Friday, January 30, 2015

సౌగంధవృక్ష విలాపము

ముందుమాట: నేను ఇంజినీరింగు చదివే రోజుల్లో మా కాలేజిలో ఆనందరంగపిళ్ళై రోడ్డుకి వారగా ఒక మంచివాసనగల పువ్వులచెట్టు (కాడమల్లె/ఆకాశమల్లె/Millingtonia hortensis) ఒకటి ఉండేది. ఎప్పుడు నేనలా వెళ్ళినా, ఆ చెట్టుని దాటుతుంటే సువాసనలతో ముక్కుపుటాలదిరిపోయి మనసుకి చాలా ఆహ్లాదంగా ఉండేది. ఒకసారి అక్కడ కిందపడ్డ పువ్వులని చూసినప్పుడు నా మనసులో మెదిలింది, "ఆమె పాదస్పర్శకు నోచుకోని పూవులు సైతం విలపిస్తున్నాయి" అని. పువ్వులు విలపిస్తున్నాయి సరే! అసలంటూ ఎప్పుడు చూడని, వినని ఆ "ఆమెని" వర్ణించడం ఎలాగ? అని ఆలోచించినప్పుడు బుర్రకి ఏమీ తోచలేదు. ఒక స్త్రీని ఎలా వర్ణించాలో కూడా అర్థంకాలేదు. అప్పట్లో మనకి ప్రేమ దోమా జాన్‌తా నయ్. నా ఏకైక లక్ష్యం "చదువు (+ నిద్ర + కంప్యూటర్ గేములు)".

గవర్నమెంటు కాలేజి అంటేనే ఇంక మనం క్లాసుకి వచ్చేది, రానిది, చదివేది, లేనిది ఎవ్వఢూ పట్టించుకోడు. దాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు నా లాంటివాళ్ళు. ఎప్పుడైనా క్లాసు బోరుకొట్టినప్పుడు, మొదటి బెంచిలో కూర్చున్నా కూడా జంకకుండా మంత్రాలు, శ్లోకాలు, కవితలు రాసేవాడిని. మొదటిబెంచంటే గుర్తుకొచ్చింది. ఒకసారి మా జయభారతి మేడం క్లాసు బోరుకొట్టి, తలెత్తకుండా ఏదో రాస్తుంటే, ఆవిడ నన్ను చూసి, "ఇంత సీరియస్‌గా చైతన్య ఏం రాస్తున్నాడు?" అని నా జాన్‌జిగిరిదోస్త్ సందీప్‌ని అడిగితే, "ఏవో మంత్రాలు, శ్లోకాలు రాస్తున్నాడు మేడం" అని వాడు చెప్పినప్పుడు, చూడాలి ఆవిడ మొహంలో కొట్టొచ్చిన భయానక రసం. ఇంక ఏమి అనలేక "ఓకె ఓకె యూ కంటిన్యు" అని, తిరిగి క్లాసు చెప్పడం మొదలెట్టినప్పుడు నవ్వాగలేదు మా ఇద్దరికి.

సరె సరె...'ఆమె', 'పువ్వులు', 'విలాపం' అంటు ఏదో మొదలుపెట్టాను కదా. క్లాసులో కూర్చుని, "ఆమె" మీద రాయడానికి మనసొప్పక కృష్ణుడికి ఆ భావన ఆపాదించి అప్పట్లో ఒక కవిత రాసాను. ఎందుకో "ఆమె" మీద రాయడం అప్పుడు తప్పనిపించింది. ఇన్నాళ్ళకిన్నేళ్ళకి పరవాలేదు అనిపించి, ఒకవేళ రాసిన నా కృష్ణుడు తప్పుబట్టడనే భరోసాతో రాసిన కవిత ఇది.

ఆగండాగండి...పైన చదువు పక్కన బ్రాకెట్టులో ఇంకోటి చేర్చడం మర్చిపోయాను, అదె "పంజాబిదాబా". నాకు పనీర్ రుచి చూబెట్టి, దాదాపు ప్రతిరోజు వెళ్ళి తినేలాగచేసిన పంజాబిదాబాని ఎలా మర్చిపోతాను. పాపం, వెళ్ళిన ప్రతిసారి వెజిటేరీన్ డిష్షులు మాత్రమే ఆర్డరు చేస్తుంటే మా సర్దారుగారు ఫీలైపోయి ఒకరోజు అనేసాడు కూడా, "మా దాబాకొచ్చి కేవలం వెజిటేరీన్ తింటున్నావంటే అసలు జీవితంలో ఎన్.వి  తినుండవు" అని. ఎంతైనా 'నా మనసు దోచేసిన పనీరుండగా ఎన్.వి ఎందుకు దండగ' అని మనసులో అనిపించి, ఇంకేమి మాట్లడక నవ్వేసి ఊరుకునేవాడ్ని. అదండి ఈ కవితాస్ఫురణకి వెనకున్న చాంతాడులాంటి స్టోరి. ఇంతపెద్దగా ఎందుకు రాసాను అంటారా. హుం...ఒకవేళ కవిత బాలేకపోయినా కనీసం ముందుమాటైన బాగానే ఉంది అనిపించుకోడానికి. అర్థమైంది కదా, సరె ఇక ఆలస్యం చేయకుండా కవిత చదివేయండి.

మనవికొన్ని పదాలకి అర్థం కిందన ఇవ్వబడింది.


అక్కడ కిందపడినవి ఆ సౌగంధవృక్షపు సుగంధకుసుమాలు
నేనటు పోతు ఆ తరువుపై మరులుగొని దాని కడకు పోతిని
హతవిధి! పరిమళాలు వెదజల్లే చెట్టు ఎందుకో పరితపిస్తోంది
ఏమిటో ఈ వింత తెలుసుకుందామనిపించి కుతూహలపడ్డాను
"చెంతచేరగానే కన్నులరమోడ్పులై మనసు ఆహ్లాదమొందువేళ
ఈ అతివిచార దీనావస్థకు అసలు కారణమేమిటి" అని అడగగా

ఆ చెట్టు నాతో అన్నది

"ఇంతకు మునుపు ఒక దేవకాంత ఇటువైపున ఈ దారినే నడచివెడలె
ఆమె పాదస్పర్శకు నోచుకోని పూవులు సైతం ఎంతగానో విలపించె
కోమలపాదాల కింద తొక్కబడ్డ కుసుమాలకు మరుజన్మలేదనిపించె
కాంచనమేని సొగసులు గని సూర్యుడు మబ్బుల మాటున దాగిపోయె
మధురశ్రావ్యకంఠ జిలుగుని అనుకరింపలేక మత్తకోకిల మూగవోయె
నడకల హొయలు చూసి బ్రహ్మకి అలనాటి రాయంచలు గురుతుకొచ్చె
వాలుగంటి చూపులకు తామరలు సిగ్గుపడి డస్సి ముడుచుకొనిపోయె
నెన్నడుము వంక వయ్యారానికి వానవిల్లు భంగపడి కనుమరుగాయె
చారుదరహాసాన్ని సరిపోల్చుటకు ప్రకృతినంతటా మరి పోలికే లేకపోయె
నవ్వినప్పుడామె పలువరుస మేలిమి ముత్యాలదండను పోలియుండె
చెమ్మోవికి సరితూగు పలుకెంపులు ఇలగర్భాన కూడ దొరకవనిపించె
ముక్కుతీరు మరి చెప్పనలవిగాదు చెక్కినది జక్కనో లేక విశ్వకర్మనో
రాకేందుముఖి అని నే తలచిన నిండుచంద్రుడే చాల గర్వించి సంతసించె
ఆమె అంతకంతకు దూరమై తుదకు కనుమరుగయ్యాక  ఉన్నట్లుండి
ఉక్కిరిబిక్కిరైనప్పుడు తెలిసినది ఆమెని చూస్తు శ్వాసనే మరచితినని
కాలమైన తిరిగివచ్చునేమోగాని ఆమె రాదని తెలిసి విలపిస్తున్నాను"

అని తెలుపగా ఆ చెట్టునొక మారు ఔదార్యంతో తడిమి భారముగా నిట్టూర్చి
ఆమెని చూసుంటే నా గతేమి గాను బ్రతుకు జీవుడా అని ఊపిరిపీల్చుకొని
వెనుదిరిగి చూసిన ఎక్కడ నా కంట పడునోయని వెరసి వడివడి అడుగులతో ఇల్లు చేరితిని

- కృష్ణచైతన్య (పరి, 24/12/2014)

అర్థ సూచిక: తరువు=tree, చెట్టు; మరులుగొను=get fascinated, మోహించి; అరమోడ్పులు=half closed, సగం మూతబడిన; రాయంచ=swan, రాజహంస;  జిలుగు=fineness, మెత్తనితనము; వాలుగంటి=bright-eyed woman, అందమైన కళ్ళు కలిగిన స్త్రీ; డస్సి=to get exhausted, అలసిపోయి;  నెన్నడుము=slender waist, సన్నటి నడుము; పలువరుస=string of teeth,పళ్ళ వరుస; పలుకెంపు=noble ruby, మేలిమి రకమైన కెంపు; చెమ్మోవి=red lips, ఎర్రటి పెదవులు; రాకేందుముఖి=Face like a full moon, పున్నమిచంద్రుడిలాంటి ముఖముగలది.

సాగిపో

ఓ మనిషి!
ముందుకు సాగిపో

అర్థంలేని కట్టుబాట్లనే 
ఇరుకు సందుల్లోంచి
సదాచారమనే
స్వేచ్ఛామైదానానికి

మనసుల్లోని సంకుచిత భావాల
ముతక కంపు నుంచి
విశాలహృదయాలతో
గుభాళించే పువ్వలవనంలోకి

అహంకారం కమ్ముకుపోయిన
కటిక చీకటి నుండి
అందరికి సమాన ప్రేమను ప్రసరించే
ప్రజ్ఞాన సూర్యకాంతి వైపుకి

కడుదయనీయ నిట్టూర్పులతో
నిండిన అమావాస్య నుండి
ఆత్మవిశాసం అందించే
ప్రేమామృత పున్నమివెన్నెల్లోకి

పొడిమాటల ఇసుకపేటలు
కమ్మిన ఎడారుల్లోంచి
సత్యశోభిత వాక్కులతో
పరవళ్ళు తొక్కే జలప్రవాహంలోకి

ముందడుగు వేస్తు
కొత్తపుంతలు తొక్కుతు
కొనసాగిపో మానవా

- 29/01/2015

రాత

ఒకపక్క కఠినవాస్తవం 
మరోవైపు మృదుకల్పన 
వెరసి గుండెలను దొలిచేస్తు 
సాగుతున్న మనోసాగరమథనంలోంచి
ఒక్కొక్కటిగ వెలువడుతున్నవి
భావతరంగాలు
అవి ఉత్తుంగములై
నా అంతరాత్మని తాకుతుంటే
మదిలోని అనాచ్ఛాదిత భావాలకు
మాటలవలువలు తొడుగుతు
అవే సిరాగా మార్చి
ఆర్ద్రతతో రాస్తున్నా
ఆలోచనలే చందస్సు
కాలమే తెల్లకాగితం
రాసేది ఎంతవరకో
ఈ కలం ఆగిపోయేది ఎప్పుడో
సిరా ఇంకిపోయినంత మాత్రాన
ఆలోచనలు ఆగవు
ఈ ఊపిరున్నంత వరుకు
నాలోని అంతర్మథనం ఆగదు

- 28/01/2015

సమర శంఖారావం

సంఘంలో జరిగినవన్నీ గమనిస్తూ, కళ్ళూ చెవులూ పనిచేస్తున్నా
నిపించనట్లు వినిపించట్లు ఉండే ఓ కవీ! నీ హృదయం మాత్రం కరగడం లేదు

కాయకష్టము చేసినా కడుపుమంట చల్లారడం లేదు
ఆర్తనాదాలు వెలువడుతున్నా ఆదుకునే వారే లేరు
రెక్కలు ముక్కలు చేసుకున్నా డొక్కలెండిపొతున్నా
ఓ కవీ! నీ హృదయం మాత్రం కరగడం లేదు

శ్రమదోపిడియే ఆదాయం మధ్యవర్తుల సముదాయం
ధనదాహం అధికారమోహం అసంబద్ధ ప్రలాపం
బీడువారిన బ్రతుకుల స్థితి మరింత హీనమవుతున్నా
ఓ కవీ! నీ హృదయం మాత్రం కరగడం లేదు

కులమతాల వైషమ్యం వ్యక్తి వ్యక్తికీ మధ్య అగాధం
మతం మత్తులో మొరగడం ఆమాయక ప్రజలను కరవడం
ఇవన్నీ పసి హృదయాలను పాషాణాలుగా మారుస్తున్నా
ఓ కవీ! నీ హృదయం మాత్రం కరగడం లేదు

ప్రాంతాభిమానం భాషాభిమానం వికృత దిశలో పయనిస్తుంటే
విదేశీ వ్యామొహ విషమ జ్వాలలు హాహాకారాలు చేస్తుంటే
ఇవన్నీ ప్రగతి పథంలో పయనించాలనుకున్నవారి గుండెల్లో తూటాలై పొడుస్తున్నా
ఓ కవీ! నీ హృదయం మాత్రం కరగడం లేదు

ఈ భయంకర కల్లోల హాలాహలాల మధ్య ఒక అసంకల్పిత ఆశాకిరణం వెలువడింది…

ఆదే...
         సమర శంఖారావం... సంగ్రామనికి సంరంభం...
         విజయమే దాని లక్ష్యం... విప్లవమే దాని ధ్యేయం...

- 05/07/2006

అంతర్ముఖం

నాలో నేను ఆలోచనలలో మునిగిపోతున్నాను
నాతో నేను నిరంతరం సంఘర్షిస్తున్నాను
నాకు తెలియని నేనుకై వెదుకులాడుతున్నాను
నాకెరుకపడుతున్న నేనుని చూసి సంభ్రమపడుతున్నాను

ఆలోచనలనే వరద ప్రవాహంలో
నా అహం వడులు తిరుగుతు కొట్టుకుపోతోంది
బయటి ప్రపంచపు చెలియలికట్టని దాటి
అంతర్ముఖంగా సాగుతోంది నా పయనం
జనాలను అర్థంచేసుకోవడం కన్నా
నన్ను నేను తెలుసుకోడం భగీరథయత్నమే
నాపై నేను సలిపే భీకరపోరులో గెలుపొందితే
ఈ లోకాన్ని సగం గెలిచేసినట్టే
ఒకవేళ నేను ఓడిపోతే
మరెన్ని గెలుపు శిఖరాలను అధిరోహించినా ఇక వ్యర్థమే
పట్టు వదిలిపెట్టడం కన్నా
ఎంతమేరకు పట్టుకోవాలో తెలుసుకోడం గెలుపుకి తొలిచిహ్నం

- 23/01/2015

ఆడదాని మనసు నెమలిపురి

ఆడదాని మనసు 
అచ్చంగా నెమలిపురి 

సంకుచిత గోడల నడుమ బంధిస్తే 
అప్పుడామె అశోకవనంలో సీత

కఠినదూషణాల కారుయెండ ధాటికి
ఆమె హృదయం వాడిపోయే కుసుమం

పురుషాహంకారవిల్లునుండి సంధించే ఆజ్ఞల శరపరంపరలు 
ఆమె అణుకువ రూపంలో విజయాన్ని తెచ్చిపెడతాయనుకుంటే పొరబాటే
నిజానికి అణిగిపోయేది ఆమె అస్తిత్వం, పగిలిపోయేది గాజుగుండె

ప్రేమామృతధారావర్షాన్ని కుంభవృష్టిలా కురిపించి చూడు 
అప్పుడామె కారువానకి పులకించి పురివిప్పి ఆడే నెమలి

ఆ వానలో నీ కళ్లలో పేరుకుపోయిన అహంకార పొరలు తొలగిపోతె 
భావోద్దీపితానందంలో పురివిప్పి నాట్యంచేసే నెమలిలాగనిపిస్తుంది ఆడది
వికసిత భామాకలాప సౌందర్యాన్ని చవిచూడనివాడు మర్త్యుడె

- 02/02/2015

సూచన: కలాపము అంటే చాలా అర్థాలున్నాయి. అందులో నెమలిపురి అని ఒక అర్థము (మహాభారతంలో అలాగ వాడబడింది). వికసిత భామాకలాపము అన్నచోట నెమలిపురి లాగనే ఆడదాని మనసు వికాసమొందినప్పుడు కనబడే అందము అని నా భావన. అని నా భావన.

ప్రాముఖ్యత

ఒక గొప్పతీర్మానం చేసిన తర్వాత సూర్యోదయం
ప్రియురాలి రాకకై ఎదురుచూసినప్పుడు వెన్నెల
జవరాలి కనుసైగలబాసలు అర్ధమైనప్పుడు భాష
ఆర్ద్రతతో గుండె స్పందించినప్పుడు కన్నీటి చెమ్మ
పని తర్వాత వొళ్ళలిసినప్పుడు పట్టే గాఢనిద్ర
కష్టపడి తెగించి పోరాడి సాధించిన ఘనవిజయం 
గుంపులో ఆ ఒక్కరు లేనప్పుడనిపించే ఒంతరితనం
వీటి ప్రాముఖ్యత అనుభవిస్తేనే గాని తెలిదు

- 1/1/2015

చలి

చలంటే
కారుచీకటికి చాలాపెద్ద నేస్తం
ఎముకలు కొరికేసే అదృశ్య మృగం
వంటిని గజగజ వణికించే భూకంపం
కరడుగట్టిన నిర్దయకు ప్రతిరూపం
మనుగడకై చప్పుడులేని పోరుకి నిదర్శనం
నియంతృత్వ పోకడకి నిలువెత్తు అద్దం
మరణం తర్వాత స్థితికి మారురూపం

- 30/12/2014

స్పూర్తిమొన్న రాత్రి బస్సుప్రయాణమప్పుడు మైనస్ 5 ఉష్ణోగ్రతలో బయటకి కాఫి కోసం వచ్చినప్పుడు కలిగిన చిన్నభావన.

పుట్టేది ఎప్పుడో గిట్టేది ఎక్కడో

పట్టించకు చెడుని ఎన్నటికి
పెట్టుకొ మంచిని ఎల్లవేళలా

పట్టువిడువక పోరాటము సల్పి చే
పట్టు ఘనకార్యములెన్నో భీతినొందక

తుట్టతుదని ఎవడు చుశాడు గనుక
మట్టిగలవక మునుపే మార్పు తెచ్చుకో

బెట్టుచేయక గట్టిమేల్ తలపెట్టవోయ్
మెట్టునెక్కి కడన ముక్తినొందవోయ్

- 30/12/2014

నీతి సౌదామిని

కడలిలో ఉవ్వెతునెగసిపడే అలలు
చెలియలికట్టను దాటిన ప్రళయము

ఓరిమి ఆణకువగల ఆడది పట్టలేక
తెగించి నిలిచిన అదే నీ పతనము

కూటికోసం పాట్లుపడే శ్రామికుడు
పిడికిలెత్తి తిరుగబడితే విప్లవము

ఇంతేనా ఈ జీవితమని నీరసించే కన్నా
మరోకోణాన్ని వెదికిపట్టడమే విజయము

-21/12/2014

మల్లెల విరిజల్లులవి

మల్లెల విరిజల్లులవి 
వెన్నెల కురిసెవేళది

కన్నులకింపైన సుర
కాంతులీనుతున్నది

వన్నెలచిన్నెలతో మేని
పులకరించుచున్నది

చిన్నదాని సవ్వడికై 
చెవులు రిక్కరించెనె

- 11/12/2014

నేల

నేలను వెలకట్టి అమ్మితె ముట్టును పలుకుబడి
నాగలి చేపట్టి దుక్కిదున్నితే ఉండబోదు కనుబడి

నేలను పంచి పాటపాడితె గౌరవమర్యాదల పన్నీటిజల్లు
నేలను మొక్కి విత్తునాటితే అవమానాలతో కన్నీరు పొర్లు 

నేలను వెలదిగా లెక్కగడితే పడగలెత్తిన కోటిశ్వరుడు
నేలను కన్నబిడ్డలాగ చూసుకుంటే దరిద్ర దామోదరుడు 

కంటిమీదకునుకులేకుండా పోలాన కాపుగాచేవాడు కర్షకుడు
కన్నుమిన్నుకానక కూడబెడుతు గుర్రుపెట్టేవాడు స్థిరాస్తి వ్యాపారి 

నేలను అమ్మకం పెడితె అది ఎంతగానో లాభసాటి
పండినపంటకు మద్దతుధర గిట్టకపోవడం పరిపాటి

డబ్బు వెదజల్లితే ఎంతటి అందాన్నైనా కొనగలము
వ్యక్తిత్వమున్న ఆడదాని గుండెలో చోటుని కాదు

లాభనష్టాల బేరిజువేసి చౌకగ ఎలాంటి నేలనైనా కొనగలము
కాని ప్రేమ, శ్రమ, కాలం వెచ్చిస్తేగాని పంటని పండించలేము

కలకంట చిరునవ్వు ఒక ఇంటికి సిరి
అన్నదాత ముఖాన వెలుగు జాతికి సిరి

- కృష్ణచైతన్య (పరి, 23/12/2014)

స్ఫూర్తికొన్నేళ్ళ క్రితం ఒకనాడు కాకినాడ నుండి యానానికి కారులో వెళుతుంటే, తెలిసినవాళ్ళ మధ్య జరిగిన సంభాషణకి, "రైతు అంటే ఇంత చులకనా" అని మనసు చివుక్కుమని నాలో మెదిలిన స్ఫురణ ఇది.

కనుబడి=Prospect,ఉత్పత్తి; గిట్టుబాటు=to be acceptable (ఏదైనా బేరమాడినప్పుడు "గిట్టదు", "గిడుతుంది", అనేవి ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా వాడబడే పదాలు)

కావేటి ఘోష

కావేరి నదివోలె రక్తము పారే తమిళులను
ఎలాంటి ఇనుపసంకెళ్ళు కట్టిపడేయలేవు

కాని నేడు కావేటిలో ప్రవహిస్తున్నది ఉత్తనీరు కాదు
తల్లడిల్లిన తమిళరైతుల కళ్ళవెంబడి కారే రక్తకన్నీరు

వినబడుతున్నది గలగల పారుతున్న నదీతరంగధ్వనులు కాదు
ద్రావిడ వ్యవసాయిదారుల ఆక్రందనలు ఆర్తనాదాలు పెడబొబ్బలు

నేడు కావేరి తమిళనాటగాక రైతుల కళ్ళలో కన్నీరై ప్రవహిస్తోంది
పైరుపంటలు బీడువారినట్లే వాళ్ళ గుండెలు ఎండిపోతున్నాయి

పుడమితల్లి గుండెల్లోంచి పాలలాగ ఉబికి మానవాళికి లభ్యమయ్యేవి నదీజలాలు
దాహంతో గొంతు పిడచగట్టినా ఆకలితో మలమలమాడి కేకలుపెట్టిన పట్టింపే లేదో

మనుషులకి లేని జాలి వరుణుడికి కలిగి ఆయన కరుణ వానలాగ కురిస్తే
రైతు బుగ్గలమీద కన్నీరైనా ఆరకముందే నేల తడిసితడవక ఎండిపోతోంది

నాడు కళలతో శోభాయమానముగా వెలుగొందిన తమిళనాడు
నేడు కాంతివిహీనమై దాహార్తిచే బేలతనంతో అలమటిస్తోంది

శ్రీరంగనాథా నిద్రను వీడి కావేటిరాయుడవై తిరిగి జలకాలాడు
వరదరాజా వరదలాగ ఉప్పోంగెడి కావేరిని మరల ప్రసాదించు
అరుణగిరినాథా గంగను విడువనక్కరలేదు గాని గోడు పట్టించుకో
ఆరుమోములదేవా కావేటినందించి తమిళవేలుపనిపించుకో

-17/12/2014

సత్యమద్వైతం

సర్వప్రాణులయందు ఆత్మ ఇమిడియున్నది అన్నది పరమసత్యం. ఈ దేహం అశాశ్వతమైనది. కాని నా ఈ దేహంలో ఎక్కడో మారుమూలన మహోన్నత దివ్యత్వం దాగి ఉన్నది. పరబ్రహ్మమునకు అభేదం అయినట్టీ ఈ దివ్యత్వమును నేను అనుభవపూర్వకముగా తెలుసుకోగలిగినప్పుడు నాదేహం నశిస్తుంది. కాని...

అప్పుడు మిగిలియున్న ఆ దివ్యత్వపుస్థితిని గూర్చి ఒక్కసారి అలోచన చేసిన, అదే మిగులుతోంది తప్ప నేను అన్నదానికి అస్థిత్వమే లేకుండా పోతోంది. అసలు నేను లేను అంతా అదే ఆ దివ్యత్వమే.

అహా మాయ ఎంత కపటమైనది. ఏ వికారంలేని ఆ ఆత్మకు "అహం" అనే ఆకారాన్నిజోడించి కల్పనతో కూడిన భవసాగరమందు యదార్థముగా అది విలపించునట్లు చేస్తున్నది.

నీవు లేదు నేను లేదు. అంతా ఒక్కటే దివ్యత్వం అదే ఆత్మ. అది ఎన్నిగా కనిపించినా అది ఏకమే. "సత్యమద్వైతం" అన్నది పరమసత్యం.

(Spring 2004)

బాల్య పునఃస్మరణ

బాల్యమనేది
ఎన్నటికి చెరిగిపోని కల
చెరపలేని స్వానుభూతి
మరింక తిరిగిరాని కాలం
మరలచేయలేని మజిలి

బాల్యమంటే
ఎన్నెన్నో తిపిగుర్తులు
మరెన్నో చేదు అనుభవాలు

బడిలో శ్రీశ్రీ శైశవగీతి విని మది ఉరకలెత్తి పరవశించి అటుపిమ్మట
నా బాల్యం ముగిసిపొయిందని వెక్కివెక్కి ఏడ్చినప్పుడు
"జీవితమంటే అంతేనోయ్" అని తెలుగుమాష్టారి ఓదార్పు

చాలామంది
బాల్యాన్ని అభినందిస్తారు
కౌమారాన్ని ఆహ్వానిస్తారు
యౌవ్వనాన్ని ఆరాధిస్తారు
వార్ధక్యాన్ని ఆక్రోశిస్తారు

నాకైతే యవ్వనకౌమరాల కన్నా బాల్యమే తెగనచ్చింది
బాల్యాన అమాయకత్వమొక వరం
ఆపరాధమంటే ఎంటో తెలీదు కనుక

గోలోకవృందావనంలో నివసించే అర్హతే నాకు ఆ దేవదేవుడు కల్పిస్తే
ఎల్లప్పటికి నను బాలకునిగానే ఉంచమని మనసారా వేడుకుంటాను

నాకు స్త్రీ సాంగత్యవిలాసమొద్దు, స్వియసముపార్జిత ఆర్థికస్వాలంబనమొద్దు
ప్రేమని కలగలిపి గోరుముద్దలు అమ్మపెడుతుంటే కలిగే అవాంగ్మయగోచరానందం చాలును
అమ్మవొడిలో జోలపాటకి ఆదమరచి హాయిగ నిదురోయినప్పుడు కలిగె చిత్తస్వాంతన చాలును
నాన్న చెప్పె పౌరాణిక జానపదేతిహాస కథలు అత్యుత్సాహంతో వింటే కలిగే ఉత్ప్రేక్ష చాలును
చెల్లాయితో ఆటలాడుతు నవ్విస్తు కవ్విస్తు మురిపిస్తు మరిపిస్తు చేసే చిలిపిచేష్టలు చాలును
మరలా మరొక్క దినము బాల్యాన్ని తిరిగి పొందగలనంటే వందేళ్ళ వృద్ధాప్యానికి నేను సిద్ధమే

- 17/12/2014

కల-వాస్తవం

కలలు కనమనని ఓ పెద్దాయన హితబోధ చేశాడు

వినడానికి చాలా బాగుంది

కాని ఎత్తైన కలలు కనడమే నేరమని సమాజం కట్టుబాటు
ఆ కలలసౌధాల ఎత్తుని కొలవడం తప్పు అని దాని తీర్మానం

కన్నవి వెలపొడుగు కలలని చౌక కాదని తెలిసి గుండె క్రుంగిపోయి
నెత్తిమీద పావలాపెడితె దమ్మిడికి కొరగావనె వెక్కిరింపుల నడుమ
బ్రతుకులోని అతికఱకుదనానికి చిన్నారి చిట్టిగుండె తట్టుకోలేక
మనస్సులోనే ఊహలమేడలు, గాలికోటలు కట్టుకోవాలనిపిస్తుంది

జీవితమె భరించలేని దినసరి పీడకలలాగనిపించి
నిజముకాదు కల్లని తెలిసినా ఊహలకోనేటిలోకి మనస్సు దూకి ఈతకొడదామనిపిస్తుంది

ఆశ అనే ఉలితో ఊహలనే మట్టితో గుండెలో చెక్కుకున్న కలలశిల్పాలు వాస్తవాలనే అలల తాకిడికి చెదిరిపోయినప్పుడు
ఆశనుగాక ఆశయమనె ఉలిని చేబట్టి మట్టినిగాక బ్రతుకులాగనె కఱకుగావున్న బండరాతిని చెక్కి నునుపుచేయాలి
అప్పుడు ఎన్ని అలలు తాకిన చెక్కుచెదరక నిలబడుతుంది

ప్రస్తుతమనే నిప్పులకుంపటిలో కలల బొగ్గురాళ్ళు పడేసి కాల్చినప్పుడు
కొన్ని కలలు మలమలమాడి కనుమరుగవుతాయి
మరికొన్ని కణకణమండే నిప్పుకణికల్లాగ మెరుస్తు వేడిని పుట్టిస్తాయి
అజ్ఞామనే చీకటి సమసి మదిని కలతపెట్టే పొగ తొలగిపోతుంది

కలలు కనడమెంత ముఖ్యమో
వాటిని సాకారంచేసే సాధనాలను తెలుసుకోడమంతే ముఖ్యం
అప్పుడే కలలు నిజరూపం దాల్చడం తథ్యం
ఇది వాస్తవము

- 15/12/2014


సూచన: వెలపొడుగు = ఎక్కువ ఖరీదైన,  costly

భావగరిమ - నాట్యపటిమ

ప్రస్ఫుట భావప్రకటన అనేది ఒక అమోఘమైన కళ
అదో నవరసభరిత సుగంధతైలాన్ని అందిచెడి వకుళ

నాట్యరూపాన నవరసాలని కలగలిపి చక్కగ చూపడమే షడ్రుచుల మధురవిందు 
అందులోని భావార్థములను నిండుగ ఆశ్వాదించడమే కళారసికులకెంతో పసందు

మందగజమునకు, తేజికాశ్వమునకు ధీటుగా కదలాడే అందెలు చేయు రవళి
చారువదనాన వెలుగొందే భావఝరి ఇక సప్తస్వరసమ్మిళిత కమ్మని జావళి

నాట్యమంటే కదలాడే అద్భుత కళాఖండము వలె రంజిల్లి వ్యక్తపరచబడే భావగరిమ
వివిధభంగిమలతో చూపరులను ముగ్ధులనుచేసి కనువిందుచేయడమే నాట్యపటిమ

- 16/12/2014

తేనియలు చిందేటి పలుకులవి నీవే

తేనియలు చిందేటి పలుకులవి నీవే
పలుకగ రారా కృష్ణయ్య
నువ్వు
పలుకగ రారా కన్నయ్య
పదములెన్నో పలుకగ జాగేల
పిలిచిన పలికెదనంటివి గదరా 
పిలుపులేక నే మరి తాళజాలను 
ననుబ్రోవర తండ్రి ననుబ్రోవర కృష్ణా

- 12/12/2014

నందా భజే ముకుందా భజే

నందా భజే ముకుందా భజే
గోవిందగానము సేయవే మనసా
నందగోపాలుని మననము సేయవే
బృందావనవిహారి యమునాసంచారి
కృష్ణలీల గనవే కనులార నిండుగ

- 12/12/2014

ఒక హృదయం పిలిచినదే

ఒక హృదయం పిలిచినదే...
ఓ మనసా!!!
వినలేవా ఆ మౌనరాగం...
కనలేవా ఆ మూగభాష్యం....
అనగలవా ఈ జీవితం ఆశానిపాతం...
అదిగదిగో సుదూరాన వెలిగే ఉషఃకిరణం...
సాగించు నీ పయనం...
ముగింపు ఏమిటో ఎక్కడో...
అంతా ఆ విధాత నిర్ణయం...

- 29/01/2011

కలడో లేడోయని సంశయమేలకో...

కలడో లేడోయని సంశయమేలకో
కలుములనెలతకు పెనిమిటైనవాని 
ఉనికిని బట్టుటకు ఎన్నెన్ని అగచాట్లో
నమ్మినమదిలో నెలకొనిలేడా తమ్మికంటి
వెరవక వేయిపేర్ల కొనియాడవే ఓ మనసా!

- 23/10/2014

కృష్ణా నీకిది తగునా

కృష్ణా నువ్వు దేవదేవుడవు దేవాంతకుడవు నీ తెలివి మాకెక్కడిది చెప్పు 
అదను చూసి కాళ్ళుపట్టగలవు ఆదమరచి నిద్రపోతు కాళ్ళుపట్టించుకోగలవు

భారతనారి కంటతడిపెడుతుంటే నీకు కినుకరాక కునుకేలన వస్తోంది స్వామి
సత్యభామతో నీ క్రీడలు సరె కాని ఆడవారి జీవితాలని ఛిద్రంచేసే మగాళ్ళమాటేమిటి

ఫలంపుష్పం అదీలేకపోతే పత్రంతోయమన్న దీనదయాళువగు ఆపద్బాంధవుడవే
మానసక్షోభిత బాధాతప్త అశ్రువదనంతో ఆడది మొరపెడుతుంటే ఆలకించవా తండ్రి

పాపులయెడబూను కరుణమెండని పలికిన కరుణారసవిగ్రహమూర్తివి
పాపమెరుగని పసిబాలికలను వయసుడిగిన ముసలి అవ్వను సైతం
వదిలిపెట్టక అతిహీనంగా కొందరు చెలగాటమాడితే నీ రాతిగుండె కరగదా

బహుశా తులాభారమప్పుడు తులసిదళంగాక భారతనారి కన్నీటిబొట్టు పడినట్లైతే నీకెరుకపడేదేమో

- 17/11/2014

బాధ-ప్రేమ

ఏమిటి బాధ అంటే? 
మనం పడేదా లేక మనం పెట్టేదా?

బాధతో గుండె బరువెక్కి అథఃపాతాళ లోతులలోకి కూరుకుపోయినా
ఆఘమేఘాలపై తేలుతున్నట్టు తలపించగల శక్తి స్వచ్చమైన ప్రేమకుంది 

జీవితమే ఒక ఏడారిలాగ గోచరించి, ఇంతేనా ఈ జీవితం అనుకొనే విగతఖిన్నులకు
నిర్మలప్రేమ అనే స్వచ్చధారా ప్రవాహం ఆనందసందోహంలో ఓలలాడించగలదు

బ్రతుకే అంతుబట్టని ప్రశ్నైతే...ప్రేమ దానికి సమాధానం
గుండెలను పిండేసి జీవచ్చవాలను చేసే బాధే ఒక రోగమైతే...ప్రేమే దానికి విరుగుడు
అలాగాక మరి బాధే బాధ్యతైతే...ప్రేమ అద్దానికి సముచిత గుర్తింపు

నిజంగా బాధంటే ఏంటో తెలియాలంటే అది మనం పడేటప్పటికన్న పెట్టినప్పుడే తెలుసుకోవాలి
బాధ జీవితాన్ని దుర్భరం చేసి మరణం వైపునకు లాక్కేళితే ...ప్రేమ మనల్ని పునరుజ్జీవింపగలదు

- 16/11/2014

Tuesday, January 27, 2015

ఆనంద సద్విలాపము

ముందుమాటఆనందాన్ని మంచి, చెడులనే గుణాలు అంటవు. కాని విలాపము అలగకాదు, మంచి చెడు అనేవి భేదము దానికి వర్తిస్తుంది. మరి విలాపంలో ఏది సద్విలాపము అనగా, ఏదైతే భగవంతునికి సంబంధితమైన విలాపము ఉంటుందో అది మంచిది అని ఎంచబడుతుందని నా అభిప్రాయం. ఒక విషయము లేదా వ్యక్తిపైన ఆనందసద్విలాపములు రెండు ఏకకాలములోనో లేక వెనువెంటనే కలిగితే అదెట్లుంటుందోనని ఊహించినప్పుడు నా మదిలో మెరిసినదే ఈ క్రింది సీతాపరహణఘట్టమందలి రామునిపట్ల ఇతరులకు కలిగిన స్పందన.


ఓ మనసా! రాముడు ఎంత కృపాలుడో కదా
ఆర్తితో దరిజేరిన వారినెన్నడు విడువజలడే.

ఏమి ఉన్నదో కాన రాదు, శ్రీ రామ తారక నామమున!
ఎందరో పులకితులైరి అ దివ్యనామ శ్రవణమాత్రము చేత.

ఏమి భాగ్యము శబరి తల్లిది, తన హస్తములచేత స్వీకృతమైన ఫలభక్షాదులను ఆ భక్తవత్సలుడు ఆరగించెనె. ఇంత కాలము రామదేవుని సేవజేయలేక సమయము వృధా చేసితినే అన్న బాధ, ఇన్నేళ్ళకైనా ఆతడి సేవాభాగ్యము కలిగెనే అన్న అనందము శబరికి కలిగెను. ఆ మృదుసంభాషణుడు ఆమెతో ముచ్చటించు వేళలో, చుట్టు ప్రక్కలున్న జంతువృక్షాదులు తమకు ఆ భగ్యము కలుగలేదే అని విలపించసాగాయి. అయినను ఆ చిద్విలాసపురుషుడు తమ చెంతనే ఉన్నాడని గ్రహించి భావోద్వేగముతో కూడిన ఆనందాతిశయములను అవి వ్యక్తం చేసెను.

ఆంతవరుకు జగమంతయు ప్రచండముగా వీచి అలసి సొలసి ఉన్న వాయువు, రామదేవుని సమీపమున అలసట తీర్చుకొనుటకు తన వ్యర్ధ ప్రతామును విడిచి, పిల్లగాలి అయి అతిమెల్లగా మలయమారుతమై వీయసాగెను. ఆప్పుడే వాయువు తనలోని నిజసౌందర్యమును వీక్షించి సంతసించిన వాయువు, శ్రీ రామదేవుని సేవకు సమయము ఉపక్రమించలేక బాధానందమిళితుడై తన సుతుడైన హనుమంతుని శాశ్వత రామభక్తుడిని చేయుటకు మనోప్రతిజ్ఞ చేసెను. తాను స్వీయసేవ చేయలేకపోతినే అన్న బాధ, తన పుత్రుడు శ్రీ రామభక్తుడు అగుచున్నాడన్న ఆనందము ఆతనికి కలిగెను.

ఆంతకు మునుపు ఏంతో ఓర్పుతో భూభారం మ్రోసిన ఫుడమి, రాముని దీన ముఖకవళికలు పొడగనుటచేత హృదయవిదారకమై తన సహనమును కోల్పోయెను. తన దైనందిన కార్యభారము వల్లనో ఏమో, తన పుత్రిక కాన రాలేదే అన్న బాధ ఇసుమంతైనను రాలేదు కాని, ఈ అతిసున్నితహృదయుని చింత ఆమె యొక్క విలాపమునకు కారణమైంది. ఆంతలోనే రామదేవుడు భూమిపై ఉన్నాడనే స్పృహ కలిగి తాను మరల సహనమును తిరిగి పొందియుండెను. ఎక్కడ ఆ సీతాపతి యొక్క సున్నిత మృదుపాదములు కందిపోతవొ కదా అని ఆమె నొచ్చుకుని, అంతలోనే ఆ దీనదయాళుని భారము తను మొస్తున్నదని తెలిసుకొని నెమ్మదిని పొందెను.

యజ్ఞములనందు హవిస్సును సుదూర ప్రాంతములలో ఉన్న ఆయాలోకములందు వసించెడి దేవతలకు కొనిపోవుటకు తానే అర్హతను కలిగియున్న వాడినని అప్పటివరకు గర్వముతో విర్రవీగిన ఆగ్ని, సీతమ్మ తల్లిని అపహరించినది లంకేశ్వరుడగు రావణుడన్న చిరువార్త రామునికి తెలుపలేని తన నిస్సహాయతను తలచుకొని గర్వభంగమై అమిత దుఃఖమునకు లోనైయ్యను. రామదేవునికి ప్రత్యక్షముగా సహాయమును అందించలేకున్నా, రాబోవుకాలంలో మాయాసీతను లంకకు పంపి సీతమ్మతల్లిని రక్షించాలని కృతనిశ్చయుడయ్యెను. శ్రీ రామునికి యీ విధముగానైనా ఉపయోగ పడితినని తలచుకొని ఎట్టకేలకు ఆనందమును పొందెను.

సీతాపరహరణఘట్టమను విలపించుచున్న ఓ రామా, నీవే కాదయా విచారించునది, నీ అవస్థను చూచి ప్రకృతి సర్వం విలపించుచున్నది.

(2004)

ఒక చిరుకవిత

పాలనురుగులవోలె మీదు చిరునవ్వుల కొఱకు పాతాళము సైతం దాటిరానా...
అమాయకత్వముట్టిపడే మీ మోములంగాంచుటకు అమరావతినే అధిగమించనా...
పిల్లతిమ్మెరల సైతం తలపించి మరపించెడి మీదు పలుకులకై పృధ్విలో నే నిలిచి ఉండిపోనా...

(నేపథ్యం:సమాజం చేత అనాథలుగా పిలువబడే పిల్లల గురించి రాసిన చిఱుకవిత...)

నా విన్నపము

ఓ రామా!

నీవే నాలో నిక్షిప్తమైయున్న అజ్ఞనాంధకారమును తొలగించేటి సదాభాస నిర్విరామ ప్రతాపము గల ప్రచండోజ్వలసూర్యుడవు.

నీవే నా యొక్క సర్వ పాప కర్మలను  భస్మీపటలం చేసి, నాకు జన్మరాహిత్యమును చేకూర్చగల అఖండమద్వితీయ ప్రజ్వల అగ్నివి.

నీవే శాశ్వతమత్యద్భుతమనంతమపూర్వమప్రమేయమగు సచ్చిదానందమయ జ్యోత్స్నను నాకు ప్రసరింపగల శరద్కాల చంద్రుడివి.

నీవే నాకు దిక్కు. నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు తండ్రీ ? నీవు తప్ప నా నిజసంక్షేమము (మోక్షము) గూర్చి సదా ఎవరు  ఆలోచిస్తారు ? నీవు మాత్రమే స్వల్ప ప్రయాస చేత నన్ను తరింప దయార్థ హృదయము గల వాడవు! నన్ను రక్షింపగల సామర్థ్యము ఉన్నవాడవు నీవు ఒక్కడవే. ఆన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ.

(2004)
నేపథ్యము: "అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ" అనే ఉపనిషద్వాక్కులకు మరియు రామ (ర+అ+మ) అనే శబ్దమునకు 'ర' అనేది రవిబీజమని, 'అ' అనేది అగ్నిబీజమని, 'మ' అనేది చంద్రబీజమని ఊహించించి రాసిన కవిత ఇది.

భారతదేశం వెలిగిపోతోంది

ఆదిగో సుదూరాన నా భారతదేశం వెలిగిపోతోంది
కాదు కాదు మండుతోంది..కాలే కడుపులతో
నా దేశంలోని నదినదాలు ఉప్పొంగుతున్నాయి
కాదు కాదు వరదలవి…నిరాశావృత నిట్టుర్పులే అవి

(22/05/2014)

ఉగాది వర్ణన

ఉగాది పండుగకు కేవలం మన ఆంధ్రదేశమే కాక ప్రకృతి కూడా పులకితమై పరవశిస్తున్నది.

ఎప్పుడెప్పుడు ఉదయిద్దామా అని ఉబలాటంతో కూడిన సూర్యుని యొక్క హృదయము నుండి జనించిన లేలేత ఉషస్షులు భువికి బయలుదేరాయి.

అప్పుడప్పుడే మంచుతెరలు విడిపోతున్నవి, పచ్చని చెట్లన్ని పక్షుల కిలకిలారావాలతో నిండిపోయాయి. ఆప్పుడప్పుడే వసంతకుసుమాలు విచ్చుకుంటున్నాయి. వాటి యొక్క సుగంధ పరిమళాలు ఉగాదికి ఆహ్వానపత్రిక వలె ఉన్నవి.

అప్పుడే చిగుర్చిన వేప చిగుళ్ళు తమ భవితవ్యాన్ని ఉగాదికి అంకితం చేశాయి. భ్రమరాలు ఝుంకారనాదాలతో కుసుమాగ్రాలను చేరి వాటిలోని మకరందాన్ని గ్రోలుతున్నయి.

అంత మునుపటి వరకు వెన్నెలతో నిండిన ప్రకృతి నూతనోల్లాసభరిత ఉషస్సులతో వెల్లి విరిసింది. సెలయేటి శబ్దాలు సప్తస్వరములను అనుకరింపగా, సుర్యకాంతపుతొడుగులతో అవి బంగారు వన్నెను కలిగి తళతళలు ఆడుతున్నవి.

పచ్చని పైర్లలో ఉద్భవించే జానపదాలు ఉగాది పండుగలోని మాధుర్యాన్ని స్ఫురింపజేస్తున్నాయి. ఫ్రతి తిమ్మెర గాలికి ఊగిసలాడుతూ పసిడి పంటలు వాటి పారవశ్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఆటపాటలతో తెలియాడే పిల్లలు, దినసరి కార్యక్రమములలో సతమతమయ్యే పెద్దలు సైతం వయోభేదం లేకుండా షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి కోసం చేసే నిరీక్షణ, ఉగాది పండుగ యొక్క గొప్పదనాన్ని చెప్పకనే చెబుతున్నది.

(2004 ఉగాదికి ప్రసంగించిన కవిత)

శ్రీ కృష్ణ పింఛం

వర్ష ఋతువు యొక్క పరాకాష్టలో పులకిటమై నృత్యంచేసే నెమళ్ళలో వాటి పారవశ్యానికి చిహం విరాజితమైన పింఛం. కాని ఆ పింఛమునకు తన సహజస్థానమున కూడా అంత అందం కానరాలేదు.

ఎల్లప్పుడు పిల్లనగ్రోవిని కలిగి వృందావనవిహరి అయిన ఆ నందగోపాలుని శిరస్సున అలంకృతమైన ఆ పింఛము తన అందమునకు పరాకష్టను చవిచూసింది.

ఆ వృందావనంలోని ప్రతిమలయమారుతమునకు ఊగిసలాడుతు తన పారవశ్యాన్ని వ్యక్తంచేస్తోంది. తనకున్న ఒక్కకన్నునే వేయికన్నులుగా చేసుకొని తన అందాన్ని లోకానికి చాటుతోంది.

(19 Mar 2004)

వృందావన విశేషాలు

వృందావనంలోని ప్రతివస్తువు శ్రీ కృష్ణునితో
వాటికున్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తున్నాయి

వసంతకోకిల తన కంఠమాధుర్యముచే శ్రీ కృష్ణమురళీ
గానమును అనుకరింపజేసి విఫలమౌతున్నది

రాధారమణులతో శ్రీ కృష్ణుని రాసలీలలను
తలంపజేస్తున్నవి అక్కడి నెమళ్ళ నృత్యములు

ఆ వనమున గలగల పారుతున్న సెలయేళ్ళు తమ ఆనందాతిశయములను వ్యక్తం చేస్తున్నాయి
వాటినుండి వెలువడే శబ్దములు శ్రి కృష్ణమురళీ గానమునకు ప్రతిధ్వనివలే గోచరిస్తున్నాయి

అక్కడి కొండలు తమయొక్కవర్ణము నీలమేఘశ్యాముని వర్ణమని తలంచి పులకిస్తున్నాయి
లేళ్ళు తమచెవులను రిక్కరించి శ్రీ కృష్ణగానామృతమును గ్రోలుతున్నాయి

అతని పాదస్పర్శకు నోచుకోని కుసుమాలు సైతం తమ విలాపమును వ్యక్తపరుస్తున్నాయి

(19 Mar 2004) 

వసంతరాత్రి

అది వసంతకాలపు వెన్నెలరాత్రి...

సముద్రనౌకలు ఎడతెగక సుదీర్ఘతీరాలకై పరుగిడుతున్నాయి... 
నీలోత్పలాలు మంథరుని మోహింప వేయికన్నులతో ఎదురుచూస్తున్నాయి... 
చిన్నారులు చందమామ కథలు వింటూ అమ్మవొడిలో నిదురపోతున్నారు... 
అహర్నిశల భేదాన్ని ఎరుగకుండా కార్మీకులు నిరంతరం శ్రమిస్తున్నారు... 
కుముదనువీడి తనచెంతనెపుడు చేరతాడని రోహిణి పరితపిస్తోంది... 
వసంతకౌముది ప్రకృతికేకాక రాత్రికి కూడా సోయగాన్ని పెంపొందింపజేస్తోంది...

ఈ సుమనోహర ఆనందకల్లోలడోలాయమాన నిశాసమయాన,

"హే స్వాతంత్ర్యసమరయోధుడా!
ఏమి ఈ మందత్వం. ఇదే సమయం విజృంభించు...

అకుంఠిత దీక్షాఖడ్గంచే తిమిరచ్ఛేదన చేసి శ్రమజీవులను
మహోన్నతశిఖరాలకు గైకొనిపోవుము...

సమాజశ్రేయస్సును, వారి రక్షణాభివృద్ధియే లక్ష్యంగా చేసుకొని
కష్టతరమగు ప్రగతిపథమున కొనసాగుము...

ఈ ప్రయత్నములో నీ ధైర్యసాహస ప్రతిభాపాటవాలను ప్రదర్శింప
సమయమున రక్తాన్నిసైతం ధారపోయ వెనుకాడకుము...

నీ త్యాగనిరతిచే చిందే ప్రతి రక్తపుబొట్టు భరతమాతనొసట సౌభాగ్యతిలకమై
ఈ వసంతరాత్రి సమయాన నిశాసూర్యునివలె వర్ధిల్లు గాక!!!"

దీవించు మాయమ్మ మా పసిడి బొమ్మ

మా తెలుగు పల్లెలోని మాగాణి భూములు పాడిపంటలతో మనయింట సిరిసంపదలు వికసింపజేయగా…
జనపదాలే జానపదాలుగా మారి తెలుగు శ్రోతల హృదులను పులకింపజేయగా…

గిరుల ఝరులనధిగమించిన తెలుగుగంగ మనయింట సిరులు పొంగించగా…
పసిడిపంటలతో పిల్లపాపలతో మా పల్లెభూములు తులతూగుతుండగా…

తెలుగుతల్లి ముద్దుబిడ్డ రామరాజు మన మదిలో దేశభక్తి నింపగా…
అమరజీవి శ్రీ రాములు తన త్యాగనిరతిని మాకు అందించగా…

వీతన్నిటిన్ గాంచి పరవశించదా ఆంధ్రావని…
తెలుగువెలుగుల జిలుగులన్ గాంచి మనసార దివించదా మనతల్లి భారతావని…

పెద్దల ఆశిస్సులతో పిల్లల కేరింతల పసిడికాంతులతో
మా యువత ప్రగతిపథమ్మున కదం తొక్కగా...

ఈ యుగాది సందర్భమున ప్రతిజ్ఞ చేయుచుంటిమి
విజయమును వరింప దీవించు మాయమ్మ మా పసిడి బొమ్మ...

(2005 ఉగది అప్పుడు ప్రసంగించిన కవిత)

రామా ఏమని తెలుపను రా

రామా ఏమని తెలుపను రా
శ్రీ రామా ఏమని తెలుపను రా
నిన్నే వెల్చితిన్ కరుణాంతరంగ
నన్నే కావవె దీనదయాళో
దీన దయాళో!! దీన దయాళో!!!

రామా ఏమని పలుకను రా
శ్రీ రామా ఏమని పలుకను రా
నీ లీలలంగాంచి నే మూగవొయితిన్
నడిపించగ రార వో కౌసల్య వదనా
కౌసల్య వదనా!! కౌసల్య వదనా!!!

రామ చింతన

పాప పంకములను బాపుట నా తరమా
రక్షింపగ రారా స్వామి ! నీవు తప్ప ఎవరు దిక్కు

పాట రాదూ స్వామి నాదు నోట మాటైనా రాదు
ఏమని వర్ణింతునయ్యా ఓ చిద్స్వరూప

రార స్వామి రారా రారా ! నన్ను రక్షింపగ రారా
నీవు తప్ప ఎవరు దిక్కు నాకు ఓ పరాత్పర

ఏమి కరుణ ఏమి లాలన నీకు నీవే సాటి స్వామి
కుచ్ఛిత కూపమున మగ్గితినయ్యా ,వెలికి తీయుట నీదు తరమే
నను బ్రోవ రారా స్వామి, నీవే నాకు సదా రక్ష
జగమంతయు నీవు, పంతము విడజాలక ఉంటివే స్వామి
ఈ  దీనహృదయుడిని తరింపరా రామా నీవే రక్ష