Saturday, February 7, 2015

నడక

వేకువనే లేచి ఆరుబయటకి వెళ్ళాను
మేడలు మిద్దెలు పాకలు దాటి
పొలాల వైపుకు పడుతున్నాయి అడుగులు
వరికుప్పల మధ్యలోంచి సాగుతోంది నడక
అది పంటల కోతకాలమనుకుంటా
దూరంగా అక్కడక్కడా వెలుతురు 
పొగమంచు ఇంకా వీడిపోలేదు

మన్మధుడు అయిదోబాణంతో కొట్టాడేమో
ప్రకృతంతా స్థంభించిపోయినట్లుంది
మెల్లగాలికి కొబ్బరిమట్టల కదలిక
కనిపించని చిమ్మెట్టల రొద 
నడిచేడప్పుడు చెప్పుల అలికిడి 
ఇవి తప్ప కనుచూపు మేరకి
చుట్టూరా నిశ్శబ్దం కమ్ముకుపోయింది

సన్నగా సద్దుచేస్తు తరలిపోతోంది కోరింగవాగు 
చూడబోతె ఆ వాగు పుడమితల్లికి పట్టుచీర లాగుంది
వాగుపైన చంద్రకాంతేమో ధగధగలాడే వెండి జరిఅంచు

నా నడకలో వేగం తగ్గింది
భయంతో మటుకు కాదు
ఏదో తెలియని పరవశం
నట్టింట్లో ఉన్నంత హాయి
చీకటి గొప్ప అందగత్తె 
ఆ అందం ఆశ్వాదించాలంటే
రెండు కళ్ళు చాలవు
మనసుతో చూడాలి

ఎంతసేపు గడించిందో తెలియలేదు
మబ్బులను చీల్చేస్తు తొలిపొద్దు వెలుగు 
దానికి వంతపాడుతూ పక్షుల కిలకిలలు
చీకటి చిన్నగా నవ్వి మరి సెలవు చెప్పింది
గుండెనెక్కడ పారెసుకున్నానో వెతుక్కుంటూ
దీనంగా ఇంటికి తిరుగుబాట పట్టాను
కాని మనసులో ఎక్కడో చిగురంత ఆశ
మాపటికి మళ్ళీ చీకటి కనువిందు చేస్తుందని

- కృష్ణచైతన్య (పరి,3/1/2015)

స్ఫూర్తి: కవిగురు రవీంద్రుని "సోనార్ తరి" కొంత చదవగానే ఆయన రాసిన విధానం, ప్రకృతిని అతితక్కువ పదాలతో కళ్లకు కట్టినట్ళు వర్ణించడం బాగా నచ్చింది. సోనార్ తరి శైలిలో సరళతెలుగులో రాయాలనిపించింది. మరి నేపథ్యం ఏది అనుకోగానే యానాం చుట్టూ పరిసర ప్రాంతలు మనసులో తళుక్కుమన్నాయి. గోదావరి, పచ్చని పంటపొలాలు, జాలరుల వేటపడవలు, కోరింగనది గుర్తుకొచ్చాయి. యానాం పాతవంతెనదాటి ఎడమవైపున ఇటుకబట్టిల గుండా అప్పుడప్పుడు నడిచి లేదా సైకిలు మీద వెళ్ళేవాడిని. అలా వెళ్తుంటే ఒక్కసారి అంతవరుకు ఉన్న ఊరిని వదిలి ప్రకృతిలోకంలోకి  అడుగుపెడుతున్నట్లు అనిపించేది. ఇక కాకినాడ నుండి యానం బస్సులో వెళ్ళేడప్పుడు పి.మల్లవరం దాటగానే ఒకపక్క పంటచేలు ఇంకోపక్క కోరింగ కనిపిస్తాయి. వీటిని ఊహిస్తు రాయడం జరిగింది. ఇది కవితా అంటే కచ్చితంగా చెప్పలేను కాని నా మనస్సులో వెల్లువలాగ జాలువారిన భావఝరి అంతే.

సూచన: మన్మధుడి ఆయుధం చెరుకువిల్లు. అతడు 5 పూలబాణాలతో ఒక్కో బాణంతో వంటిమీద ఒక్కోచోటన కొడతాడు. అలా కొట్టబడినప్పుడు బాణముబట్టి అవస్థ (స్పందిచే తీరు) మారుతుంది. చివరి బాణం నీలోత్పలము (నీలికలువ) మొత్తం శరిరాన్నే స్థంభింపజేస్తుంది. ఆ సంగతే పైన వర్ణనలో వాడబడింది.

No comments:

Post a Comment