Saturday, April 18, 2020

ఆంగ్లమాధ్యమం బోధన జీవో - తెలుగు బాషా పరిరక్షణ


ఇటీవల ఆంగ్లమాధ్యమ బోధన జీఓ రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు తీర్పిచ్చింది. ఈ గొడవ మొదలైనప్పుడే ఈ సమస్యపైన నా ఆలోచనలు రాద్దామనుకున్నా కాని పనిలో బిసి అయిపోయి వీలు చిక్కలేదు.

జనంలో ఒక మార్పు అనేది క్రమేపి రావాలి తప్ప పిడుగు పడ్డట్టు ఉండకూడదు (కరోనా మహమ్మారి లాగ). ఉన్నపళంగా తెలుగుమీడియం ప్రభుత్వపాఠశాలలను ఇకపై ఇంగ్లీష్‌మీడియం బోధన చేయాలి అని జీవో పాస్ చేయడం ఒకరకమైన నిరంకుశ నిర్ణయమనే చెప్పాలి. ఈ సమస్యలో తెలుగుభాష పరిరక్షణ”, ఇప్పటికి బాలలకు కావాల్సిన ఇంగ్లీషు భాషానైపుణ్యం” ఈ రెండు అంశాలని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరముంది.

చిన్న వయసులో పూర్తిగా ఇంగ్లీషుబోధన అంటే పిల్లలు పాఠాలు అర్ధంచేసుకోడం చాలా కష్టమైనా పని. అది ఏ సబ్జెక్టు అయినా అందులో పాఠ్యాంశాలు వివరణ మాతృభాషలో ఉంటే కొంచెం శ్రమతో చాలా సులువుగా అవి బుర్రలోకి ఎక్కుతాయి. ఒక మనిషి తనబుర్రలోని ఆలోచనలుసందేహాలువిషయంపై అవగాహన లాంటివి అమ్మభాషలో చెప్పగలిగినంత సులువుగా పరాయిభాషలో చెప్పలేడు. ఈ సంగతి నేను ఫ్రాన్స్ వచ్చాక ఇక్కడి ఫ్రెంచి,అరబ్చైనీస్ లని చ్చుసినప్పుడు బాగా తెలిసొచ్చింది. ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ అందుకున్న ఫ్రెంచి సైంటిష్ట్ సరిగ్గా ఇంగ్లీషులో మాట్లాడ లేకపోడం చూసి ఇంగ్లీష్ కి తెలివికి అస్సలు సంబంధంలేదు అని తెలుసుకున్నాను. అంతెందుకు మా ప్రొఫెసర్ తో టెక్నీకల్ డిస్కషన్స్ అప్పుడు అయనకి తోచిన కొత్త ఐడియా చెప్పాలంటే మొదట ఫ్రెంచ్లో గణగణ చెప్పేసి తర్వాత నిదానంగా ఇంగ్లీష్ లో తడబడుతూ వివరిస్తారు. ఆయనకి ఇంగ్లీష్ రాదనీ కాదు కాని "మనిషి మెదడుకి అమ్మభాషకి చాలాదగ్గర సంబంధం ఉంది" అన్న విషయం మనం కచ్చితంగా ఒప్పుకోక తప్పదు. 

నా సొంత అనుభవం చెప్పాలంటె నా చిన్నతనంలో మా అమ్ముమ్మగారింటికి వెళ్ళినప్పుడు క నుండి ఱ (బండి ర) వరుకు గుణింతాలుద్వయాలు రాయమని చెప్పెది. (ద్వయాలు అంటే వాటిలో కష్టమైనవి అనమాట. eg: క అక్షరానికి క్కక్తక్నక్మక్యక్రక్లక్వక్సక్శ). మొత్తం రాసేస్తే పూతరేకులుసున్నుండలువెన్న పెడతాను అని చెప్పేది. చాలా కష్టమనిపించినా నోరూరించే తినుబండారాల కోసం వీరావేశంతో రాసేసేవాణ్ణి. వేసవి సెలవలు అయ్యేసరికి నాచేత పెద్దబాలశిక్ష పుస్తకంమొత్తం పూర్తి చేయించింది. అందులో తెలుగుగణితంనీతిసూక్తులుపొడుగుకథలు,
పద్యాలు ఇలా చాలా ఉండేవి . అవి గాక వేమనసుమతి శతకంలో చాలా పద్యాలు నేర్పించింది . "విష్వక్సేనుడు", “సున్న లేకుండా పంచాంగం (పఞ్చాఙ్గమ్)” అని రాయించడం ఇప్పటికి గుర్తు. పంచతంత్ర కధలుకాశిమజిలీ కధలువిక్రమార్కుడు కధలురామాయణంభారతం ఇలాగ చాలా చెప్పేది మా అమ్ముమ్మ. అందుకేనేమొ నాకు తెలుగుపైన కాస్త ఈ మాత్రంపట్టుంది అంటే మా అమ్ముమ్మ చలవ అని చెప్పాలి.

కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివినంతమాత్రాన తెలుగుభాషకి పిల్లలు దూరమవుతారు అంటే పూర్తిగా ఒప్పుకోలేను. కొన్ని ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ లో నిర్బంధంగా క్లాసులో ఇంగ్లీషులోనే మాట్లాడాలి అనే నియమం చాలా తప్పు అనిపిస్తుంది. తెలుగుపట్ల చిన్నచూపు పిల్లల్లో కలగడానికి ఇదొక ప్రధాన కారణం. అధ్యాపకులుతల్లిదండ్రులు పిల్లలకి తెలుగు భాష లోని సొగసుసాహిత్యంలో తియ్యదనం తెలిసేలా చేయాలి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో తన ఒంటెద్దు పోకడ మానుకోవలి. ఇందుకు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా పుదుచ్చేరిలో అమలు చేసిన విధానాన్ని ఆదర్శంగా తీసుకొంటే బాగుంటుందేమో. 1990లో యానాంలో గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించారు. నేను అందులోనే చదువుకున్నాను. చాలా నాణ్యత కలిగిన చదువుచెప్పేవారు. పేరుకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినప్పటికీ పాఠాలు తెలుగులోనే వివరించి చెప్పేవాళ్లు. కానీ యానాంలో తెలుగు మీడియం స్కూల్స్ ఎక్కువ అని చెప్పాలి. అంటే ఒకరకమైన సమతుల్యాన్ని మా ప్రభుత్వం పాటించింది.

తమ పిల్లల్ని ఏ మీడియంలో చదివించాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకి ఉండాలని హైకోర్టు తీర్పుని నేను ఒప్పుకుంటున్నాను.



11 comments:

  1. నిర్మొహమాటంగా చెప్పాలంటే ప్రభుత్వం అనుకున్నది చేసేస్తూ ప్రజలు కోరిక మేరకే చేస్తున్నాం అంటారు. ఐనా అందులోనూ కొంత లాజిక్ ఉందనే చెప్పాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసినది అన్నది ఒక్కటే. పాయింటే కాదండి. ప్రభుత్వం లోనికి వచ్చిన పార్టీ వారు తమ మేనిఫెష్టోలో ఉంచినది చేసినప్పుడు ప్రజలకు చెప్పి వారి ఆమోదంతో చేసినట్లే అన్నదే లాజిక్. ఒకవేళ కోర్టులు దృష్టిలో తప్పు అని తేలితే చట్టాలను మార్చిలో అవసరం అనుకుంటే రాజ్యాంగాన్ని మార్చిలో తమ మాటను నెగ్గించుకోవటానికీ ప్రభుత్వాలు లో వెనుదీయవు.

    ReplyDelete
  2. మన్నించాలి మొబైల్ మీద టైపు చేస్తే తప్పులు వస్తాయి. మార్చిలో బదులు మార్చి అని చదువుకోగలరు. ఇంకా కొన్ని ముద్రారాక్షసాలు ఉండవచ్చును!

    ReplyDelete
    Replies
    1. అయ్యో పర్లేదండి..భలేవారే.... నాకు అడపాదడపా తప్పులు దొర్లుతుంటాయి. పోష్టుచేసిన తర్వాత కాని కనిపించవు అదేంటో మరి.

      పొష్టు చదివి మీ ఆలోచనలు తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్.

      Delete
  3. Reposting after correcting typo:

    రామోజీరావు లాంటి స్వయంప్రకటిత తెలుగు భాషాభిమాని తన సొంత మనుషుల భావిపౌరుల కోసం తన సతీమణి పేరు మీద పెట్టుకున్న బడి మాత్రం ఇంగిలీషులో ఉండొచ్చు! తెలుగు మాధ్యమం వారి పిల్లల "వ్యక్తిత్వ వికాసానికి దోహద"పడుతుందనే సంగతి "పెద్దాయన" మరిచిపోయినట్టుంది.

    ఒక ప్రజానాయకుడు ఊరూరూ తిరిగి "పెద్దోళ్ల బిడ్డలు డబ్బులిచ్చి చదువుకుంటున్నారు, మా బుడతడికి ఆ ఫీజులు కట్టలేకపోతున్నాం" అన్న జనం మొరలను చెవులారా విన్నది ప్రజాభీష్టానికి అద్దం కాదా? ఇంకో శాస్త్రీయ పరమయిన సంపూర్ణ ప్రజాభిప్రాయ సేకరణ అధ్యయన ద్వారా నివేదిక వస్తే ఇప్పుడొచ్చిన అడ్డంకులు తొలిగి పోతాయి. పోయినేడాది ఓట్లతో తమ వాణిని "పండితుల" చెవుల తుప్పు తెగేటట్టు వినిపించిన జనం మళ్ళీ అదే విషయాన్ని ఇంకా గట్టిగా చెప్పడం తధ్యం.

    అసమదీయుల పిల్లలను ఇంగిలీషులో చదివించు"కొని" గద్దె ఎక్కిన గద్దల్లాంటి "పెద్దలు" జీతగాళ్ల పిల్లలు అదే బాటలో ఎదుగుతారేమోనన్న అక్కసుతో నిచ్చెన తన్నేద్దామని పన్నిన కుట్రలు తిప్పి కొట్టుదాం. ఏ భాష అయినా దాని పుట్టుక, ఎదుగుదల & అభివృద్ధి అంతా జనంతోనే. భాష పేరుతో దాన్ని రక్షించుకుంటున్న సామాన్యుల పిల్లలను బానిసలుగా మిగిల్చే ఆలోచన ఇంకెన్నాళ్లు? ముప్పవరప్పాడు చెరుకూరు వగైరా ఊళ్ల పెదరాయుళ్లు తమతమ కుటుంబాలలోని పిల్లలకు ఎంచక్కా తెలుగులోనే సకల విద్యలు నేర్పించి భాషను ఉద్దరించుకుంటామంటే వారిష్టం.

    ReplyDelete
    Replies
    1. నా ఉద్దేశం ప్రకారం తెలుగు మీడియంలో చదివినంత మాత్రాన తెలుగు ఉద్ధరించబడుతంది కాదు. ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే ఎంతోకొంత భవిష్యత్తు బాగుంటుంది అని తల్లిదంద్రులు అనుకోవడంలో తప్పేలేదు. కాని ఆ స్కూళ్ళలో పాఠాల వివరణ తెలుగులో ఉండాలి. తెలుగు భాషా పరిరక్షణ విషయంలో కేవలం స్కూల్ టీచర్లకి మాత్రమే బాధ్యత అప్పజెప్పకుండా తల్లిదంద్రులు తమ వంతు కృషిచేయాలి.

      ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం మాత్రం చాలా మంచి మార్పు. అందులో నాణ్యమైన విద్యని పిల్లలకి అందించేలాగ చూడాలి. కాని అందుకోసం బలవంతంగా ఉన్న స్కూళ్ళని ఉన్నపళంగా ఇంగ్లీష్ మీడియం కింద మార్చడం ఎంతవరుకు కరెక్టో తెలిదు.

      Delete
    2. మీ అభిప్రాయం, సూచన బాగుంది చైతన్య గారు.

      Delete
    3. శ్యామలీయంగారు, Jai Gottimukkala గారు, GKK(జి) గారు నా రచన చదివి మీ విలువైన అభిప్రాయం, అభినందన తెలిపినందుకు చాల సంతోషం. థ్యాంక్స్ అండి.

      Delete
  4. < జనంలో ఒక మార్పు అనేది క్రమేపి రావాలి తప్ప పిడుగు పడ్డట్టు ఉండకూడదు >

    < ఒక మనిషి తనబుర్రలోని ఆలోచనలు, సందేహాలు, విషయంపై అవగాహన లాంటివి అమ్మభాషలో చెప్పగలిగినంత సులువుగా పరాయిభాషలో చెప్పలేడు. >

    < ఈ సమస్యలో “తెలుగుభాష పరిరక్షణ”, ఇప్పటికి బాలలకు “కావాల్సిన ఇంగ్లీషు భాషానైపుణ్యం” ఈ రెండు అంశాలని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరముంది. >

    "మనిషి మెదడుకి అమ్మభాషకి చాలాదగ్గర సంబంధం ఉంది" అన్న విషయం మనం కచ్చితంగా ఒప్పుకోక తప్పదు.

    చాలా బాగా వ్రాశారు. మీ స్వంత అనుభవాలు చిన్ననాటివి, ఉద్యోగంలోనివి ఉదహరించడం ఉపయుక్తంగానూ, ఆలోచనాపరులకు మార్గదర్శంగానూ ఉంది.

    సత్యాన్ని ఆధారం చేసుకునే పాలకుల విధానాలుండాలి. లేకుంటే ఆచరణలో అవి సత్ఫలితాలను ఇవ్వలేవు. పిల్లల భవిష్యత్తునీ, సమాజం గతినీ మార్చే ఆలోచనలు ఉద్భవించడానికి అత్యంత కీలకం అయిన భాష విషయంలో నిర్ణయాలు చేసేటపుడు దూకుడు, విద్యను వ్యాపారం చేయడం రెండూ మంచివి కావు. విద్య ప్రభుత్వం ఆధ్యర్యంలో ఉంటేనే మాత్రమే ఇటువంటి సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. Palla Kondala Rao గారు మీ మెచ్చుకోలుకి చాలా సంతోషం, ఉత్సాహజనకంగా ఉంది. నాణ్యత కల్గిన విద్య, వైద్యం, రక్షణ అనేవి ఒక ప్రభుత్వం యొక్క మౌలిక కర్తవ్యం. రాజకీయం కంటే మానవత్వం, ముందుచూపు చాలా అవసరం. వెనుకబాటుతనం అనేది ఒక్కతరంలో సమసిపోవాలి అంటే అది ఒక్క చదువుతోనే సాధ్యం. ఆ వెనుకబాటు సామాజికమే కానక్కరలేదు..ఆర్థికమైనది కూడా కావచ్చు. నాణ్యమైన చదువు"కొనే" స్తోమత చాలామందికి ఉండదు (private school education). అంతెందుకు చదువు"కొనే"మాట దేవుడేరుగు యూనిఫాం దుస్తులు సరిగా కుట్టించుకోలేనివాళ్ళెంతమందో. దానికి నా కుటుంబనేపథ్యం, గతానుభవమే సాక్ష్యం. అలాంటి నాబోటివాళ్ళకి నాణ్యమైన విద్య అందించిన పుదుచ్చేరి ప్రభుత్వానికి వేవేల కృతజ్ఞతలు. ప్రభుత్వం నుండి ఆ దిశలో చిన్నతోడ్పాటు ఉండగిలిగితే చాలు కసితీరా విజ్ఞానపుటంచులు వెదుకుతు ఎంతైనా చదువుకోగలుగుతారు. చదువు"కొనె"వాడీకి "ఎంతచదివినా 100మారుకులకే కదా" అనే ధోరణి ఉంటే బాగా చదువుకోవడమే పరమలక్ష్యంగా ఉన్న విధ్యార్థికి "ఆ సబ్జెక్టులో విజ్ఞానానికి పరిమితులు లేవని...ఎంతచదివి తెలుసుకునా ఇంకా తెలియని అంతుచిక్కన ప్రశ్నలతో సంభ్రమాశ్చర్యాలు గురికావల్సిందే" అనే భావనలో ఉంటాడు.

      అందుకే విద్యా నిర్వ్యాపారీకరణ కి, ప్రభుత్వాధినంలో విద్యావ్యవస్థ ఉండాలి అనే ఆలోచనకి నేనేప్పుడు మద్దత్తు తెలుపుతాను.

      For a better India.... Vande mataram!!!

      Lutter contre la commercialisation de l'éducation....

      Delete
  5. ఈ విషయంలో నా అభిప్రాయం నా బ్లాగులో వ్రాసాను, ఇక్కడ...
    https://bonagiri.wordpress.com/2019/11/24/తెలుగేలరా-ఓ-రాఘవా/

    ReplyDelete
    Replies
    1. చదివినందుకు థాంక్స్ అండి. సరే చూస్తాను.

      Delete