Saturday, December 7, 2019

ఓ శాలెన్న

చేత మగ్గం మరోచేత దుఖము
పట్టి నేస్తవయ్యో శాలెన్న
నేసిన వస్త్రం కూడుబెట్టకుండే
చేసిన అప్పులు గంపెడై కూర్సుండే
కాసిన కండ్లు వాచిన చేతులు
కాసిన్ని రాళ్ళైన్న కూడబెట్టకుండె
నేతకష్టం నీ రాత మార్చకున్న
పుట్టిన రూణం తీర్చుకున్నవు
ధన్యజీవివు శాలెన్న
ధన్యజీవి నీవు శాలెన్న
నీవు కొలువైన పల్లెలు పట్నంగా మారేను
నీ నేత జిలుగులు సీమలకేగెను
సీమవీధుల్లో
దోరసాని మాటల్లో
ఏడజూసినా నీ నేత జిలుగులే
ఆ వెలుగుజిలుగుల చాటున
ఓ శాలెన్న
వెలిసి ముగిసిపోయే నీ పేదజీవితం

31/12/2015

స్ఫూర్తి: దక్షిణభారతంలో నేడు పెద్దపెద్ద పట్ణాలుగా, నగరాలుగా విరాజిల్లుతున్న ఎన్నో తీరనగరాలు మొట్టమొదట శాలీల చేనేత నైపుణ్యనికి కాణాచి అని ఒప్పుకోక తప్పదు. పుదుచ్చేరి, యానాం, చెన్నపట్నం, మచిలీపట్నం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. వలసపాలన చరిత్రన్ని పరికిస్తే ఒక పక్క చిన్న పల్లెటూర్లు పట్టణాలుగా ఎదుగుతుంటే మరోవైపు శాలీల స్థితిమాత్రం కడుదయనీయంగా మారిన తీరు ఎంతో ఆశ్చర్యాన్ని, బాధని కలిగించక మానదు. వారిని ఉద్దేసిన రాసినదే ఇది.
తెలుగులో శుద్ధవ్యవహారికాన్ని అమితంగా ఇష్టపడే నాకు వస్తది, ఉంటది, లేస్తది లాంటి యాసపదాలు విన్నప్పుడు చాల ఇబ్బంది అనిపించినప్పటికీ పోను పోను ఎదుటివారి భాషని, యాసని గౌరవించాలి అనే భావన బలంగా పాతుకుపోయింది. అదే నేను కల్పించి రాసాను. మన్నించగలరు.

No comments:

Post a Comment