Saturday, February 7, 2015

మంచు

నేడు బద్ధకాన్ని విదిలించుకుని విజృంభించింది చలి
మంచుని చూస్తే జెర్మన్‌దళాలు పరినగరాన్ని వశంచేసుకుని
ఏకఛత్రాధిపత్య పాలన విధించినది గుర్తుకొస్తోంది 
ఇళ్ళు, రోడ్లు, పార్కులు, చెట్లు ఒకటేమిటి
దేన్ని వదలకుండా మంచుకంబళితో అమాంతం కప్పేసి
చలికాలం తన అధిపత్యాన్ని చాటుకుంది
పరినగర వైవిధ్యాన్ని మటుమాయం చేస్తు
అన్నిరంగలు తెలుపులో కలిసిపోయాయి
మంచుకురిపించే చలంటే సిసలైన నియంత
ప్రకృతిలోనేగాక మనుషుల్లోవున్న విభిన్నతలన్నీ
చలినియంతకున్న మంచుసేన ముందు మోకరిల్లాల్సిందే

ఏమో ఎవరికి తెలుసు చలంటే సామ్యవాది ఏమో
చూట్టూరావున్న అసమానతలన్ని రూపుమాపేసి
తెలుపుదే తుదిగెలుపని చాటిచెప్తోంది కాబోలు
మునుపటివరుకు కట్టేబట్టల్లో గొప్ప-పేద తేడా కనిపించినా
నేడు మంచుధాటికి అందరు నల్లకోట్లు కప్పుకొని సమానత్వాన్ని చూపాల్సిందే
ఆనాడు అగస్త్ బ్లాంకి ఈ మంచుసేనా విజయాన్ని చూసే
శ్రామికుల నియంతృత్వం అని నొక్కివక్కాణించాడేమో
ఈ నియంతృత్వధోరణిని షాల్ దె గాల్ లాగ ఎదిరిస్తు
జ్ఞాన నభాన మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు
అప్పటివరుకు మంచుసేనలతో స్వైరవిహారంచేస్తున్న
జెనెరాల్ చలి గారికి సాల్యూట్ కొట్టకతప్పదు

-2/1/2015

No comments:

Post a Comment