నేలను వెలకట్టి అమ్మితె ముట్టును పలుకుబడి
నాగలి చేపట్టి దుక్కిదున్నితే ఉండబోదు కనుబడి
నేలను పంచి పాటపాడితె గౌరవమర్యాదల పన్నీటిజల్లు
నేలను మొక్కి విత్తునాటితే అవమానాలతో కన్నీరు పొర్లు
నేలను వెలదిగా లెక్కగడితే పడగలెత్తిన కోటిశ్వరుడు
నేలను కన్నబిడ్డలాగ చూసుకుంటే దరిద్ర దామోదరుడు
కంటిమీదకునుకులేకుండా పోలాన కాపుగాచేవాడు కర్షకుడు
కన్నుమిన్నుకానక కూడబెడుతు గుర్రుపెట్టేవాడు స్థిరాస్తి వ్యాపారి
నేలను అమ్మకం పెడితె అది ఎంతగానో లాభసాటి
పండినపంటకు మద్దతుధర గిట్టకపోవడం పరిపాటి
డబ్బు వెదజల్లితే ఎంతటి అందాన్నైనా కొనగలము
వ్యక్తిత్వమున్న ఆడదాని గుండెలో చోటుని కాదు
లాభనష్టాల బేరిజువేసి చౌకగ ఎలాంటి నేలనైనా కొనగలము
కాని ప్రేమ, శ్రమ, కాలం వెచ్చిస్తేగాని పంటని పండించలేము
కలకంట చిరునవ్వు ఒక ఇంటికి సిరి
అన్నదాత ముఖాన వెలుగు జాతికి సిరి
- కృష్ణచైతన్య (పరి, 23/12/2014)
స్ఫూర్తి: కొన్నేళ్ళ క్రితం ఒకనాడు కాకినాడ నుండి యానానికి కారులో వెళుతుంటే, తెలిసినవాళ్ళ మధ్య జరిగిన సంభాషణకి, "రైతు అంటే ఇంత చులకనా" అని మనసు చివుక్కుమని నాలో మెదిలిన స్ఫురణ ఇది.
కనుబడి=Prospect,ఉత్పత్తి; గిట్టుబాటు=to be acceptable (ఏదైనా బేరమాడినప్పుడు "గిట్టదు", "గిడుతుంది", అనేవి ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా వాడబడే పదాలు)
No comments:
Post a Comment