Friday, June 26, 2015

పిల్లల్లారా పిచుకల్లారా

చెట్టపట్టాలేసుకుని
చేయిచేయి పట్టుకుని
చాలా అల్లరిచేసే
పిల్లల్లారా పిచుకల్లారా
ఏమిష్టం మీకేమిష్టం

అమ్మచేతి గోరుముద్దలు
చివరాఖరి బడిగంట
వెన్నెల్లో దాగుడుమూతలు
నాన్న కొన్న కొత్తబట్టలు
తిరునాళ్ళలో పీచుమిఠాయి
నింగికెగిసే గాలిపటం
దాకుచున్న ఆటబొమ్మలు
చిటారుకొమ్మన జాంపండు
బస్సులో కిటికిపక్క చోటు
.........
ఇంకా ఎన్నో ఎన్నెనో
చాంతాడుకన్నా పొడుగున్న
ఇష్టాల చిట్టా
మరి మీదేను

ఎండ
వాన
వెన్నెల
చీకటి
తేడా చూడని
చల్లటి చూపుల
మీ కళ్ళు

పేరైనా వినని ఆటలు
ఊహకందని ముచ్చట్లు
అర్థంపర్థంలేని దెబ్బలాటలు
మీకే సొంతం
అవి మీకే సొంతం

తెల్లని కాగితం
ముచ్చెపు రాయి
కమ్మటి పెరుగు
అంతటి స్వచ్చము
మీ తేటమనసులు

కళ్ళలో కోటికాంతులు
గుండెలనిండా గంపెడు ఆశలు
నోరువిప్పితే మాటలవరద
కళ్ళు చెమ్మగిల్లితే విలయతాండవం
ఇది మీ తీరు

ఉరకలు పెట్టి
పరుగులు తీసి
గోడలు వాడలు
మేడల మిద్దెలు
దాటుకుపోయే మీకు
కాగలవా అవి అడ్డంకి

కౌమారం కబళించక మునుపే
ఆపై యవ్వనకాంతిలో
మీ అమాయకత్వం
కొవ్వొత్తిలా కరిగే లోపే
కవ్వింతల కేరింతల
ఆటపాటలతో తేలియాడందోయ్
పిల్లలారా మరుమల్లెల్లారా

- 25/06/2015

ఎదురుచూపు

కవితా నేపథ్యం: ఒక చెలికాడు తన ప్రియసఖికై ఎదురుచూసేడప్పుడు పడే ఆరాటాన్ని, అలాగే చుట్టు పక్కలున్న ప్రకృతిని చూసి అతగాడు పొందే అనుభూతిని ఊహించి రాసిన కవిత ఇది.

ఆకాశవీధిలో నడిచిన బడలికకి కాబోలు
సూర్యుడు మెల్లగా కిందకి జారుకుంటున్నాడు

నెచ్చెలి చెంతనున్నప్పుడు
జింకపిల్లలా పరుగులుపెట్టే కాలం
ఆమెకై వేచిచూసే వేళ మాత్రం
నిండుగర్భిణిలా నత్తనడక సాగిస్తూ
నా సహనాన్ని ఆవిరిచేస్తోంది
మరి చేసేదిలేక చుట్టూరా పరికించి చూసాను

వంపులు తిరిగి పారుతున్న సెలయేరు
సొంపుదీరిన ఆమె నడుముని గుర్తుచేస్తోంది

సెలయేటికి గులకరాళ్ళు అడ్డుపడగా
వెలువడే గలగలలు మరేవో కాదు
తన మనసనే తేనెపట్టునుండి
నిరంతరధారలా స్రవిస్తూ
తేనియలూరే ఆమె కిలకిల పలుకులే

చినుకు తుంపరల
చిటపట చప్పుడు
ఘల్లుఘల్లుమనే
తన కాలిగజ్జెల సవ్వడిలా
నా గుండెలో మారుమ్రోగుతోంది

దూరన కోయిలమ్మ కుహుకుహులు
గారాలుపోయి ఆమె గోముగా ఆలపించే
కూనిరాగాలకి ప్రతిధ్వని కాక మరింకేమిటి

సంధ్యవేళ ప్రకృతివైవిధ్యం
జవరాలిని పరిపరివిధాలు గుర్తుచేసి
నన్ను ఉన్మత్తతతో ఓలలాడిస్తోంది
మరి అది కవ్వింత అనుకోవలా?
లేక ఉపశమనమని ఊరట చెందాలా?

- 23/06/2015

కాగితం పువ్వులు

కొందరి హృదయాలు
కాగితం పువ్వులు
స్పందించలేని మరగుండెలు
ఎడారికొలను కంటే అరుదు
వీరి గుండెల్లో ప్రేమ

కాగితం పూలు కదా
ఎప్పటికి వాడిపోవు
చూడటానికి బాగుంటాయి
కాని చెంతకు చేరి
పీల్చినప్పుడు బయటపడుతుంది
వాటిలో వాసనలేని డొల్లతనం

మొగ్గతొడిగి వికసించి
చుట్టురా అందాన్ని నింపి
కడకు వాడిపోయినా కుడా
సహజపువ్వుల స్థాయిని
కాగితంపూలెప్పుడు చేరుకోలేవు

వీళ్ళకి జీవించడం తెలీక
నటిస్తు కాలం గడిపేస్తారు
నటనలో జీవించచ్చు కాని
జీవితంలో నటించకూడదు

- 16/06/2015

నవ్విన నాపచేను

నవ్విన నాపచేను పండింది
ఎంతగానో ఎదురుచూసిన మబ్బులు
కడకు స్వాతిచినుకుని రాల్చగా
నిరాశల మండుటెండకి
బీడువారిన నేల
నేడు సిరులపంటకి
స్వాగతం పలికింది
అపజయాల అగాధంలో 
ఎంత కూరుకుపోయినా
విజయశిఖరాన్ని చేరడానికి
ఒక్కమెట్టెక్కితే చాలు

14/06/2015

సరదాగా ఓ కవిత

లండనుకై పరుగులు తీయు రైలుబండిపై
ఎండనపడి ఉదయాన పయనము సేయ
తొందరపెట్టగ నా వంకజూసి సమ్మతించి
అందరికి విసానిడువాడు నాకొక్కటిచ్చెన్

అవును రేపే సీమకి ప్రయాణం
ఆంగ్లసీమకి నా తొలిపయనం

- 06/06/2015

అమ్మా! ఏం చెప్పాలి

నింగికేసి చూసాను
ఏముంది అంతులేని ఖాళీ తప్ప

నీకేసి చూసాను
ఏముంది చెరగని చిరునవ్వు తప్ప

అమ్మా!
ఏం చెప్పాలి

ఎండకి అడ్డుగా నువ్వు నిలబడితె
ఆ నీడలో వేళ్ళూనుకుని నేను ఎదిగానని చెప్పనా

నీ కంట ఒలికిన కన్నీరు లావాగ్నిలా
నా బండరాతి గుండెని కరిగించేదని చెప్పనా

నీ బుగ్గన చిరునవ్వుల మెరుపులు చూసిన ప్రతిసారి
నా మేని మైమరచి పులకించేదని చెప్పనా

జీవితపు కొలిమిలోని
పెనుసవాళ్ళ నిప్పురవ్వలు
నన్ను కాల్చినప్పుడు
నువ్వున్నావనే ఒక్క ఆలోచన
నాకు ఎంతో ఊరటనిచ్చి
గాయం మానిపేదని చెప్పనా

కళ్ళెదుట లేవుగాని
కనబడుతున్నది నీ రూపమే

సదా నా గుండెగూటిలో
మహారాజ్ఞిలా వెలుగొందు

- 05/06/2015

సముద్రం-జీవితం

పాలనురగలు చిమ్మే అలలను చూసినప్పుడు
అన్నెంపున్నెమెరుగని నవ్వుల బాల్యం గుర్తొస్తుంది

పున్నమినాడు ఉవ్వెత్తున ఎగిసెపడే కెరటాలను చూస్తే
ఉరకలుపెత్తే ఉత్సహం ఉద్వేగముట్టిపడే యవ్వనం జ్ఞప్తికొస్తుంది

అర్ధరాత్రి ఎంతో గంభీరంగా ఉన్న సముద్రాన్ని చూడగానే
జీవితాన్ని చదివి మౌనం దాల్చిన వృద్ధాప్యం గుర్తొస్తుంది  

ఆహా! సముద్రానికి మనిషి జీవితనికి ఎంతటి పోలిక

-02/06/2015

ఒక గోపిక ఆలాపన

పిల్లనగ్రోవిని చేబట్టి
మెలమెల్లని అడుగులు వేస్తావు
కల్లరివై నువ్వు వెన్నను దోచి
బుంగమూతి మరి పెడతావు

ఉల్లము ఝల్లను మురళిగానము
వెల్లువలా కొనసాగుతు ఉంటే
తుళ్ళిపడదా నా తనువూ మనము
వడివడిగ వృందావనము చేరగ
రాసలీలకై నా మనసు లాగెనే

నీ మాటే వెన్నెల
పాటే ఊయెల
ఓ కృష్ణా

- 03/06/2015

మనసుతీరు

స్వచ్చమైన తేటనీరు 
ఎండకి ఆవిరైతే మబ్బు

రెంటికి మూలమొకటే
కాని ఎంతటి మార్పు

తేటనీరు పారదర్శకతకు చిహ్నం
కారుమబ్బు దాపరికానికి మారుపేరు

మనసు నీరులాంటిదని
ఇతరేయ ఉపనిషద్వాక్యం

ఒక మనసు
వికసించిన పువ్వులాగ
స్వచ్చసౌగంధాన్ని
చుట్టూ వెదజల్లచ్చు

అదే మనసు
సంకుచితపు గోడల్లో
పూర్తిగా కూరుకుపోయి
కరడుగట్టిన రాయిలామారచ్చు

పువ్వుతో కొడితే సరసం
రాయితో కొడితే గాయం

మన మనస్సు
తేటనీరా లేక కారుమబ్బా
పుష్పమా లేక పాషాణమా
అన్నది మనకి మనం
వేసుకోవాల్సిన ప్రశ్న

- 24/05/2015

మూగజీవులు

కఠినవాస్తవపు వేడిదెబ్బకి
మొగ్గలోనె వాడిపోయిన పువ్వులెన్నో
ఎప్పటికిరాని వానకై తెరుచుకొని
ఎదురుచూసి ఎండిపోయిన ఆల్చిప్పలెన్నో
విధి ఆడే వింతనాటకంలో
బలిపసువుగా మారుతున్నదెంతమందో
భావుకతని భళా అంటు
మెచ్చుకునే పెద్దమనుషులకి
చావుకధలకి రచయితలెవరో
వాటికి నేపథ్యాలేమిటో బోధపడతాయా?
ప్రతిపూటా కారుచీకటై
వెలుగుచూడని వింతజీవులు కోకొల్లలు
గుండెగూటిలో ఒక్కొక్క ఊహని
ఏర్చి కూర్చి పేర్చి కలలమేడలు కట్టుకుంటే
వడగాడ్పులకి అవి పేకమేడల్లా కూలిపోతున్నా
ఏమిచేయలేని నిస్సహాయతతో
తాము పడే బాధని గుండెలోనే పెట్టుకొని
మౌనంగా రోదించే మూగజీవులెందరో
మాటవచ్చిన మూగజీవులు
తమ మాటకి విలువలేని మూగజీవులు

ఈ మూగజీవుల మౌనరోదన రూపుమాపి
మరోచరిత్ర సృష్టించగల దమ్ము నీకుందా?

- 30/05/2015

వినీలాకాశంలో వింతలు

ఆరుబయట పరిచిన పక్క

మనసుదోచే వెన్నెల

వింజామరంలా కొబ్బరిమట్టలగాలి

మేమున్నామంటూ కీచురాళ్ళ సవ్వడి

తోటివారితో చెప్పుకొనె ముచ్చట్లు

సుదూరంగా గోదారి పరవళ్ళు

నింగికేసి తొంగిచూస్తే

వినీలాకాశంలో కనబడే వింతలు

చీకట్లో మిణుక్కుమనే చుక్కలు

నాకేసి కన్నార్పకుండా చూసే చందమామ

రోదసి మర్మమేమిటో ఎవడికి ఎరుక

ప్రకృతిసోయగం ఆశ్వాదించడమొక వరం

- 25/05/2015

పువ్వులాంటి జీవితం

కాలమనే నదిలో తరలిపోయే పువ్వులా
వెళ్ళిపోతుంది జీవితం

గతజీవితపు భారాన్ని మొసుకుంటూ చేసే 
ప్రతిమజిలీ ఒక కొత్త అనుభవమే

ఆశ-నిరాశ, గెలుపు-ఓటమి అనే
మెట్టపల్లాలను దాటుకుంటు సాగే పయనమిది

కొన్ని మధ్యలోనే ఆగిపోతే
మరికొన్ని కడకు చేరతాయి

కొన్ని బరువెక్కి మునిగిపోతే
ఇంకొన్ని ఈదురుగాలిలో కొట్టుకుపోతాయి

పువ్వెంత మెత్తగా ఉన్నా
పయనంలో రాటుదేలాల్సిందే

పూరేకులు తెగిపోతు అస్తిత్వాన్నికనుమరుగుచేస్తుంటే
పువ్వుగుభాళింపు మిగులుజీవితానికి కాసింత భరోసా

- 23/05/2015

లోకం అందాలు

ఆవిరి పట్టి
మబ్బులు మోస్తే
వానై కురిసె

విత్తులు నాటగ
మొక్కై మొలిచె
రేపటిచెట్టు

రెక్కలు విరిచి
రివ్వున ఎగిరె
పక్షిపిల్లలు

భూలోకం
గిర్రున తిరిగితె
మాపటికొచ్చె
చందురుడు

ఏమీ లోకం
ఏమీ అందం
ఎంతచూసినా
తనివితీరదు

వంతపాడవోయ్
జగమంత చుట్టవోయ్

- 07/02/2015

వెన్నల్లో

నిన్న నడురాతిరి విరగాచిన పండువెన్నల్లో
నెరబూసిన ముద్దబంతిపువ్వుని చూశాను
నీ ముఖారవింద సోయగం మదిలో మెదిలింది
నా మనసు పాదరసంలా కరిగిపోయింది

గాలితెమ్మెర వింజామరములా
నా వైపు మెత్తగా వీస్తుంటే
అన్నీతెలిసిన జాబిలి
మౌనముగా చిరునవ్వులొలుకుతు
వెన్నెల వెదజల్లుతున్నవేళ
చెప్పడానికి మాటలు లేవు
చూపడానికి చేష్టలు లేవు
స్పందిచే మూగమనస్సు తప్ప

- 21/04/2015

ఏది రైతన్నా ఏది?

హలాన్నిపట్టి పొలాన్ని దున్నుతు
ప్రొద్దుపోయినా సద్దుమణగక
పాటుని సలిపే రైతన్నా
ఈ పూటకి బువ్వేది?

విత్తులు నాటి వానచినుకుకై
పంటమొలకకై అర్రులుచాచి
ఎంతో వేచే రైతన్నా
ఈ రాత్రికి నిద్రేది?

కంటిమీదన కునుకే లేక
దుక్కిదున్నిన పంటనమ్మితె
గిట్టుబాటు గాని రైతన్నా
నీ పాటుకి విలువేది?

అప్పుల ఊబిలో కూరుకుపోయి
ఆదుకొమ్మని వెర్రిగొంతుతో
విచ్చిచూసినా రైతన్నా
నీ మాటకి బదులేది?

ఈసడింపుల ఈదురుగాలిలో
అవమానాల మండుటెండలో
చావుబాటన రైతన్నా
నీ చావుకి పట్టింపేది?

- 15/02/2015

ఏమని చెప్పను

నీలితామరలనుబోలిన కన్నులదానా
దేనిని చూడమంటావు?
నీ కళ్ళనా?
అవి చూస్తున్నవాటినా?

నీ మందారసుందరవదనశోభని కన్నులార గాంచినప్పుడు
నీ మాటలు ముత్యాలై రాలిపోతుంటే ఒడిసి పట్టుకోలేకున్నాను
ఇంత పరధ్యానమేంటని కంటిసైగలతో నిలదీస్తే
ఏమని చెప్పేది?
సప్తవర్ణాలన్నీ కలబోతగా నీ ముఖాన మెరుస్తుంటే
అది నాకు వజ్రపుఖని లాగ కనిపిస్తున్నదని చెప్పనా

నీ ముఖకవళికల్లో నవరసాలు అమోఘరీతిన ఉట్టిపడుతుంటే
వాటిని మౌనంగా ఆశ్వాదిస్తూ నిశ్చేష్టతను పొందనాని చెప్పనా
ఏం మాట్లాడుతున్నావని ఎదురుప్రశ్న వేస్తే ఏమని బదులిచ్చేది?
భాషనే మర్చిపోతున్నాను
ఇంక భావాన్ని ఎలా వ్యక్తపరిచేది?

- 09/02/2015

రైతుగోడు

నేలను అమ్ముకున్నవాడు
జలతారు పానుపుల పైనెక్కి 

మహవిలాసంగా కులుకుతుంటే
నేలను నమ్ముకున్నవాడు మాత్రం బక్కచిక్కి 
అప్పులపాలై వీధినపడి అర్రులుచాస్తున్నడు

నేలను అమ్ముకున్నవాడు
బెంజికారులో తిరిగి రాజసాన్ని వెలగబెడుతుంటే

నేలను నమ్ముకున్నవాడు 
గంజికి గతిలేక పడరానిపాట్లతో అలమటిస్తున్నడు


అమ్మలాంటి నేలని విభజించి ఆటవెలదిగ నడివీధిలో అమ్ముతుంటే
మరి దక్కేది పెద్దమనిషనే గౌరవం
కన్నకూతురు లాగ కాచి రెక్కలుముక్కలుచేసి పంటలు పండిస్తే
రైతుకి దక్కేది బిచ్చగాడనే అవమానం

- 23/12/2014

అబల కాదు సబల

ఓయ్! ఎందుకేడుస్తున్నావ్ మరెందుకు దిగాలుగా వున్నావ్?
నువ్వేమి చేతకాని అబలవని పురుషాహంకరం రంకెలు వేస్తే
కుదేలైపొయి కుకించుకుపోయి మూలన కూర్చుని ఏడుస్తున్నవా?
జీవితంలో ఓడిపోయానని మనసులోనే వెక్కివెక్కి ఏడుస్తున్నవా నేస్తం
నిజానికి నువ్వోడిపోలేదు కాని నీ పిరికితనం నిన్ను ఓటమిపాలు చేసింది

లే! లేచి నీ లోని బేలతనాన్ని కడిగేసి
ఒక్కమారు అద్దంలో నిన్ను నువ్వు సరి చూసుకో

నీ మౌనంవల్ల ఏమి కోల్పోతున్నావో
ఏది కనుమరుగైపోతోందో తెలుసుకో

ఈ లోకంలో దొరికే ప్రేమ కోసం దేన్నైనా వదులుకోవచ్చు
కాని అస్తిత్వాన్ని మటుకు కాదు

లేచి నిలదొక్కుకొని నీలో నివురుగప్పిన నిప్పులాగ
నిద్రాణమైయున్న సబలను జాగృతం చెయ్

అచేతనావస్థనుండి బయటపడి
చెంగుచెంగుమని గంతులేసే లేడిపిల్ల లాగ పరుగులుపెట్టు

నువ్వు అబలవి కాదు సబల అని
దిక్కులు పెక్కటిలేలాగ ఘోషించి నిరూపించు

- 01/02/2015

వెన్నెలకై పుష్పవిలాపం

వెన్నెలో వెచ్చదనం కోసం 
వెతుకులాడే ఓ చెంగలువ పువ్వా 
ఎన్నాళ్ళు ఈ చలిపై ఎదుర్పు 
చంద్రదర్శనానికై ఇంకెన్నాళ్ళీ ఎదురుచూపు
నీపై మోజుపడ్డాడని రోహిణి అలకపానుపెక్కింది
ఆమెను బుజ్జగింజడంలో పడి కాలాన్నే మర్చిపోయాడు
నీకు ముఖం చాటేసి నభోవిధిలో తచ్చాడుతున్నాడు
మునుపు ఒక్క అమావాస్యకే సొమ్మసిల్లిపోయేదానవు
ఇప్పుడు పున్నమినాడు కూడా ఆతడు రాకపోయే
ఎంతగానో వేచి చూసి బాధాసర్పదష్టురాలివై
తాళలేక కన్నీరుమున్నీరలై విలపించి
కన్నీటిసరస్సులో మునిగిపోయావు

ఓ చందమామా! ఒక్కసారి ఆ సరస్సులోకి తొంగిచూడు
చెంగలువను కన్నీటిచెర నుండి విడిపించగ రా
వాడిన ఆమె ముఖాన్ని చూడు
అన్నికళలను కోల్పోయి విప్రలబ్ధ అయి విలపిస్తోంది
నీ కరుణనే వెన్నెలగా కాచి మంత్రముగ్ధగా మార్చవోయి
విలాపమును చాలింపజేసి విలాసానికి తెరదీయి

- 05/02/2015

కవిత

నా కలం నుండి జాలువారే ప్రతి అక్షరం
పొగడ్తల విరిజల్లులకో కీర్తిప్రతిష్టలహరివిల్లుకో కానేకాదు
అది గాయపడిన గుండెల కన్నీటిని తుడవడానికై సంధిచే ప్రేమబాణం

మనసు స్పందించినప్పుడు వెలువడే కవిత
చప్పట్ల కోలాహలంలో మునకలెత్తడానికి కానేకాదు

అది విధివిలాస వికృతక్రీడలో కోల్పోయిన ఆత్మస్థైర్యాన్నితిరిగి చూబెట్టే దిక్సూచి

- 01/02/2015

రాత

ఒకపక్క కఠినవాస్తవం 
మరోవైపు మృదుకల్పన 
వెరసి గుండెలను దొలిచేస్తు 
సాగుతున్న మనోసాగరమథనంలోంచి
ఒక్కొక్కటిగ వెలువడుతున్నవి
భావతరంగాలు
అవి ఉవ్వెత్తున ఎగసి
నా అంతరాత్మని తాకుతుంటే
మదిలోని అనాచ్ఛాదిత భావాలకు
మాటలవలువలు తొడుగుతు
అవే సిరాగా మార్చి
ఆర్ద్రతతో రాస్తున్నా
ఆలోచనలే చందస్సు
కాలమే తెల్లకాగితం
రాసేది ఎంతవరకో
ఈ కలం ఆగిపోయేది ఎప్పుడో
సిరా ఇంకిపోయినంత మాత్రాన
ఆలోచనలు ఆగవు
ఈ ఊపిరున్నంత వరుకు
నాలోని అంతర్మథనం ఆగదు

- 28/01/2015

సాగిపో

ఓ మనిషి!
ముందుకు సాగిపో

అర్థంలేని కట్టుబాట్లనే 
ఇరుకు సందుల్లోంచి
సదాచారమనే
స్వేచ్ఛామైదానానికి

మనసుల్లోని సంకుచిత భావాల
ముతక కంపు నుంచి
విశాలహృదయాలతో
గుభాళించే పువ్వలవనంలోకి

అహంకారం కమ్ముకుపోయిన
కటిక చీకటి నుండి
అందరికి సమాన ప్రేమను ప్రసరించే
ప్రజ్ఞాన సూర్యకాంతి వైపుకి

కడుదయనీయ నిట్టూర్పులతో
నిండిన అమావాస్య నుండి
ఆత్మవిశాసం అందించే
ప్రేమామృత పున్నమివెన్నెల్లోకి

పొడిమాటల ఇసుకపేటలు
కమ్మిన ఎడారుల్లోంచి
సత్యశోభిత వాక్కులతో
పరవళ్ళు తొక్కే జలప్రవాహంలోకి

ముందడుగు వేస్తు
కొత్తపుంతలు తొక్కుతు
కొనసాగిపో మానవా

- 29/01/2015

ఆడది

దేన్నైన్నా అంచనావేయచ్చు
ఆడదాని మనసుని తప్ప
కనుసైగలా వెంటనే బోధపడవు
ముఖకవళికలు మరి అర్ధంకావు
మాటల్లోనే ఎన్నో దాగుడుమూతలు
హావభావాలు అసలే మింగుడుపడవు
మనసులోని ఆలోచనలా అంతుబట్టవు
మౌనమైతే అంతుచిక్కని ప్రశ్నే
ఇంక ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోడమా
అమ్మో! నిక్కచ్చిగా బ్రహ్మతరం కాదు
మగాడికి అర్థంకాని బ్రహ్మపదార్థం ఆడది

- 29/01/2015

శిశిరరాగం

హేమంతమెళ్ళిపోయింది
వసంతమప్పుడేరానంటోంది
మంచుని దులిపేసి
చలితో కళ్ళాపి జల్లి
శిశిరం తిష్ఠవేసింది

చల్లగాలి కోసం కిటీకి బార్లా తెరిస్తే
గాలికంటే చలివీయడం మొదలైంది
చందమామకి జలుబు చేసిందో ఏమో
వెన్నెల కూడా వెచ్చదనం కోల్పోయింది
ఇంక సూరీడు సంగతి మరి చెప్పక్కరలేదు
మబ్బులకంబళి కప్పేసుకుని దాంకుంటాడు

ఆకులన్ని ఎప్పుడో రాల్చేసిన చెట్లు
శీతలగాలిని మౌనంగా భరిస్తున్నాయి
వాటిల్లో నాకు మూర్తిభవించిన స్త్రీత్వం
కంటికి కొట్టొచ్చినట్టు కనబడుతోంది
ఆకులన్ని రాలిపోయి వివస్త్రగా మారినా
వాటిలో సహనం మాత్రం చెక్కుచెదరలేదు
చెట్లకున్నది ఆడదానికుండే పట్టుదల
ప్రతికూల పరిస్థితుల్లో నిలదొక్కుకోవాలనే తపన
తీవ్రచలిని సైతం అతికష్టం మీద ఓర్చుకొని
మళ్ళీ వసంతం రాకపోదా? ఆనాడు శోభిల్లనా? అన్న ఆశ

ఇక ఈ శిశిరాన నా పరిస్థితేమో జయాపజయాల మేళవింపు
ప్రతి గెలుపు మరింత ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తే
ఓటమి మనలోని తప్పులను లోటుపాట్లను ఎత్తిచూపే గుణపాఠం
నా మనసులో మెదులుతున్నది వసంతానికై ఎదురుచూపు

- 26/01/2015

పడిలేచిన కెరటము

ఈ మోసపూరిత మహామాయాజాల ప్రపంచంలో పాతుకుపోయిన దుర్వ్యవస్థపై పోరుసలుపుతున్నాను 
మాటలనే తూటాలు గుండెల్లో చొచ్చుకెళ్ళి తూట్లుపొడుస్తున్నాయి...
కట్టుబాట్లనే సంకెళ్ళు జబ్బలను విరిచి కట్టిపడేసి వెనక్కిలాగుతున్నాయి...
స్వార్థపూరితములైన కొందరి పెద్దలతీర్మానాలు ముందరికాళ్ళకు బంధాలవుతున్నాయి...
ఒక్కొక్కటిగ కారుతున్న స్వేదబిందువులు మహాయుద్ధంలో నేలకొరిగే సైనికులని తలపిస్తున్నాయి...
అది బలక్షీణతాచిహ్నమేకాని బలహీనతకో, ఓటమికో కాదు

నా ముఖాన ఓపిక లేకున్నా ఓటమినైతే చవిచూడకూడదనే ప్రగాఢకాంక్ష ప్రస్ఫుటిస్తోంది...
అన్యాయాన్ని ఎదిరించే సత్తువ ఈ చేతుల్లో లేకున్నా,
దానికి పాదాక్రాంతుడనవ్వకూడనే కృతనిశ్చయసూచికలా ఉంది ఈ బిగించిన పిడికిలి...అవునిది ఉక్కుపిడికిలే...
అమ్మ ఎంతో లాలనగా నీతినిజాయతిలనే ఉగ్గుపాలుపోసి పెంచితే అతిసుతారంగా పెరిగిన ఈ చేయి,
నేటి సమాజాన్నేలుతున్న దౌర్జన్యపు కుట్ర, వివక్షత కుప్పకూలేంతవరకు పోరాడలంటే ఉక్కుపిడికిలిలాగ మారాల్సిందే

ఇదేదో క్షణికావేశంలో ఉవ్వెత్తున ఎగసిపడి అంతలోనే చటుక్కున్న పడిపొయే కెరటములాగ అనిపించవచ్చు
అదే అయితే...ఆశయభారాన్ని మోయలేక నేనెన్నోసార్లు కిందపడ్డాను...
పడిన ప్రతీసారి ఆశయనిబద్ధత, కృతనిశ్చయమనే పెడరెక్కలు మొలిచి తిరిగిలేస్తున్నాను...
అవును నేను పడిలేచిన కెరటాన్ని...ప్రళయమారుత ఝూంకారనాదాన్ని...


- 21/11/2014 

అల్లరిచేద్దాం రారండోయ్

తీరికలేని జీవితాన
విరామం తీసేసుకుని
ఉన్నందంత మరచిపోయి
ఉరకలు పెట్టే ఉత్సాహంతో
అల్లరిచేద్దాం రారండోయ్

అదిగో అదిగో కొత్తప్రపంచం
వినబడలేదా కోయిలమ్మ కుహుకుహులు
కనబడలేదా హరితవర్ణపతాక రెపరెపలు
అడుగులు వేద్దాం పరుగులుతీద్దాం
అల్లరిచేద్దాం రారండోయ్

కాలాన్నే మరి ఆపేద్దాం
స్నేహహస్తాన్నేచాపేద్దాం
కవ్వింపుల చిలిపిచేష్టలతో
నవ్వుల పువ్వలే పూయించేద్దాం
అల్లరిచేద్దాం రారండోయ్

ఎల్లలన్ని చెరిపేసి
ఐకమత్యాన్ని చాటేద్దాం
మనసులన్ని కలిపేస్తు
యుగళగీతమే పాడేసి
అల్లరిచేద్దాం రారండోయ్

కల్లాకపటం మోసం వేషం
లేని లోకాన విహరిస్తు
తలపుల బండిపై అలుపేలేక
మలుపులు తిరిగి
అల్లరిచేద్దాం రారండోయ్

మేఘాల మేడలెక్కి
రోదనలుండని రోదసిలోన
వేదనలేని వేకువ చూసి
చుక్కలతోనే చెలిమే చేస్తు
అల్లరిచేద్దాం రారండోయ్
మనం అల్లరిచేద్దాం రారండోయ్

- 03/01/2014