ.... మనం బద్ధకాన్ని వదిలిపెట్టి మొదలెడితే చాలు. విశ్వాసంతో ముందడుగు వేస్తే ఇవన్ని ఆనతి కాలంలోనే పూర్తిచేయ్యగలము. అది ఏదైనా కావొచ్చు.. అది సఫలం అవ్వడం తథ్యం." అని.
అహా! మనం అహంకారాన్ని పక్కనపెట్టి నేర్చుకోవాలే గాని పిండి కూడా మంచి గుణపాఠం అందించగలదు.

Thursday, May 7, 2020

విశాఖపట్నంలో గాస్ లీకేజీ

విశాఖపట్నంలో గాస్ లీకేజీ వార్తా చాలా బాధపెట్టింది. కరోనా వైరస్ సాకుతో మార్చ్ నుండి మైంటెనెన్సు పనులు నిలిపివేశారుట. కొంతమంది స్వార్థం, ఉదాసీనత, అజాగ్రత్త వల్ల ఇంతమంది అమాయకులు బలికావడం చాలా విచారకరం. అభివృద్ధి అంటే కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు. సామాజ పురోగతికి నాణ్యత కల్గిన విద్య, వైద్యం, రక్షణ, పౌరసేవ ఇలాంటివి సూచికలు. ఇవి ఎంతమేరకు మెరుగుపడ్డాయి అన్నవి ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి.
నా పీ.హెచ్ది.లో 'public protection and disaster relief' (PPMR, ప్రజా సంరక్షణ మరియు విపత్తు ఉపశమనం) సంబంధించి కొంత పనిచేయడం జరిగింది. ఒక విపత్తు జరిగినప్పుడు దానినుండి జనాలకి అత్యంత త్వరగా ఎలాగ సహాయచర్యలు తీసుకోవాలి?, అందులోంచి వారిని ఎంతత్వరగా బయటకి తీసుకురావాలి? ఈ విషయంలో 5జి కమ్యూనికేషన్స్ పాత్ర మీద నా పరిశోధన కొనసాగింది.
'చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు' లాగ మన ప్రభుత్వాలు పనిచేయడం చాలా దారుణం. మన యువతకి ఉపాధి కల్పించాలి అంటే పరిశ్రమలు చాలా అవసరం. కానీ ఒక పరిశ్రమని నెలకొల్పినప్పుడు భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు జరుగవచ్చు అనేది ముందుగానే ఒక అంచనాకి వచ్చి అందుకు తగిన ముందస్తు చర్యలు చేపట్టాలి. దీన్నే మా పరిభాషలో forward error correction అంటారు. ఇలాంటి గంభీరమైన అంశాలు గురించి ఆలోచించడం మానేసి సులభమార్గాల్లో రాబడి పెంచుకోవాలని జనబాహుళ్యంలో పేరుకుపోయిన మద్యపాన బానిసత్వాన్ని సొమ్ము చేసుకోడం పైనా దృష్టి పెట్టడం చాలా ఖండించాల్సిన విషయం.
మన పిల్లలకి మనం అందించే నిధి కేవలం మన బ్యాంకు బాలన్స్, స్థిర ఆస్తి మాత్రమే కాదు... కాలుష్య రహితమైన పర్యావరణం కుడా.... వందే మాతరం

భయం - ఆనందం (అమ్మ చెప్పిన మాట)

ఇది మా అమ్మగారు రాసారు. పేరు వెంకటలక్ష్మి. ఆవిడకి ఇప్పటి అంతర్జాలం పైన అంత అవగాహన లేకపోడంతో అవిడతరపున నేను దీన్ని మిత్రులందరికి పంచుతున్నాను.
"భయం, ఆనందం వీటిని అనుభవిస్తూనే మనిషి మనుగడ సాగిస్తాడు కానీ మనిషి వివేచించి భయాన్ని పారద్రోలి ఆనందాన్ని ఆస్వాదించాలి...దానికి కావలసింది కాస్త ఓర్పు..నేర్పు..
పొత్తిళ్ళలో పసిపిల్లాడు పక్కకు తిరగాలంటే భయపడతాడు కొన్ని రోజులకి పక్కకు వత్తిగిలి ఆనందంగా నిద్రపోతాడు. అప్పుడు తల్లికి భయం మెుదలవుతుంది పడినపిల్లాడిని హత్తుకోని ఆనందిస్తుంది.
అడుగులు వేసేటప్పుడు అమ్మ చేయి వదలడానికి భయపడతాడు మరికొన్ని రోజులకి ఆనందంతో పరుగులు పెడతాడు. అప్పుడు వాడికి అంతా ఆనందంగా వుంటుంది.
తరువాత అమ్మని వదలి స్కూలికి వెళ్ళాలి అంటే భయం. అక్కడ నేర్చుకొన్నవి అమ్మ మెచ్చుకొంటొంటే ఆనందంతో స్కూలికి పరుగులు తీస్తాడు.
అలాగ చదువు ముగిసి ఉద్యోగానికి వెళ్ళాలంటే భయం ఈ ఉద్యోగం ఏమిటిరా బాబు అని... బాస్ అంటే భయం..ఉద్యోగం నిలుపుకోగలనో లేనో అనే భయం...నెలాకరున తోలిజీతం తీసుకొనేసరికి దేశాన్ని గెలిచినంత ఆనందం...పర్మినెంటు అయ్యిందంటే అనంతమైన ఆనందం.
తరువాత వివాహం అంటే భయం జీవిత భాగస్వామి ఎటువంటి వాళ్ళోస్తారోనని...ఇంక అత్తంటే భయం (భారం).... ఆడపడుచంటే భయం....ఇంక భార్యా భర్తల మధ్య ఒకరంటే ఒకరికి భయం...కోడలంటే అత్తకు భయం ఎందుకు. ఈ భయాలు అని ఆలోచిస్తే మనం కుాడా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అంటూ వచ్చినవాళ్ళమేగా... అందరూ మనవాళ్ళనుకోని కొంచం ఓర్పు, నేర్పుతో ఉంటూ కొత్తదంపతులు కలిసేలాగ రెండుకుటుంబాలు కలిసి మెలిసి మనగలిగిననాడు అందరికీ ఆనందమేగా...
కుటుంబాలు బాగుంటే ఊరు బాగుంటుంది...ఊరుబాగుంటే రాష్ట్రం...దాన్నిబట్టి దేశం..మోత్తం ప్రపంచమే బాగుంటుంది. దానికి కావలసింది ఓర్పు, సహనం, త్యాగం (ఈరోజు ఈకరోనా రానే రాదుగా)
"కలసి వుంటే కలదు సుఖం"
మనవలు వాళ్ళ ఆటపాటలతో ముసలితనం వచ్చేస్తుంది. వృద్ధాప్యం వచ్చాక మరణభయం...మనం ఎక్కడ నుంచి వచ్చాము? భగవంతుని దగ్గర నుంచే కదా అని ఒక్క క్షణం ఆలోచించామంటే...మనం వచ్చిన చోటుకే కదా వెళ్ళేది (భగవంతుని దగ్గరికి) అనుకొని...ఒక ఆడపిల్ల పుట్టింటికి ఎంత ఆనందంగా వెడుతుందో అంతే ఆనందంగా పుట్టినచోటుకే వెడుతున్నామనుకొంటే అంతా ఆనందమేగా (ఆడపిల్ల అత్తారింటిలో స్వతంత్రంగా వుండలేదు పుట్టింట్లో స్వతంత్రంగా వుంటుంది). మనము మన మరణ సమయంలో భగవంతుని దగ్గరకి వెడుతున్నామని ఆయన తలపులతో ఆనందంగా ప్రాణం వదిలిన నాడు మనకి మోక్షానందమే కదా."
(6/4/2020, అమ్మ)

Sunday, May 3, 2020

మంచి-చెడు

ఈ సమాజంలో చెడ్డవాళ్ళ పట్ల జాలి ఉన్నంతగా మంచివాళ్ళ పైన మమకారం ఉండదు ఎందుకో...చెడ్డవాళ్ళ నూరుతప్పులను "వాడంతే" అని సహిస్తుంది కాని మంచివాళ్ళు ఒక్క తప్పటడుగు వేస్తే చాలు భూతద్దం పెట్టి మరీ చూపిస్తుంది...
తనకి ఉన్న శక్తి, కాలం, అధికారం, అందం, డబ్బు ఇవన్ని చేజారిపోయిన తర్వాత మేలుకొలుపు వస్తే అది నిజమైన మార్పు ఎలా అవుతుంది... "వృద్ధనారీ పతివ్రతా" అన్న సామెత చందంగా గత్యంతరం లేకమారినట్టు అవుతుంది గాని... ఒకవేళ వాళ్ళకి పూర్వ స్థితి కల్పిస్తే ఇప్పటిలాగనే బుద్ధిగా ఉంటారా? లేక పాతబాట పడతారా? అన్నది కూడా చూడాలి...అప్పుడే ఆ మార్పులో నిజాయితి బయటపడుతుంది..
పుట్టినప్పుడు అందరు మంచివాళ్ళే. అవకాశాలు అన్నీ ఉన్నప్పుడు కూడా చెడుకి ఆకర్షితుడనివాడు గొప్ప. ఒకటి రెండు తప్పులు జరిగినా అవి సరిదిద్దుకుని తనలోని మంచికి మెరుగులు దిద్దేవాడు గొప్ప.
"మంచితోలు" కప్పుకొని అవకాశనికి తగ్గట్టుగా చిలకపలుకులు వల్లించే వారి మాటలెపుడూ తియ్యగానే ఉంటాయి... ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు చెప్పేవాళ్ళ మాటలు నిష్టూరంగా అనిపిస్తాయి...
మూసపోతకి భిన్నంగా ఉన్నతంగా ఉంటే సమాజం భరించలేదు.
అన్ని విధాలా ఉన్నతంగా ఉన్నప్పటికీ అణిగి అణకువతో ఉండడం అవకాశాలు వచ్చినప్పటికి చెక్కు చెదరని స్ధైర్యంతో దేనికి ఆకర్షితుడు కాకపోవడం ఎట్టిపరిస్తితిలోను ధర్మ మార్గాన్ని వదలక పోవడం గొప్ప. తెలియక తప్పులు చేసినా సరిదిద్దుకుని మంచికి మెరుగులు దిద్దుకునే వాడు గొప్పవాడు.
ఇటువంటి వారు లౌకిక జీవితంలో ఓడినట్లు కనిపిస్తారు. కానీ వారి వెనుక రక్షణకవచంలా భగవంతుడుంటాడని తెలుసుకోరు ధర్మోరక్షతి రక్షితః

Saturday, May 2, 2020

ఏం తెలుసు?

వాసనలేని పూలకేం తెలుసు
వసంతకోకిల రాగాలాపనలు
ఆర్ద్రత లేని మనసు చూడగలదా
మాటరాని కంటిచూపుల గురి
వెలుగు చుడని కళ్ళకి
మిణుగురు పురుగుల చావు
బోధపడుతుందా?
దయలేని సంఘానికి
మంచితనమంటే తెలుసా?
కౄరత్వపు కారుచీకట్లు
కమ్మిన మనిషికి
కరోనా వచ్చినప్పుడైనా
జ్ఞానోదయం కల్గునా?

(02/05/2020)

Friday, April 24, 2020

బాలనాగమ్మ (1942 చిత్రం) చూసినప్పడు అనుభూతి

ఈ సినిమా కోసం చాలా యేళ్ళు ఎదురుచుశాను. ఇంతచక్కగా తీసిన చిత్రం అనుకోలేదు. దీని ముందు తర్వాత 1959లో తీసిన బాలనాగమ్మ చిత్రం ఏమాత్రం పోటికి రాలేదు. కాంచనమాల, గోవిందరాజులు, మాస్టర్ విశ్వం చాలా బాగా నటించారు. లేదు లేదు వాళ్ళ పాత్రలకి జీవంపోశారు. ఇప్పటివరకు గోవిందరాజులుని సౌమ్యపాత్రలలోనే చూసాను. అతనిలో అంత టాలెంట్ ఉందనుకోలేదు. అతని రూపు, నవ్వు చూసి అక్కడక్కడా నాకే భయంవేసింది. ఇక బలవర్ధిరాజు పాత్రలో చాలా ఆకట్టుకున్నాడు మాస్టర్ విశ్వం. ఎందుకో ఆ కుర్రాడు తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. మాష్టర్ విశ్వం నటన బాగా నచ్చి అతని మీద ఒక వికిపీడియా ఆర్టికల్ కూడా క్రియేట్ చేసాను (https://en.wikipedia.org/wiki/Master_Viswam).
అందుకే జెమినీ స్టూడియో వాళ్లకి ఇదే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం అయ్యింది. సుమారు 7-8 నిమిషాలు కట్ అయ్యింది అనుకుంటా.చాకలి తిప్పడు-పులిరాజు ఉదంతం చూడలేకపోయాను. విశ్వంలో ఎన్నెన్నో వింతలు. అన్నిటిని మనం చూడలేము. కొన్ని మన ఇమాజినేషన్‌కి వదిలేయాల్సిందే.
ఇంకా చెప్పాలంటే, సంగీత దర్శకత్వం కూడా చాలాబాగుంది. మాయల మరాఠి నాగమ్మ అపహరణకి జనంగదొర వేషం కట్టేటప్పుదు ఉన్న నేపథ్య వీణనాదం ఎంత బాగుందో. ఈ సినిమా రేలంగి కూడా ఉన్నాడు. రాణి సంగు పాత్రలో పుష్పవల్లి నటన కూడా బాగుంది (ఆమె మాజీ హీరోయిన్ రేఖ తల్లి). టెక్నాలజీ పెద్దగాలేనప్పటికీ అలనాటి నటుల గాత్రం, నటనని హృదయపూర్వకంగా మెచ్చుకోవాలి. పాత సినిమాని బాగుచేసినవారికి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినవారికి ధన్యవాదాలు చెప్పకతప్పదు.

Monday, April 20, 2020

ఓయ్ గోరువంక

ఓయ్ గోరువంకా
ఉలుకూ పలుకూ లేకుండా
ఏమిటా మౌనం..

నిద్రలోకి జారుకొమ్మని
సైగచేస్తున్నావా ఏంటి..

ఇంతకు మునుపే కదా
సుప్రభాత కుహుకుహులతో
గాఢనిద్రలోంచి మేలుకొలిపావు

అలుపులేని కిలకిలలతో
ఏన్నో ఊసులు చెప్పేసి
ఒక్క ఉదుటున ఎగిరిపోతే
పట్టుకోలేననుకుంటున్నావా

నా మనసే చిలకలా మారి
నీతో పాటు ఎగురుతోంది
వెన్నెలే నీ విలాసమైతే
చంద్రయానానికి సిద్ధం కానా?

విలాసం=చిరునామా, address

(పరి 21/04/2016)


ఎగిరే పావురమా

ఓ ఎగిరే పావురమా
రివ్వురివ్వుమంటూ
రెక్కలు విదిలించి
ఆకాశమే హద్దుగా
నువు దుసూకుపో

పంజరాన బంధిస్తే
కట్టడిచేయగలిగేది
నీ రెక్కలనే గాని
ఊహలను కాదు

ఎంత ఎగరాలో
ఎక్కడ ఒదగాలో
నీకు నీవే తెలుసుకొని
నిర్ణయించుకోవాలి తప్ప
అవి మరెవరో చెబితే
ఇంకది స్వేచ్చ కాదు బంధనం
ఒదగడం కాదు అణిచివేత

గాయపడి పగిలిన
నీ హృదయశిల్పాన్ని
స్వాలంబన అనే ఉలితో
మరలా చెక్కి చుడు
ఒంపుసొంపులతో హొయలుపోయే
అద్భుత కళాఖండ
మానసప్రతిమ రూపుదిద్దుకుంటుంది
ఆ నైపుణ్యం నీ హృదయాంతరాళాన
పదిలంగా దాగుందని గుర్తుంచుకో

ఓపికనంతా కూడగట్టి ఎగురు
ఓ స్వేచ్చా విహంగమా 
మంచి చెడు తెలుసుకొని
ఎటు పయనిస్తావో 
నీకు నీవే నిర్ణయించుకో

Saturday, April 18, 2020

ఆంగ్లమాధ్యమం బోధన జీవో - తెలుగు బాషా పరిరక్షణ


ఇటీవల ఆంగ్లమాధ్యమ బోధన జీఓ రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు తీర్పిచ్చింది. ఈ గొడవ మొదలైనప్పుడే ఈ సమస్యపైన నా ఆలోచనలు రాద్దామనుకున్నా కాని పనిలో బిసి అయిపోయి వీలు చిక్కలేదు.

జనంలో ఒక మార్పు అనేది క్రమేపి రావాలి తప్ప పిడుగు పడ్డట్టు ఉండకూడదు (కరోనా మహమ్మారి లాగ). ఉన్నపళంగా తెలుగుమీడియం ప్రభుత్వపాఠశాలలను ఇకపై ఇంగ్లీష్‌మీడియం బోధన చేయాలి అని జీవో పాస్ చేయడం ఒకరకమైన నిరంకుశ నిర్ణయమనే చెప్పాలి. ఈ సమస్యలో తెలుగుభాష పరిరక్షణ”, ఇప్పటికి బాలలకు కావాల్సిన ఇంగ్లీషు భాషానైపుణ్యం” ఈ రెండు అంశాలని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరముంది.

చిన్న వయసులో పూర్తిగా ఇంగ్లీషుబోధన అంటే పిల్లలు పాఠాలు అర్ధంచేసుకోడం చాలా కష్టమైనా పని. అది ఏ సబ్జెక్టు అయినా అందులో పాఠ్యాంశాలు వివరణ మాతృభాషలో ఉంటే కొంచెం శ్రమతో చాలా సులువుగా అవి బుర్రలోకి ఎక్కుతాయి. ఒక మనిషి తనబుర్రలోని ఆలోచనలుసందేహాలువిషయంపై అవగాహన లాంటివి అమ్మభాషలో చెప్పగలిగినంత సులువుగా పరాయిభాషలో చెప్పలేడు. ఈ సంగతి నేను ఫ్రాన్స్ వచ్చాక ఇక్కడి ఫ్రెంచి,అరబ్చైనీస్ లని చ్చుసినప్పుడు బాగా తెలిసొచ్చింది. ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ అందుకున్న ఫ్రెంచి సైంటిష్ట్ సరిగ్గా ఇంగ్లీషులో మాట్లాడ లేకపోడం చూసి ఇంగ్లీష్ కి తెలివికి అస్సలు సంబంధంలేదు అని తెలుసుకున్నాను. అంతెందుకు మా ప్రొఫెసర్ తో టెక్నీకల్ డిస్కషన్స్ అప్పుడు అయనకి తోచిన కొత్త ఐడియా చెప్పాలంటే మొదట ఫ్రెంచ్లో గణగణ చెప్పేసి తర్వాత నిదానంగా ఇంగ్లీష్ లో తడబడుతూ వివరిస్తారు. ఆయనకి ఇంగ్లీష్ రాదనీ కాదు కాని "మనిషి మెదడుకి అమ్మభాషకి చాలాదగ్గర సంబంధం ఉంది" అన్న విషయం మనం కచ్చితంగా ఒప్పుకోక తప్పదు. 

నా సొంత అనుభవం చెప్పాలంటె నా చిన్నతనంలో మా అమ్ముమ్మగారింటికి వెళ్ళినప్పుడు క నుండి ఱ (బండి ర) వరుకు గుణింతాలుద్వయాలు రాయమని చెప్పెది. (ద్వయాలు అంటే వాటిలో కష్టమైనవి అనమాట. eg: క అక్షరానికి క్కక్తక్నక్మక్యక్రక్లక్వక్సక్శ). మొత్తం రాసేస్తే పూతరేకులుసున్నుండలువెన్న పెడతాను అని చెప్పేది. చాలా కష్టమనిపించినా నోరూరించే తినుబండారాల కోసం వీరావేశంతో రాసేసేవాణ్ణి. వేసవి సెలవలు అయ్యేసరికి నాచేత పెద్దబాలశిక్ష పుస్తకంమొత్తం పూర్తి చేయించింది. అందులో తెలుగుగణితంనీతిసూక్తులుపొడుగుకథలు,
పద్యాలు ఇలా చాలా ఉండేవి . అవి గాక వేమనసుమతి శతకంలో చాలా పద్యాలు నేర్పించింది . "విష్వక్సేనుడు", “సున్న లేకుండా పంచాంగం (పఞ్చాఙ్గమ్)” అని రాయించడం ఇప్పటికి గుర్తు. పంచతంత్ర కధలుకాశిమజిలీ కధలువిక్రమార్కుడు కధలురామాయణంభారతం ఇలాగ చాలా చెప్పేది మా అమ్ముమ్మ. అందుకేనేమొ నాకు తెలుగుపైన కాస్త ఈ మాత్రంపట్టుంది అంటే మా అమ్ముమ్మ చలవ అని చెప్పాలి.

కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివినంతమాత్రాన తెలుగుభాషకి పిల్లలు దూరమవుతారు అంటే పూర్తిగా ఒప్పుకోలేను. కొన్ని ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ లో నిర్బంధంగా క్లాసులో ఇంగ్లీషులోనే మాట్లాడాలి అనే నియమం చాలా తప్పు అనిపిస్తుంది. తెలుగుపట్ల చిన్నచూపు పిల్లల్లో కలగడానికి ఇదొక ప్రధాన కారణం. అధ్యాపకులుతల్లిదండ్రులు పిల్లలకి తెలుగు భాష లోని సొగసుసాహిత్యంలో తియ్యదనం తెలిసేలా చేయాలి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో తన ఒంటెద్దు పోకడ మానుకోవలి. ఇందుకు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా పుదుచ్చేరిలో అమలు చేసిన విధానాన్ని ఆదర్శంగా తీసుకొంటే బాగుంటుందేమో. 1990లో యానాంలో గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించారు. నేను అందులోనే చదువుకున్నాను. చాలా నాణ్యత కలిగిన చదువుచెప్పేవారు. పేరుకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినప్పటికీ పాఠాలు తెలుగులోనే వివరించి చెప్పేవాళ్లు. కానీ యానాంలో తెలుగు మీడియం స్కూల్స్ ఎక్కువ అని చెప్పాలి. అంటే ఒకరకమైన సమతుల్యాన్ని మా ప్రభుత్వం పాటించింది.

తమ పిల్లల్ని ఏ మీడియంలో చదివించాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకి ఉండాలని హైకోర్టు తీర్పుని నేను ఒప్పుకుంటున్నాను.



Friday, April 10, 2020

హతవిధి

స్వప్నలోకసంచారివని నెచ్చెలి కవ్వించగా
చలి కబళించెను నా హృదిని

తన నునువెచ్చటి చూపులే కరువాయే 
హతవిధి!!!
మరి ఏ కంబళి నను సేదదీర్చునో?

Wednesday, April 8, 2020

కరోనా - మనిషి మూర్ఖత్వం

చలికాలం చప్పుడుచేయకుండా వెనుదిరిగింది... ఎదురుచూసిన వసంతం రానే వచ్చింది... పర్యాటకులతో పారిస్ పరిఢవిళ్ళాల్సిన వేళ... అది ఆస్వాదించలేని వింతపరిస్థితి... ఆ స్తబ్దతకు నిలువెత్తు సాక్షి ఈఫిల్.
మబ్బులోంచి సూర్యుడు తొంగిచూసినా...ఇళ్ళకే పరిమితమైయ్యారు జనాలు. కాలగమనంలో మనిషి ఎంత పురోగమించినా... అతడి ముందరకాళ్ళబందాలు ఎన్నెన్నో... అవి తనకు తాను ఏర్చి కూర్చి పేర్చుకున్నవి కదా...అంతే మరి.
విలాసానికి చిరునామా లాంటి వీకెండ్ ఇప్పుడు ఏకాంత విలాపానికి తెరతీసినట్టైంది. మొదట్లో కరోనా మహమ్మారి చాలా గుబులుపుట్టించింది కాని మనుషల వికృత చేష్టలు చూసి చూసి వైరసే నయమనిపించింది. మతం తప్ప మానవత్వాన్ని చూడలేని పైత్యం ఒకవైపు... తన దైనందిన జీవితంలో వీసమెత్తు లోపం వచ్చినా తట్టుకోలేక వ్యవస్థని నిందుస్తు వ్యక్తులపై విరుచుకు పడే కొందరి యువత ధోరణి మరో వైపు.... ఏది యేమైనా పర్లేదు నా ఇష్టంవచ్చినట్లు నేనుంటా అనే లెక్కలేనితనం ఇంకోవైపు....
ప్రతిరోజు ఉరకలు పరుగులతో గజిబిజి జనప్రవాహంలో కొట్టుకుపోయే మనుషుల యాంత్రిక జీవనవిధానాన్ని ఒక్కసారిగా స్థంభించుకుపొయేలా చేయగలిగింది కరోనా. ఈ వైరస్ తనకు తానుగా వ్యాప్తిచెందట్లేదు... మనిషి వ్యాపింపజేస్తున్నాడు....తనతో...తన అలవాట్లతో.... మొండితనంతో... లెక్కలేనితనంతో... ఫలితం.... జీవితంలో పొరాడి అలిసిపోయి సేదతీరాల్సిన వయసులోని ముసలివాళ్ళు నేరుగా కాటికి బలవంతంగా గెంటివేయబడటం...
ఇంత గందరగోళంలో "వర్క్ ఫ్రం హోం" చేస్తున్నామని సంబరపడుతున్నారు కాని అసలు హోం అంటే ఏది? మనం నివాసమున్న ఇల్లా? ఉండే ఊరా? భూమా?
కనిపించని స్వర్గం కోసం మతం మారమంటు కాట్ల కుక్కలాగ కరవడానికి ఉన్న గొర్రెమంద చాలానే ఉంది. ఈ అనంతవిశ్వంలో మనమున్న భూమి ఒక్కటే కనబడే స్వర్గం అని మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడో.... "ఉందో లేదో తెలియని దానికోసం ఉన్నదాన్ని నాశనం చేసుకునే ఏకైక జంతువు మనిషి" అనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు. కళ్ళముందు నాశనం కనిపిస్తున్నా సరే అదే బాటలో పయనం చేస్తాడు మనిషి... మారడు.
బ్రతుకు ఆటలో గెలుపు కష్టమే కాని అసలు గెలుపుకి నిర్వచనం ఏంటి? ఎందుకు గెలవాలి? గెలిచి ఏంచేయాలి? అని మనసుని దొలిచే ప్రశ్నలకి జవాబు రాబట్టడం ఇంకా కష్టం. ఈ కలుషితలోకంలో స్వచ్చత ఏదో మారుమూలన నక్కి దాంకుంది. ప్రతీదాంట్లో కాలుష్యమే...మాటల్లో కాలుష్యం...తలపుల్లో కాలుష్యం...నడతలో కాలుష్యం....అమ్మేవాటిలో కాలుష్యం....తినేవాటిలో కాలుష్యం....విద్య కాలుష్యం...వైద్యం కాలుష్యం... ఈ కాలుష్యంలో సదా చస్తు బ్రదుకుతూ గడపడమేనా జీవితం. అంతర్మధనంలేనిదే అమృతం పుట్టదేమో. అప్పటికి కాని ఈ నిరంతర చావు నుండి మనకి విముక్తి దొరకదు. అటువంటి అమరత్వానికై ఎదురుచూస్తూ...

Sunday, April 5, 2020

ఏమౌతుందేమౌతుంది

ఏమౌతుందేమౌతుంది
మూసపోతకి భిన్నంగా
నీ జీవితగమనం కొనసాగుతే
ఏమౌతుందేమౌతుంది
గేలిచేసి గోలచేసి
కొంతమంది నవ్వుతారు
అదునుచూసి పదునుగా
మాటలతో
రాళ్ళు రువ్వుతారు
నవ్వితే నవ్వనీ
రాళ్ళు రువ్వితే రువ్వనీ
నీ పయనం ఆపలేరు
నీ విజయం చెరపలేరు
నీ కధనే నువ్వు రాయి
కధనాన్నే మార్చేయి
కొత్తబాట పరుచుకుంటు
సరికొత్త బాణి కూర్చుకుంటు
వడివడిగా అడుగులేస్తే
మహా ఐతే
ఏమౌతుందేమౌతుంది
కాగలవు ఒక స్ఫూర్తి
లభియించును ఘనకీర్తి
మరి ఓడితే
నేర్చెదవు మంచినీతి
విడిచెదవు బ్రతుకుభీతి
మరి అంతకంటే
ఏమౌతుందేమౌతుంది
ఏమౌతుందేమౌతుంది

10/12/2019 హైదరబాదు